బిజినెస్

పెద్ద నోట్ల రద్దు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) బుధవారం ఇక్కడ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా నమోదైంది. నిజానికి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధిలో కీలకమైన వ్యవసాయ రంగం గత ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగానే ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధిరేటు మాత్రం మూడేళ్ల కనిష్టానికి పతనమైంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 1,000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినది తెలిసిందే. కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తెస్తున్నామని స్పష్టం చేసిన ఆయన రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, సమాన విలువైన కొత్త నోట్లను పొందాలని కూడా ప్రజలకు సూచించారు. అయితే నగదు కొరత సమస్య, కేవలం 2,000 రూపాయల నోటు మాత్రమే అందుబాటులో ఉండటంతో తలెత్తిన చిల్లర సమస్య దేశ ఆర్థిక రంగాన్ని ఒక్కసారిగా కుంగదీసింది. కొనుగోళ్లు పడిపోయి వ్యాపారాలు దెబ్బతినగా, ఉత్పత్తి క్షీణించి పారిశ్రామిక రంగం కుదేలైంది. డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించినా ఈ ప్రభావం నుంచి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేకపోయింది. ఫలితంగా మూడేళ్ల కనిష్టాన్ని తాకుతూ గత 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతానికే పరిమితమైంది. ఎప్పుడూ జిడిపి గణాంకాలను ప్రభావితం చేసే వ్యవసాయ రంగం కూడా ఆదుకోలేకపోయింది. 2016-17లో దేశ వ్యవసాయ వృద్ధిరేటు 4.9 శాతంగా నమోదైంది. అయినప్పటికీ జిడిపి వృద్ధికి ఇది దోహదపడలేకపోయింది. కారణం పాత పెద్ద నోట్ల రద్దే. ఇదే అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి కూడా. మందగించిన వృద్ధిరేటును గాడిలో పెట్టడానికి వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగ్గించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. పారిశ్రామిక, వ్యాపార సంఘాలైన అసోచామ్, ఫిక్కీ అధ్యక్షులు సందీప్ జజోడియా, పంకజ్ పటేల్ ఈ తరహా డిమాండ్లనే వెలిబుచ్చుతున్నారు. ఇక మార్చితో ముగిసిన మూడు నెలల కాలం (జనవరి-మార్చి)లోనూ జిడిపి వృద్ధిరేటు 6.1 శాతానికి దిగజారింది. దీంతో ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును కలిగి ఉన్న దేశం భారత్’ అన్న గౌరవాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మొత్తానికి జిడిపి వృద్ధిరేటుకు పాత పెద్ద నోట్ల రద్దు సెగ బాగానే తగిలింది.
ఈసారి పెరుగుతుంది: సిఇఎ
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) దేశ జిడిపి వృద్ధిరేటు పెరుగుతుందన్న అంచనాను ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అర్వింద్ సుబ్రమణ్యన్ వ్యక్తం చేశారు. 0.75 శాతం మేర పెరగవచ్చన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందన్న విశ్వాసాన్ని ఆయన కనబరిచారు. ఇప్పటికే ఆ ఫలితాలు కనిపిస్తున్నాయన్న అభి ప్రాయాన్నీ వెలిబుచ్చారు.
7.5 శాతం: మూడీస్
దేశ ఆర్థిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం 7.5 శాతంగా నమోదు కావచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో 7.7 శాతంగా ఉండొచ్చన్న మూడీస్.. మోదీ సర్కారు చేపడుతున్న సంస్కరణల ప్రభావంతో రాబోయే నాలుగేళ్లలో జిడిపి 8 శాతాన్ని తాకవచ్చన్న అభిప్రాయాన్నీ వెలిబుచ్చింది.
నెరవేరిన ద్రవ్యలోటు లక్ష్యం: సిజిఎ
గత ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో ద్రవ్యలోటును నిర్ణీత 3.5 శాతానికే కట్టడి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ‘గత ఆర్థిక సంవత్సరం 2016-17 జిడిపిలో ద్రవ్యలోటు 3.51 శాతం లేదా 5.35 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది.’ అని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో 3.2 శాతంగానే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిజిఎ చెప్పింది. ఖర్చులు, ఆదాయం మధ్య గల వ్యత్యాసానే్న ద్రవ్యలోటుగా పరిగణిస్తారన్నది తెలిసిందే.