బిజినెస్

జోరుగా సౌర విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: విద్యుదుత్పత్తికి అవసరమైన నీరు, థర్మల్ వనరులు తగ్గిపోవడంతో కరెంటు కష్టాలు మొదలైన నేపథ్యంలో సౌర విద్యుత్ కేంద్రాలు ఆదుకుంటున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ కంపెనీలు మెదక్ జిల్లాలో సౌర విద్యుత్ కేంద్రాలను విస్తరించడం ద్వారా రోజుకు 150 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రెప్ప పాటు కరెంటు పోకుండా తెలంగాణ వ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీకి సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. ఈ కేంద్రాలను నిర్మించడానికి అవసరమైన భూమిని కొనుగోలు చేసుకుని ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. పారిశ్రామిక జిల్లాగా మెదక్‌కు ఆసియా ఖండంలోనే గుర్తింపు ఉండటం, తెలంగాణ సర్కారు మరిన్ని పరిశ్రమలను ప్రోత్సహించడం, పారిశ్రామిక వేత్తలు మెదక్ జిల్లాపైనే ప్రత్యేక దృష్టి సారించడంతో అనేక సంస్థలు సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నేడు ముందుకు వస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే 40 పవన విద్యుత్ కేంద్రాల నిర్మాణం కొనసాగుతోంది. ప్రస్తుతానికి 11 సౌర విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయి నిర్మాణం కాగా వీటి ద్వారా 150 మెగావాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో సమర్పిస్తోంది. పది మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించి అంచెలంచెలుగా వీటిని విస్తరిస్తూ విద్యుదుత్పత్తిని పెంచడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సూర్యోదయంతో విద్యుదుత్పత్తి ఆరంభమై సూర్యాస్తమయంతో తనకుతానుగా నిలిచిపోయే పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఎతె్తైన గుట్టలను ఎంపిక చేసుకుని ఏటవాలుగా తూర్పు, పడమర దిక్కులో సూర్య కిరణాలకు అనుగుణంగా సౌర పలకలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు పది మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి లక్ష మేరకు సౌర పలకాలు అవసరం కానున్నాయి. జహీరాబాద్ మండలంలో హోతి (బి), చిన్న హైదరాబాద్, కోహీర్ మండలం దిగ్వాల్, న్యాల్‌కల్ మండలం రుక్మాపూర్, మండల కేంద్రమైన రాయికోడ్, ఝరాసంగం మండలం గినియార్‌పల్లి, మండల కేంద్రమైన అల్లాదుర్గం, మనూర్ మండలం డోవూర్, కల్హేర్ మండలం సిర్గాపూర్, దుబ్బాక మండలం హబ్సీపూర్, రేగోడ్ మండలం తాటిపల్లి, ఆందోల్ మండలం ఎర్రారం తదితర ప్రాంతాల్లో సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన స్థలం, పెట్టుబడులు, సాంకేతిక నిపుణులు, పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటే ఏడాది కాలంలోనే పది మెగావాట్ల విద్యుదు త్పత్తిని అందించే ప్లాంటును నిర్మాణం చేయవచ్చని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కల్హేర్ మండలం సిర్గాపూర్ గ్రామ శివారులో 2014 జనవరిలో పనులు ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తిచేసి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ప్లాంట్లలో అవసరమైన సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రత్యేక విద్యుత్ లైన్లను నిర్మించి దగ్గరలో ఉన్న 132 కెవి విద్యుత్ సబ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ విద్యుత్‌ను గృహ అవసరాలతోపాటు వ్యవసాయం, పరిశ్రమలకు కూడా సరఫరా చేస్తున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో మెదక్ జిల్లా ఎస్‌ఇ సదాశివరెడ్డి వెల్లడించారు. మరిన్ని మండలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకు వస్తూ భూములను కొనుగోలు చేస్తున్నాయి. రానున్న రోజులు గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు పవన విద్యుత్ కేంద్రాలు కూడా దోహదపడుతాయని నిపుణులు చెబుతున్నారు.

చిత్రం.. మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిర్గాపూర్ గ్రామ శివారులో
గుట్టపై ఏటవాలుగా భారీ స్థాయలో ఏర్పాటుచేసిన సౌర పలకాలు, సబ్ స్టేషన్లు