బిజినెస్

సుడిగుండంలో ఐటి రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే నాలుగేళ్లు ప్రతికూలమేనన్న సంకేతాలు
వేలాది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తున్న సంస్థలు
పనితీరు ఆధారంగా కోతలు పెట్టేందుకు సిద్ధం
ఉద్యోగుల తొలగింపు బాధాకరమన్న నారాయణ మూర్తి
హెచ్1-బి వీసా కఠిన విధానంతోనే సమస్యలు

బెంగళూరు, మే 26: భారతీయ ఐటి రంగం సుడిగుండంలో చిక్కుకుంది. రాబోయే నాలుగేళ్లు ప్రతికూలమేనన్న సంకేతాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. పనితీరు ఆధారంగా కోతలు పెట్టేందుకు ఐటి సంస్థలు సిద్ధమయ్యాయి. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఐటి సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండటం బాధాకరమని దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సంస్థ మాజీ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ‘అలా చేయడం బాధాకరం’. అని ఇటీవలి ఐటి ఉద్యోగుల తొలగింపులపై పిటిఐ అడిగిన ప్రశ్నకుగాను మూర్తి ఈ-మెయిల్‌లో స్పందించారు. అయితే ఇంతకుమించి ఆయన ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడకపోవడం గమనార్హం.
ఇన్ఫోసిస్ సైతం వందలాది మంది మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. మార్కెట్‌లో ఐటి వ్యాపార ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్నెళ్లకోసారి ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తామని, విధినిర్వహణ ఆకర్షణీయంగా లేనిపక్షంలో తొలగింపులు తప్పవని తెలిపింది. ఇన్ఫోసిస్ మాత్రమేగాక విప్రో, కాగ్నిజెంట్ సంస్థలూ వ్యయ నియంత్రణలో భాగంగా ఇదే తరహా చర్యలు చేపట్టినది తెలిసిందే.
అమెరికాకు చెందిన కాగ్నిజెంట్.. తమ డైరెక్టర్లు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. 6 నుంచి 9 నెలల వేతనాన్ని ఆఫర్ చేస్తూ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని సూచించింది. విప్రో కూడా దాదాపు 600 మంది ఉద్యోగులను వెళ్లిపోవాలని కోరింది. అయితే ఈ సంఖ్య 2 వేల వరకు ఉందన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ హెడ్ హంటర్స్ ఇండియా వివరాల ప్రకారం రాబోయే మూడేళ్లలో ఏటి 1.75 లక్షల నుంచి 2 లక్షల మంది ఉద్యోగుల తొలగింపు ఉండవచ్చన్నది అంచనా. నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరమ్‌కు మెకిన్సీ అండ్ కంపెనీ సమర్పించిన నివేదిక కూడా రాబోయే 3-4 ఏళ్లలో ఐటి సేవల సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించుకునే వీలుందని తెలిపింది.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమంది. దేశంలో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్న సంస్థల్లో ఐటి సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐటి సంస్థలు పెరుగుతున్న ఆటోమేషన్ ప్రక్రియ కారణంగా రాబోయే సంవత్సరాల్లో పెద్దగా ఉద్యోగులను తీసుకోలేమంటున్నాయి.
ఇకపోతే 140 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఐటి పరిశ్రమకు విదేశీ ప్రాజెక్టులే ప్రధాన ఆదాయ వనరులు. ముఖ్యంగా అమెరికా మార్కెట్.. దేశీయ ఐటి రంగానికి చాలా కీలకం. అయితే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి భారతీయ ఐటి సంస్థల ఆదాయానికేకాదు, ఉద్యోగులకూ ఎసరు పెట్టింది. హెచ్1-బి వీసాల జారీని ట్రంప్ కఠినతరం చేశారు. ఈ వీసాలపైనే భారతీయ ఐటి సంస్థలు అమెరికా ప్రాజెక్టుల కోసం తమ ఉద్యోగులను అక్కడకు పెద్ద ఎత్తున పంపిస్తున్నాయి. తమ దేశ ప్రాజెక్టుల్లో తమ పౌరులనే ఉద్యోగులుగా నియమించుకోవాలని, నిపుణత కూడిన కొద్ది మంది భారతీయులకే సదరు ప్రాజెక్టుల్లో అవకాశం ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం.. తాజా వీసా విధానంతో తేల్చి చెప్పింది.
ఫలితంగా గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో అమెరికాకు భారతీయ ఐటి ఉద్యోగులను పంపించలేని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో అమెరికన్లకు ఉద్యోగవకాశాలను పెంచుతున్న దేశీయ ఐటి రంగ సంస్థలు.. వ్యయ నియంత్రణలో భాగంగా అక్కడ పెరుగుతున్న ఖర్చులకు ఇక్కడ ఉద్యోగులను తగ్గించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నాయి. మొత్తానికి భారతీయ ఐటి రంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది.
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
మరోవైపు ఐటి రంగంలో ఉద్యోగాల కోత.. రియల్ ఎస్టేట్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ లంగ్ లాసల్లె అభిప్రాయపడింది.
భారతీయ ఐటి హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్, పుణె, నవీ ముంబయి, నోయిడా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కుదేలవుతోందని చెప్పింది. సొంతింటి కలను సాకారం చేసుకునే ఐటి ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని పేర్కొంది. ఉద్యోగాలు కోల్పోయి కొందరు, ఉద్యోగ భద్రతలేని కారణంగా మరికొందరు స్థిరాస్తి కొనుగోళ్లకు సాహసించలేకపోతున్నారని వివరించింది.

డిసెంబర్‌కల్లా ఎలక్ట్రిక్ వాహన విధానం
న్యూఢిల్లీ, మే 26: దేశంలో పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకు రానుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇది సిద్ధమవుతుందని కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన విధానానికి సంబంధించిన ముసాయిదా ప్రణాళికను రూపొందించేందుకు ఏర్పాటైన మంత్రుల గ్రూపు తమ సిఫార్సులను కేబినెట్ సెక్రటరీకి సమర్పించిందని, ప్రస్తుతం ఈ ముసాయిదా రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని మంత్రి గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు.

పెరిగిన ఐటిసి లాభం
న్యూఢిల్లీ, మే 26: బహుళ వ్యాపార సంస్థ ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 12.13 శాతం పెరిగి 2,669.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి వ్యవధిలో సంస్థ లాభం 2,380.68 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక నికర అమ్మకాలు కూడా ఈసారి 6.15 శాతం పెరిగినట్లు శుక్రవారం సంస్థ తెలియజేసింది. ఈసారి 15,008.82 కోట్ల రూపాయల అమ్మకాలు నమోదైతే, పోయినసారి 14,138.78 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. సంస్థాగత వ్యయం కూడా గతంతో పోల్చితే 5.29 శాతం ఎగిసి 11,363.78 కోట్ల రూపాయలకు చేరినట్లు చెప్పింది. నిరుడు ఇది 10,792.48 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు పేర్కొంది.

హెచ్‌పిసిఎల్ లాభం
రూ. 1,818.79 కోట్లు
న్యూఢిల్లీ, మే 26: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హెచ్‌పిసిఎల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 31 శాతం పెరిగి 1,818.79 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి వ్యవధిలో సంస్థ లాభం 1,387.91 కోట్ల రూపాయలుగా ఉంది. అమ్మకాలు ఈసారి 58,668 కోట్ల రూపాయలుగా నమోదైతే, పోయినసారి 48,145 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు శుక్రవారం తెలియజేసింది. కాగా, 2016-17లో మునుపెన్నడూ లేనివిధంగా 6,208.80 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సంస్థ సిఎండి సురానా చెప్పారు.

తగ్గిన సన్ ఫార్మా లాభం
న్యూఢిల్లీ, మే 26: దేశీయ ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 14 శాతం క్షీణించి 1,223 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి వ్యవధిలో సంస్థ లాభం 1,416 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం కూడా ఈసారి పడిపోయనట్లు శుక్రవారం సంస్థ తెలియజేసింది. ఈసారి 6,825 కోట్ల రూపాయలుగా నమోదైతే, పోయినసారి 7,415 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు శుక్రవారం తెలియజేసింది. కాగా, శుక్రవారం సమావేశమైన సంస్థ బోర్డు మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయ ముఖ విలువ కలిగిన ప్రతీ షేర్‌కు 3.5 రూపాయల డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.