బిజినెస్

బజాజ్ బైక్ ‘వి’ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: భారత తొలి యుద్ధవిమాన నౌక, ప్రతిష్ఠాత్మక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి సేకరించిన లోహంతో దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ తయారుచేసిన మోటార్‌సైకిల్ అతిత్వరలో మార్కెట్‌లోకి రానుంది. వచ్చే నెల 1న ‘వి’ బ్రాండ్ పేరుతో ఈ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తోంది బజాజ్ ఆటో. ఈ మేరకు ఓ ప్రకటనలో బుధవారం బజాజ్ ఆటో స్పష్టం చేసింది. దశాబ్దాలపాటు భారత అమ్ములపొదిలో విశిష్ట సేవలందించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్.. దేశ కీర్తి, ప్రతిష్టలను ఇనుమడించింది. 1961 మార్చి 4న భారత నావికాదళ తొలి యుద్ధవిమాన నౌకగా మొదలైన ఐఎన్‌ఎస్ విక్రాంత్ పయనం.. 1997 జనవరి 31 వరకు సాగింది. ఆ తర్వాత 2012 వరకు ఓ మ్యూజియంగా సేవలందించిన విక్రాంత్.. 2014 నవంబర్‌లో స్క్రాప్ మెటల్‌గా మారిపోయింది. నావికాదళం నుంచి దీన్ని బజాజ్ ఆటో కొనుగోలు చేయగా, విక్రాంత్‌లో ఉన్న టన్నులకొద్దీ లోహంతో మోటార్‌సైకిళ్లను తయారు చేయడం ప్రారంభించింది. ఈ మోటార్‌సైకిల్‌నే ‘వి’ పేరుతో ఇప్పుడు బజాజ్.. దేశీయ మార్కెట్‌కు ఫిబ్రవరి 1న పరిచయం చేయనుంది. ‘దశాబ్దాలపాటు దేశ గౌరవానికి చిహ్నం ఐఎన్‌ఎస్ విక్రాంత్. భారత సైనిక బలగాలకు వెన్నుదన్నుగా నిలిచింది. అలాంటి విక్రాంత్ లోహంతో మేము మోటార్‌సైకిళ్లను తయారు చేస్తున్నందుకు గర్వపడుతున్నాం.’ అని బజాజ్ ఆటో లిమిటెడ్ మోటార్‌సైకిల్ వ్యాపార విభాగం అధ్యక్షుడు ఎరిక్ వ్యాస్ అన్నారు. తమ ఈ మోటార్‌సైకిల్ విక్రాంత్ స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగించగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. అంతేగాక ఇది మోటార్‌సైకిళ్ల రంగంలోనే చరిత్ర సృష్టిస్తుందని, వినియోగదారులను ఆకర్షించి భారీ అమ్మకాలను అందుకుంటుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. కాగా, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను హెచ్‌ఎమ్‌ఎస్ హెర్క్యులస్ పేరుతో బ్రిటన్ రూపొందించగా, దీన్ని 1957లో భారత్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత దీనికి ఐఎన్‌ఎస్ విక్రాంత్‌గా నామకరణం చేశారు. సంస్కృత పదం ‘విక్రాంత’ నుంచి విక్రాంత్ పేరును తీసుకున్నారు. ఇంత టి చరిత్ర కలిగిన విక్రాంత్ లోహంతో తయారవుతున్న మోటార్‌సైకిల్ ధర ఏ స్థాయిలో ఉంటుందోననేదానిపైనా ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొనగా, సరసమైన ధరతో వస్తే బజాజ్ అమ్మకాలను ఈ బైక్ గణనీయం గా పెంచడం ఖాయమన్న అభిప్రాయాలను మార్కెట్ విశే్లషకులు వెలిబుచ్చుతున్నారు.