బిజినెస్

కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 2: కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ). మంగళవారం ఇక్కడ ఆర్‌బిఐ ప్రధాన కార్యాలయంలో జరిపిన ఆరో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లపై నిర్ణయం ప్రభుత్వపైనే ఆధారపడి ఉందన్న సంకేతాలనిచ్చారు గవర్నర్ రఘురామ్ రాజన్. రాబోయే బడ్జెట్, అందులో పెట్టే ప్రతిపాదనల ప్రకారం తమ ద్రవ్యసమీక్ష ఇకముందు ఉంటుందని చెప్పకనే చెప్పారు రాజన్. కాగా, ద్రవ్యోల్బణం పెరుగుదల, వృద్ధిరేటు ఆందోళనలు, కీలక సంస్కరణల అమల్లో జరుగుతున్న జాప్యం మధ్య రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్) జోలికి ఆర్‌బిఐ వెళ్లలేదు.
ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసిన ఆర్‌బిఐ.. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) దేశ జిడిపి వృద్ధిరేటు 7.4 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.6 శాతంగా నమోదవ్వచ్చని పేర్కొంది. రబీలో పంట కోతలు నెమ్మదిగా జరిగే అవకాశాలున్నాయన్న రాజన్.. బడ్జెట్‌లో సంస్కరణల ఆధారంగానే వడ్డీరేట్లు మరింత తగ్గడానికి వీలుందన్నారు. కాగా, స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలుంటే మంచిందన్నారు. బ్యాంకులు మొండి బకాయిలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) ప్రమాదకర స్థాయిలో ఉన్నది తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 68 దరిదాపుల్లో కదలాడుతున్న క్రమంలో మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజన్ అన్నారు. రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్ష ఏప్రిల్ 5న జరుగుతుందన్నారు.

ద్రవ్యసమీక్షపై ఎవరేమన్నారు?
‘ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష నిర్ణయాలు అంతా ఊహించినట్లుగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని దగ్గరగా గమనిస్తున్నాం.’
-ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్
‘వడ్డీరేట్ల తగ్గింపు లేకపోవడం నిరాశ కలిగించింది. మున్ముందు సమీక్షల్లోనైనా ఊహించిన స్థాయిలో వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశిస్తున్నాం.’
-సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ
‘పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరగడానికి ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు దోహదం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లు తగ్గితే బాగుండేది.’
-్ఫక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా
‘ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల్లో కనీసం 25 బేసిస్ పాయింట్లైనా ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను తగిస్తే సంతృప్తికరంగా ఉండేది.’
-పిహెచ్‌డి చాంబర్ అధ్యక్షుడు మహేశ్ గుప్తా
‘ద్రవ్యసమీక్ష ఊహించినదే. అయితే బడ్జెట్ సంస్కరణలపైనే తదుపరి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయన్న ఆర్‌బిఐ వ్యాఖ్యలు పరిశ్రమకు సవాల్ విసురుతున్నాయి.’
-అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా
‘నగదు నిల్వల నిష్పత్తిని ప్రస్తుతమున్న 4 శాతం నుంచి తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. నానాటికీ పడిపోతున్న ఎగుమతులను పెంపొందించేలా చర్యలుండాలి.’
-ఇఇపిసి ఇండియా చైర్మన్ టిఎస్ భాసిన్
‘ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లు తగ్గించకపోవడం విచారకరం. బ్యాంకులైన గృహ రుణాలపై వడ్డీరేటును 9 శాతం దిగువకు తీసుకురావాలి.’
-క్రెడాయ్ అధ్యక్షుడు గీతాంబర్ ఆనంద్
‘తాజా ద్రవ్యసమీక్షలో నిర్ణయాలు ఊహించినవే. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను 0.75 శాతం తగ్గించే అవకాశాలున్నాయి.’
-ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య

చిత్రం... డిప్యూటి గవర్నర్లతో ఆర్‌బిఐ గవర్నర్ రాజన్ (మధ్యలో)