బిజినెస్

అతిక్రమిస్తే దండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీకి సోమవారం మద్దతు పలుకుతూ నిర్ణయం తీసుకున్న టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్.. తమ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ మంగళవారం టెలికామ్ ఆపరేటర్లను హెచ్చరించింది. డేటా సర్వీసుల్లో వివక్షాపూరితమైన ధరల వ్యత్యాసాన్ని రద్దు చేసేలా కొత్త నిబంధనలుంటాయన్న ట్రాయ్.. ప్రపంచంలోనే తొలిసారిగా ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్, ఎయిర్‌టెల్ జీరో తదితర జీరో రేటింగ్ ప్లాన్లపై నిషేధం విధించిన రెగ్యులేటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని మీరితే జరిమానాలు తప్పవని పిటిఐ ఇంటర్వ్యూలో ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ స్పష్టం చేశారు. రోజుకు 50,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామన్నారు.
హైదరాబాద్‌లో పెరిగిన
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వృద్ధిరేటు
నౌకరి డాట్‌కామ్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 9: హైదరాబాద్ ఐటి రంగంలో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, ఉద్యోగావకాశాల వృద్ధిరేటు ఆకర్షణీయంగా నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఉద్యోగావకాశాల్లో వృద్ధిరేటు 20 శాతం, బిపివోలో 26 శాతం, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో 22 శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తం పైనున్న అన్ని రంగాల్లో కలిపి వృద్ధిరేటు సగటున 18 శాతం నమోదైంది. ఫార్మా రంగంలో వృద్ధిరేటు 12 శాతం, హార్డ్‌వేర్, టెలికామ్ రంగాల్లో 10 శాతం చొప్పున వృద్ధిరేటు నమోదైందని నౌకరి డాట్‌కామ్ మంగళవారం పేర్కొంది.
ప్రతిష్ఠాత్మక ఎన్‌ఎఇలో
ముకేశ్, పిట్రోడాలకు సభ్యత్వం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, పిట్రోడా గ్రూప్ చైర్మన్ శ్యామ్ పిట్రోడాలు ప్రతిష్ఠాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎన్‌ఎఇ)లో సభ్యులుగా ఎన్నికయ్యారు. ముఖేశ్ అంబానీ.. ఇంజినీరింగ్, ఆయిల్ రిఫైనరీలు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల పరిశ్రమల్లో బిజినెస్ లీడర్‌షిప్ కోసం ఎన్నికవగా, భారతీయ రూరల్ టెలీకమ్యూనికేషన్స్ అభివృద్ధి కోసం శ్యామ్ పిట్రోడా ఎన్నికైనట్లు ఓ ప్రకటనలో ఎన్‌ఎఇ తెలిపింది. ఇంతకుముందు ఎన్‌ఎఇలో రతన్ టాటా (2013), పి ప్రదీప్ (2012), పి రామారావు (2012), ఎన్ ఆర్ నారాయణ మూర్తి (2010), పిసి కపూర్ (2009), ఎమ్‌ఎమ్ శర్మ (2006), డాక్టర్ ఆర్‌ఎ మషేల్కర్ (2003), డాక్టర్ రొద్దమ్ నరసింహ (1989)లకు సభ్యులుగా గౌరవం దక్కింది. ఈ క్రమంలో ఇప్పుడు ముకేశ్, పిట్రోడాలకూ ఆ గౌరవం దక్కగా, 1964లో స్థాపించిన ఎన్‌ఎఇలో మొత్తం 232 మంది విదేశీ సభ్యులుండగా, భారతీయుల సంఖ్య ఇప్పుడు పదికి చేరింది.
రేపటి నుంచి స్నాప్‌డీల్‌లో
మ్యాగీ అమ్మకాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: స్నాప్‌డీల్‌లో నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు గురువారం నుంచి మొదలవుతున్నాయి. పరిమితంగా పెట్టిన ప్యాక్‌ల కోసం బుధవారం రాత్రి 11 గంటల వరకు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు నెస్లే, స్నాప్‌డీల్ కల్పించాయి. ఆరోగ్యానికి హాని కలిగించే లెడ్, మోనోసోడియం గ్లూటమేట్ (ఎమ్‌ఎస్‌జి) పరిమాణం మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించి ఉన్నాయంటూ వీటి అమ్మకాలపై ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిషేధం విధించినది తెలిసిందే. అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమోదించిన ల్యాబ్‌లలో మ్యాగీ నూడుల్స్ వినియోగం క్షేమమేనని తేలడం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నిషేధాన్ని బాంబే హైకోర్టు తోసిపుచ్చడంతో మ్యాగీ అమ్మకాలు మళ్లీ మొదలైయ్యాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ మ్యాగీ అమ్మకాలను తిరిగి ప్రారంభించేలా గత ఏడాది నవంబర్‌లో నెస్లే, స్నాప్‌డీల్ చేతులు కలపగా, ఇప్పుడు అది ఆచరణలోకి వస్తోంది. కాగా, ఓట్స్ నూడుల్స్, ఆటా నూడుల్స్, కప్ నూడుల్స్‌నూ రాబోయే 3-4 నెలల్లో అందుబాటులోకి తెస్తామని నెస్లే ఇండియా సిఎండి సురేశ్ నారాయణన్ పిటిఐకి తెలిపారు. నిషేధంతో కోట్లాది రూపాయల మ్యాగీ ప్యాకెట్లను నెస్లే ధ్వంసం చేయగా, గడచిన పదిహేనేళ్లలో తొలిసారిగా 2015 ద్వితీయ త్రైమాసికంలో 64.40 కోట్ల రూపాయల నష్టాన్ని నెస్లే చవిచూడాల్సి వచ్చింది.

పిఎఫ్‌సి లాభం
రూ. 1,582 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి) స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2.6 శాతం పెరిగి 1,582.32 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,541.73 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 6,991.18 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,374.52 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు పిఎఫ్‌సి స్పష్టం చేసింది. వడ్డీ ఆదాయం 9.3 శాతం పెరిగి 6,284.26 కోట్ల రూపాయల నుంచి 6,870.58 కోట్ల రూపాయలకు ఎగిసింది.

సెయిల్ నష్టం
రూ. 1,529 కోట్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రభుత్వరంగ ఉక్కు ఉత్పాదక దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారీ నష్టాలకు లోనైంది. 1,528.73 కోట్ల రూపాయల నష్టాన్ని నమో దు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో 579.09 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఇక ఆదాయం ఈసారి 8,939.12 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 11,107.32 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సెయిల్ తెలియజేసింది. సంస్థాగత వ్యయం క్రిందటిసారి 10,370.89 కోట్ల రూపాయలుగా, ఈసారి 10,779.72 కోట్ల రూపాయలుగా ఉంది.