బిజినెస్

కేర్ హాస్పిటల్స్‌లో ఎడ్వెంట్ వాటా అబ్రాజ్ గ్రూప్ చేతికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: హైదరాబాద్‌కు చెందిన మల్టీ స్పెషాలిటీ హెల్త్‌కేర్ కేర్ హాస్పిటల్స్‌లో ఎడ్వెంట్ ఇంటర్నేషనల్ వాటాను యుఎఇకి చెందిన అబ్రాజ్ గ్రూప్ దక్కించుకుంది. మొత్తం 72 శాతం వాటాను దాదాపు 1,300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కేర్ హాస్పిటల్స్ మొత్తం విలువ 1,800 కోట్ల రూపాయల పైమాటే. ఇదిలావుంటే మూడేళ్ల క్రితం కేర్ హాస్పిటల్స్‌లో 72 శాతం వాటాను గ్లోబల్ పిఇ సంస్థ అయిన ఎడ్వెంట్ ఇంటర్నేషనల్ 610 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని, ఇప్పుడు రెండింతలకుపైగా లాభానికి అమ్ముకున్నట్లు ఈ లావాదేవీలకు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేర్ హాస్పిటల్స్‌లో మరికొంత వాటాను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసేందుకూ అబ్రాజ్ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

క్యాప్‌జెమిని ఇండియా
సిఇఒగా శ్రీనివాస్ కందుల

న్యూఢిల్లీ, జనవరి 13: ఫ్రాన్స్‌కు చెందిన ఐటి సేవల సంస్థ క్యాప్‌జెమిని.. తమ భారతీయ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా శ్రీనివాస్ కందులను నియమించింది. 2011లో పత్ని కంప్యూటర్స్‌ను ఐగేట్ కొనుగోలు చేయడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. 2007లో ఐగేట్‌లోకి శ్రీనివాస్ వచ్చారు. అయితే 2015లో ఐగేట్‌ను క్యాప్‌జెమిని సొంతం చేసుకుంది. 4 బిలియన్ డాలర్ల నగదు లావాదేవీల్లో భాగంగా ఐగేట్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాప్‌జెమిని సిఇఒగా శ్రీనివాస్ కందుల నియమితులైయ్యారు. ఇదిలావుంటే క్యాప్‌జెమిని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ శ్రీనివాస్ చేరారని, ఓ ప్రకటనలో బుధవారం క్యాప్‌జెమిని తెలిపింది. శ్రీనివాస్ అనుభవం తమ సంస్థ అభివృద్ధికి దోహదపడగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా క్యాప్‌జెమిని గ్రూప్ చైర్మన్, సిఇఒ పాల్ హెర్మెలిన్ వ్యక్తం చేశారు. 40కిపైగా దేశాల్లో విస్తరించిన క్యాప్‌జెమిని గ్రూప్‌లో 1.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 2014లో 10.573 బిలియన్ యూరోల ఆదాయాన్ని అందుకుంది.

మోటో జి ధరలను
తగ్గించిన మోటోరోలా

న్యూఢిల్లీ, జనవరి 13: ప్రముఖ విదేశీ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా బుధవారం తమ మూడో తరానికి చెందిన, మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్న మోటో జి స్మార్ట్ఫోన్ ధరను 16.6 శాతం తగ్గించింది. గత ఏడాది జూలైలో మార్కెట్‌కు పరిచయమైన దీని ధర 11,999 (1జిబి ర్యామ్ 8జిబి) రూపాయలు. 2జిబి ర్యామ్‌తో 16జిబి సామర్థ్యమున్న ఫోన్ ధర 12,999 రూపాయలు. అయితే ఇప్పుడు 1జిబి ర్యామ్ 8జిబి ఫోన్ ధర 9,999 రూపాయలకు పడిపోగా, 2జిబి ర్యామ్ 16జిబి ధర 10,999 రూపాయలు. కాగా, మోటో జి టర్బో ఎడిషన్ ధర కూడా సుమారు 14 శాతం తగ్గగా, 12,499 రూపాయలకు దిగివచ్చింది. మార్కెట్‌లో వచ్చినప్పుడు దీని ధర 14,499 రూపాయలు.

దక్షిణ కొరియాలో
ఎస్‌బిఐ శాఖ

ముంబయి, జనవరి 13: దక్షిణ కొరియాలో తొలి శాఖను ప్రారంభించినట్లు దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ బుధవారం తెలిపింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రారంభమైన ఈ శాఖ.. ఇరు దేశాల మధ్యగల ఆర్థిక భాగస్వామ్యం బలపడటంలో ముఖ్య భూమిక పోషించగలదన్న ఆశాభావాన్ని ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్ బి శ్రీరామ్ ఓ ప్రకటనలో వెలిబుచ్చారు. కాగా, విదేశాల్లో ఎస్‌బిఐకి 135కిపైగా శాఖలున్నాయి. విదేశాల్లో మరే భారతీయ బ్యాంకుకీ ఇన్ని శాఖలు లేవు.

భారత్‌లో ఎటిఎఫ్ అమ్మకానికి
బ్రిటిష్ పెట్రోలియంకు అనుమతి

న్యూఢిల్లీ, జనవరి 13: సుమారు రెండేళ్ల తర్వాత భారత్‌లో విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) అమ్మకానికి బ్రిటిష్ పెట్రోలియం (బిపి) సంస్థకు అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశీయంగా విమానాలకు జెట్ ఫ్యూయెల్‌ను సరఫరా చేయవచ్చని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బ్రిటిష్ పెట్రోలియంకు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఐరోపాలో రెండో అతిపెద్ద చమురు సంస్థ బిపి. దీని అనుబంధ సంస్థ బిపి ఎక్స్‌ప్లోరేషన్ (అల్ఫా).. 2014 జూన్ 11న భారత్‌లో ఎటిఎఫ్ మార్కెటింగ్‌కు అనుమతించాలంటూ దరఖాస్తు పెట్టుకుంది. దాన్ని తాజాగా ఆమోదించింది మోదీ సర్కారు.

చైనాతో భారత వాణిజ్య లోటు
44.87 బిలియన్ డాలర్లు

బీజింగ్, జనవరి 13: చైనాతో భారత వాణిజ్య లోటు గత ఏడాది 44.87 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 71.64 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనా ఎగుమతులు 58.25 బిలియన్ డాలర్లుగా, భారత ఎగుమతులు 13.38 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిజానికి 2015లో భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లుగా నిర్దేశించుకున్నారు. కాగా, 2014తో పోల్చితే చైనాకు భారత్ ఎగుమతులు క్షీణించాయి. 2014లో 16.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనా ఆర్థిక మందగమనం, ఆ దేశం విదేశీ ఎగుమతులపై విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలోనే భారతీయ ఎగుమతులు తగ్గిపోయాయని నిపుణులు విశే్లషిస్తున్నారు.

తెలంగాణలో సుజ్లాన్ గ్రూప్
సోలార్ పవర్ ప్రాజెక్టులు

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నుంచి ఆర్డర్లు

న్యూఢిల్లీ, జనవరి 13: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్) నుంచి 210 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్డర్లు అందుకున్నట్లు విండ్ టర్బైన్ తయారీ సంస్థ సుజ్లాన్ గ్రూప్ బుధవారం తెలిపింది. రాష్టవ్య్రాప్తంగా ఆరు రకాల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నుంచి ఓ లేఖను అందుకున్నట్లు సుజ్లాన్ ఎనర్జీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందులో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఒకటైతే, మరొకటి 50 మెగావాట్లదని, ఇంకో నాలుగు 15 మెగావాట్లవని సుజ్లాన్ వివరించింది.

పెరిగిన కరూర్ వైశ్యా లాభం

న్యూఢిల్లీ, జనవరి 13: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 34.20 శాతం పెరిగి 152.83 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 113.88 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,525.14 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,511.8 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు కరూర్ వైశ్యా బ్యాంక్ బుధవారం తెలియజేసింది. కాగా, ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు 0.96 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి 0.73 శాతం వృద్ధి చెందాయి.

తగ్గిన ఆర్‌ఐఐఎల్ లాభం

న్యూఢిల్లీ, జనవరి 13: రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్‌ఐఐఎల్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 25 శాతం క్షీణించి 3.96 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 5.32 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో ఆర్‌ఐఐఎల్ తెలిపింది. అయితే ఆదాయం మాత్రం దాదాపు యథాతథంగా 24.95 కోట్ల రూపాయలుగానే ఉండగా, ఈసారి లాభం తగ్గడానికిగల కారణాలను మాత్రం సంస్థ తెలియపరచలేదు.