బిజినెస్

పరిశ్రమల నోట.. ‘స్వచ్ఛ’ పాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 2: ప్రాణాంతకమైన రసాయనాలతో కూడిన జల, వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై విచారణ చేసేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు త్వరలోనే నిజనిర్ధారణ కమిటీ మెదక్ జిల్లాలో పర్యటిస్తుందన్న సమాచారంతో ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలు ముందస్తు జాగ్రతలు పాటిస్తున్నాయి. కమిటీ సభ్యులు ఆరు మాసాల పాటు జిల్లాలో మకాం వేసి కాలుష్యకారక పరిశ్రమల ఆగడాలపై అధ్యయనం చేయనున్నారు. అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం నుంచి కాపాడాలని ఎంతగా వేడుకున్నా స్పందించని పరిశ్రమల యాజమాన్యాలు నిజనిర్ధారణ కమిటీ వస్తుందని తెలియడంతో ఎలాంటి పొరపాట్లు కనిపించకుండా స్వచ్ఛ పరిశ్రమల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆసియా ఖండంలోనే అధిక సంఖ్యలో పరిశ్రమల స్థాపనకు నెలవుగా మారిన మెదక్ జిల్లా కాలుష్యం కోరల్లో చిక్కుకోవడంతో పంటలు పండకపోగా ప్రజలు సైతం అనారోగ్యాల భారీన పడుతున్నారు. కాలుష్యం నుంచి కాపాడాలని జిల్లా ప్రజలు ఎంతగా మొరపెట్టుకున్నా కాలుష్య నియంత్రణ అధికారులు పెడచెవిన పెట్టడం, యాజమాన్యాలకు అనుగుణంగా వ్యవహరించడంతో పట్టించుకునే దిక్కుమొక్కు లేకుండా పోయింది. అయతే మెదక్ ప్రజలు మొరాలకించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. జిల్లా జడ్జిని నియమించి ఆయా పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఏయే గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయో నివేదిక సమర్పించా లని ఆదేశించిన విషయం తెలిసిందే. 1998 సంవత్సరంలో కోర్టు ఆదేశంతో అప్పట్లో జడ్జి పర్యవేక్షించి పటన్‌చెరు, సంగారెడ్డి, హత్నూర్, సదాశివపేట, జహీరాబాద్, జిన్నారం, తూప్రాన్ తదితర మండలాల పరిధిలోని 15 చెరువులు, పటన్‌చెరు పరిధిలోని నక్కవాగు, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, ఆరుట్ల, బచ్చుగూడెం, ఖాజిపల్లి, చిద్రుప్ప, బొంతపల్లి, సుల్తాన్‌పూర్, పల్ఫనూర్, కిష్టారెడ్డిపేట, లక్డారం, పెద్దకంజర్ల, బ్యాతోల్, ఐనోల్, చిట్కుల్, బొల్లారం, గుండ్లమాచ్నూర్ తదితర గ్రామాలను గుర్తించి నష్టపోయిన వివరాలను సేకరించింది. ఈ మేరకు ఆయా పరిశ్రమలకు తాఖీదులిచ్చి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయగా, కేవలం నాలుగు సంవత్సరాలు పరిహారంగా చెల్లించి నిలిపివేసినట్లు ఆరోపణలున్నాయి. దిగ్వాల్, కోనాపూర్, జిన్నారం, పోచారం, నందికంది, ఖాజిపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, దోమడుగు, రుద్రారం, బోర్పట్ల, మామిడిపల్లి తండాలు, అనేక గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంది. నిజానికి పరిశ్రమల్లోని వ్యర్థ రసాయనాలను శుద్ధి కేంద్రాలకు తరలించాల్సి ఉన్నా పరిశ్రమలకు సమీపాన ఉన్న వాగులు, చెరువుల్లోకి గ్యాలన్లకొద్దీ వ్యర్థ జలాలను యథేచ్ఛగా విడిచిపెడుతున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోననే భయంతో ఆయా పరిశ్రమలు అంతర్గతంగా బోర్లు తవ్వించి వాటి ద్వారా భూగర్భంలోకి కాలుష్య జలాలను వదిలిపెట్టిన దాఖలాలూ లేకపోలేదు. ఫలితంగా భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయ. మరోవైపు పరిశ్రమల వ్యర్థపు నీటిని ట్యాంకర్ల ద్వారా తరలించి వాగులు, చెరువుల్లో వదిలిన సంఘటనలు అనేకం. దీంతో వాగుల్లోని చేపలు మృతి చెందగా, రసాయనాలతో మిళితమైన నీటిని తాగిన అనేక పశువులు మృత్యువాతపడినా కాలుష్య నియంత్రణ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. పైగా, కాలుష్యంతో నిండిపోయిందని, కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదనే నిబంధనలను ఎత్తివేయించేందుకు కాలుష్య నియం త్రణ బోర్డు అధికారులు కాలుష్యం లేదని నివేదికలు ఇవ్వడం శోచనీయం. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌గా మారడంతో నగరం పరిధిలోని అనేక పరిశ్రమలు జిల్లాలోని ఆయా ప్రాంతాలకు వలస వచ్చాయి. దీంతో మెతుకుసీమగా భాసిల్లిన మెదక్ జిల్లా సగభాగం కాలుష్యమయంగా మారింది. కాలుష్యానికి గురైన ఆయా గ్రామాలకు చెందిన వారికి పరిశ్రమల్లో కనీసం ఉద్యోగం కల్పించకపోవడం యాజమాన్యాల నిరంకుశత్వానికి నిదర్శనమని చెప్పవచ్చు. కాలుష్యాన్ని నివారించాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అనంతరం జరిగే మంతనాలతో సమస్య అపరిష్కృతంగా మారుతుందని ప్రజలు వాపోతున్నారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం చెరువుల మరమ్మతుకు శ్రీకారం చుట్టగా, కాలుష్యమయంగా మారినట్లు సుప్రీంకోర్టు గుర్తించిన 15 చెరువులపై వివక్ష చూపించడం విడ్డూరంగా ఉంది. భూముల్లోకి కాలుష్య జలాలు, వ్యర్థపదార్థాలను పారబోస్తుండటంతో సారవంతమైన భూములు సైతం నిస్సారంగా మారిపోయాయి. పంటలు పండక రైతన్న లు.. కూలీలుగా మారుతున్న దుస్థితి నెలకొంది. ఇంకోవైపు కలుషిత జలాలను తాగడం వల్ల అంగవైకల్యం, గర్భస్రావాలు జరుగుతున్నట్లు అనేక ఆరోపణలు ఆయా పరిశ్రమలపై వెల్లువెత్తుతున్నాయి. కాలుష్యాన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు 32 నిబంధనలు విధించినా అందు లో కనీసం సగం కూడా అమలు చేయలేదంటే పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం ఏమిటో స్పష్టమవుతోంది. ఈ క్రమం లో కాలుష్యకారక పరిశ్రమలపై నిజనిర్ధారణ చేసేందుకు కమిటీ మరోమారు జిల్లాలో పర్యటించనుండడం తో తప్పులను సరిచేసుకునే ప్రయత్నంలో పరిశ్రమల యాజమాన్యాలు కృతకృత్యమైనట్లు తెలుస్తోంది. ఈ విధంగానైనా కొంత కాలుష్యం బెడద తగ్గుతుందని ఆయా గ్రామాల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి!

చిత్రం.. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కలుషిత నీరు, చెరువు వద్ద పేరుకుపోయన పారిశ్రామిక వ్యర్థాలు