బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ‘ఐఎమ్‌ఎఫ్’ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: ప్రపంచ వృద్ధిరేటుపై నెలకొన్న ఆందోళనలు బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ ఉదయం ప్రారంభం నుంచే నష్టాల్లో కదలాడాయి. చివరిదాకా ఇదే తీరు కొనసాగగా, ఒకానొక దశలో సెనె్సక్స్ దాదాపు 650 పాయింట్లు, నిఫ్టీ సుమారు 200 పాయింట్లు క్షీణించాయి. దీంతో సెనె్సక్స్ 24 వేల స్థాయిని, నిఫ్టీ 7,300 స్థాయిని చేజార్చుకున్నట్లైంది. అయితే ఆఖర్లో మదుపరులు పెట్టుబడుల వైపు కాస్త దృష్టి పెట్టడంతో సూచీలు కోలుకున్నాయి. అయినప్పటికీ సెనె్సక్స్ 417.80 పాయింట్లు పతనమవగా, 24,062.04 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 125.80 పాయింట్లు దిగజారగా, 7,309.30 వద్ద స్థిరపడింది. మంగళవారం ఈ ఏడాదికిగాను ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటుపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) అంచనా 3.4 శాతానికే పరిమితం కావడం మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీసింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలబాట పట్టడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. దీంతోపాటు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 28 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను గాయపరిచింది. వరుస నష్టాల నుంచి మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్న నేపథ్యంలో బుధవారం మళ్లీ భారీ నష్టాలకు లోనుకావడంతో మదుపరుల సంపద కూడా పెద్ద ఎత్తున ఆవిరైపోయింది. ఇకపోతే ఆయా రంగాలవారీగా నిర్మాణం, ఇంధనం, లోహ, విద్యుత్, బ్యాంకింగ్, చమురు, గ్యాస్, యుటిలిటీస్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్ రంగాల షేర్ల విలువ గరిష్ఠంగా 3.49 శాతం నుంచి 2.02 శాతం పడిపోయింది. షేర్లవారీగా అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, మారుతి, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్‌టిపిసి, ఒఎన్‌జిసి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ల విలువ 5.53 శాతం నుంచి 2.03 శాతం మేర దిగజారింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 3.82 శాతం నుంచి 1.03 శాతం మేర నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 3.15 శాతం నుంచి 2.68 శాతం మేర క్షీణించాయి.
మదుపరుల సంపద రూ. 1.84 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలకు లోనైన నేపథ్యంలో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే 1.84 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ 1,84,086 కోట్ల రూపాయలు క్షీణించి 90,64,734 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) విలువే 12,613 కోట్ల రూపాయలు దిగజారింది. ఆర్‌ఐఎల్ షేర్ విలువ దాదాపు 4 శాతం పతనమైంది.
28 నెలల కనిష్టానికి రూపాయి మారకం విలువ క్షీణత
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం బుధవారం 28 నెలల కనిష్టానికి పతనమైంది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో ఒకనొక దశలో 68 రూపాయల స్థాయిని దాటి 68.17 వద్దకు పడిపోయింది. అయితే తిరిగి కాస్త కోలుకుని 67.95 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ మంగళవారం ముగింపుతో పోల్చితే 30 పైసలు క్షీణించింది. కాగా, 2013 సెప్టెంబర్ 4న రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే 68.62 వద్దకు పడిపోయింది. తాజాగా ఇంట్రా-డేలో రూపాయి మారకం విలువ ఆ స్థాయికి దిగజారడం కలవరపాటుకు గురిచేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కూడా స్పందించింది. పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నామని స్పష్టం చేశాయి.