బిజినెస్

తపాలా శాఖతో చేయి కలుపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: తపాలా శాఖ ప్రారంభించనున్న పేమెంట్స్ బ్యాంక్‌లో భాగస్వాములు కావడానికి దేశ, విదేశాలకు చెందిన దాదాపు 40 ఆర్థిక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని కేంద్ర సమాచార, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వీటిలో సిటిగ్రూప్, బార్క్‌లేస్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర సంస్థలున్నాయన్నారు. శనివారం సెంట్రల్ ముంబయిలోని పరెల్ వద్ద ఈ-కామర్స్ పార్సిల్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన తపాలా శాఖ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ ‘పేమెంట్ బ్యాంక్ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం మాత్రమే వచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా నడుస్తోంది. అయినప్పటికీ ఇప్పటికే సుమారు 40 జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు తపాలా శాఖతో టై-అప్ కావాలని ఆత్రుతగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను తీసుకొచ్చాయి.’ అని అన్నారు. తపాలా శాఖ పేమెంట్ బ్యాంక్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్న సంస్థల్లో అమెరికాకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజం సిటిగ్రూప్, బ్రిటన్‌కు చెందిన బ్యాంక్ బార్క్‌లేస్, దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయన్నారు. కాగా, వచ్చే ఏడాది మార్చినాటికి బ్యాంక్ కార్యకలాపాలను ఆరంభించాలని తపాలా శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. బీమా విక్రయాల కోసం అలాగే గవర్నమెంట్ టు సిటిజన్, కంపెనీ టు సిటిజన్ సర్వీస్‌లను కల్పించాలనీ విజ్ఞప్తులు వస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఆర్‌బిఐ.. పేమెంట్ బ్యాంక్‌ల ఏర్పాటుకు వీలుగా 11 సంస్థలకు అనుమతినివ్వగా, అందులో తపాలా శాఖ కూడా ఉందన్నది తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ తపాలా శాఖే. బిర్లాలు, అంబానీలు, మహీంద్రాలతోపాటు దేశ, విదేశీ టెలికాం రంగ దిగ్గజాలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు జాబితాలో ఉన్నాయి. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా తపాలా శాఖకు 1.54 లక్షల కార్యాలయాలున్నాయి. ఉద్యోగులు కూడా భారీగానే ఉన్నారు. దీంతో పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయవచ్చని తపాలా శాఖ ఆలోచన. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తపాలా శాఖ ఆదాయం 2 శాతం పడిపోగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 37 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2015-16లో ఇప్పటిదాకా (ఏప్రిల్-డిసెంబర్)నైతే ఆదాయంలో 120 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. అయితే ఆ ఆదాయం ఎంత అనేది తాను చెప్పదలుచుకోలేదని ప్రసాద్ అన్నారు. ఇక గత ఏడాది 1,000 కోట్ల రూపాయల విలువైన క్యాష్ ఆన్ డెలివరీ ఆధారిత డెలివరీలను తపాలా శాఖ చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఈ-కామర్స్ మార్కెట్ దాదాపు 98,000 కోట్ల రూపాయలుగా ఉందని, మున్ముందు ఇది మరింత పెరుగుతూ పోతున్న సంకేతాలున్నాయన్నారు. ఈ-కామర్స్ ఆర్డర్లలో 65 శాతానికిపైగా చిన్నచిన్న పట్టణాల నుంచే వస్తున్నాయని, దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్ కలిగిన తపాలా శాఖకు ఇది ఎంతో లాభదాయకమని పేర్కొన్నారు. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా తపాలా శాఖను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు మంత్రి పిలుపునిచ్చారు.

చిత్రం... తపాలా శాఖ ఈ-కామర్స్ పార్సిల్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర సమాచార, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అనంతరం పార్సిళ్లను సిద్ధం చేస్తున్న సిబ్బంది