బిజినెస్

ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 5 వేల కోట్ల మూలధన సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ మార్చి 31లోగా ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5,000 కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చనుంది. ఈ మేరకు బుధవారం ఇక్కడ ఆర్థిక సేవల కార్యదర్శి అజులి చిబ్ దుగ్గల్ తెలిపారు. రాబోయే బడ్జెట్ సెషన్‌లో గ్రాంట్ల కోసం మూడో సప్లిమెంటరీ డిమాండ్‌ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ నిధుల మంజూరు జరుగుతుందన్నారు. బాసెల్-3 నిబంధనల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికల్లా భారతీయ బ్యాంకింగ్ రంగానికి 1.80 లక్షల కోట్ల రూపాయల మూలధనం అవసరం. ఇందులో 70,000 కోట్ల రూపాయలను మాత్రమే సమకూరుస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
మిగతా 1.10 లక్షల కోట్ల రూపాయల నిధులను బ్యాంకులే సమీకరించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 25,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం అందించాల్సి ఉండగా, ఇప్పటికే 13 బ్యాంకులకు 20,088 కోట్ల రూపాయలను ఇచ్చేసింది. మిగతా నిధులను ఈ రెండు నెలల్లో ఇవ్వనుందని దుగ్గల్ తాజాగా చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లోనూ 25,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి బ్యాంకులు అందుకోనుండగా, ఆపై రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2017-18, 2018-19) 10,000 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందనున్నాయి.

పెడన కలంకారీ
పరిశ్రమకు కష్టకాలం

మచిలీపట్నం (కోనేరు సెంటర్): దేశీయంగా హస్తకళల్లో మేటిగా విరాజిల్లుతున్న పెడన కలంకారీ పరిశ్రమ ప్రస్తుతం నీటి సమస్యతో కునారిల్లుతోంది. కలంకారీ హస్తకళల తయారీలో ప్రవాహపు నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రవహించే నది లేదా కాలువ నీటిలో ఒక తాడుపై మొదటి, చివరి దశ ముద్రణల తర్వాత వస్త్రాలను ఉంచుతారు. ఇలా ఉంచటం ద్వారా అవసరమైన రంగులు మాత్రమే మిగిలి వస్త్రంపై ప్రకాశవంతంగా రూపుదిద్దుకుంటాయి. నదీ జలాలు తప్ప సెలైన్ (ఉప్పు) నీటిని వినియోగిస్తే కలంకారీ వస్త్రాలు కళావిహీనంగా మారి నిరుపయోగమవుతాయి. కానీ కొంతకాలంగా కాలువల్లో నీటి ప్రవాహం నిలిచిపోవడంతో పరిశ్రమ మొత్తం గత ఏడాదిగా పెడనకు 55 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీకాకుళంలోని కృష్ణానదీ తీరానికి తరలి వెళ్లింది. అక్కడ పాయలుగా ప్రవహించే నదీ జలంలో నీటి ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అయతే ఇప్పుడు వేసవి కాలం సమీపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలకు నీటి భయం పట్టుకుంది. శ్రీకాకుళంలో ఆ కాస్త నీరు కూడా లేకపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన వెంటాడుతోంది. మరోవైపు కలంకారీ కళాఖండాల తయారీలో భాగంగా ముందుగా వస్త్రాలను ఆవుపేడ (కౌడంగ్)తో కలిపి చెరువుల్లో 24 గంటలు నానబెడతారు. దీన్ని సహజసిద్ధ బ్లీచింగ్ అంటారు. ఈ ప్రక్రియను గూడూరు మండలం కంకటావలో ప్రధానంగా కొన్ని కుటుంబాలు నిర్వహిస్తాయి. చెరువులు వెలవెలబోవడంతో దీనికీ నీటి కొరత ఏర్పడింది.

సిఎం సహాయనిధికి రూ. 1.4 కోట్ల
ఎపి స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ విరాళం

విజయవాడ: ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ భారీ విరాళాన్ని ప్రకటించింది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తన కార్యాలయంలో కలిసిన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ రూ. కోటి 40 లక్షల చెక్కును అందించారు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి ఇంత పెద్దఎత్తున వితరణ చేసిన తొలి సంస్థ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ కావడం విశేషం. ఇంత మొత్తాన్ని సహాయనిధికి అందించిన సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తమ కార్పొరేషన్‌కు ఎపిలో మొత్తం 54 గిడ్డంగులు ఉన్నాయని, 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయడానికి తగిన సదుపాయం సంస్థకు ఉందని ప్రసాద్ చెప్పారు.

శంషాబాద్ విమానాశ్రయంలో
‘డిమాండ్‌పై వినోదం’

దేశంలో తొలిసారిగా వినూత్న ప్రయోగం
ప్రయాణికులకు సినీ, టివి షోల సదుపాయం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రయాణికులకు ‘డిమాండ్‌పై వినోదం’ సదుపాయాన్ని బుధవారం ప్రారంభించింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్‌లో కేవలం మూడు నిమిషాల్లో సినిమాలు, టివిషోలు, వీడియో వంటి ఇతర కార్యక్రమాలను లోడ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని పొందేందుకు ఇంటర్నెట్, డాటా అవసరం లేదు. ఫ్రాప్‌కామ్ అనే సంస్థ భాగస్వామ్యంతో దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రారంభించామని అధికారులు తెలిపారు. అయతే ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే ప్రయాణికులు ముందుగా తమ స్మార్ట్ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫ్రాప్‌కామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో లభ్యమయ్యే ఫ్రాప్‌కామ్ యాప్ ద్వారా తమకు ఇష్టమైన సినిమాలను, వైఫై కనెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని త్వరలో దేశంలోని అన్ని విమానాశ్రయాలకు వర్తింపజేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.