బిజినెస్

ఈ త్రైమాసికంలోనూ అంతంతమాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) జనవరి-మార్చి త్రైమాసికం లాభాలను కూడా ప్రభావితం చేయనున్నాయన్న అభిప్రాయాన్ని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మొండి బకాయిల కారణంగా ఎస్‌బిఐ లాభం సగానికిపైగా పడిపోయినది తెలిసిందే. గతంతో పోల్చితే 67 శాతం దిగజారి 1,259.49 కోట్ల రూపాయల లాభంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ప్రస్తుత జనవరి-మార్చి త్రైమాసికంలో మొండి బకాయిలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్న భట్టాచార్య.. ఇది బ్యాంక్ లాభంపై ప్రభావం చూపే వీలుందన్నారు. మంగళవారం ఇక్కడి నుంచి ఎస్‌బిఐ జపాన్ డెస్క్‌ను ప్రారంభించగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భట్టాచార్య.. విలేఖరులతో మాట్లాడుతూ ‘ఈ జనవరి-మార్చి త్రైమాసికంలోనూ నిరర్థక ఆస్తులు మరింత పెరిగేలా ఉన్నాయి. ఫలితంగా బ్యాంక్ లాభాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.’ అన్నారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఎస్‌బిఐ మొండి బకాయిలు 72,791.73 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది డిసెంబర్ నాటికి ఇవి 61,991.45 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. గడచిన ఏడాది కాలంలో దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఎగబాకగా, ఈ మార్చి నాటికి ఈ మొండి బకాయిల విలువ మరింత పెరగవచ్చని భట్టాచార్య అంచనా వేశారు. కాగా, దేశంలోని 27 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారీ నష్టాలను అందుకుంది. ఇప్పటిదాకా ఏ బ్యాంక్ నమోదు చేయనంతగా, ఏకంగా 3,342 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇదంతా మొండి బకాయిల ఫలితమే. ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్ల క్లీనింగ్‌లో భాగంగా 2012-15 ఆర్థిక సంవత్సరాల్లో 1.14 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను బ్యాంకులు రద్దు చేశాయి. ఇందులో కేవలం గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో రద్దైనవే 53 శాతంగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ రోజులు గడుస్తున్నకొద్దీ మొండి బకాయిల విలువ మరింతగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ విషయంలో బ్యాంకులకు స్పష్టమైన హెచ్చరికలు చేయగా, తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థాన సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుని ఆర్‌బిఐపై సీరియస్ అయ్యంది. ఇదిలావుంటే భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న జపాన్ మదుపరుల కోసమే ఈ జపాన్ డెస్క్‌ను తెరిచినట్లు భట్టాచార్య చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి విధానాలు, నిబంధనలు, మార్గాలు తదితర సమాచారం జపాన్ మదుపరులకు ఈ డెస్క్ అందిస్తుందన్నారు.
chitram...
ఎస్‌బిఐ జపాన్ డెస్క్ ప్రారంభోత్సవంలో భట్టాచార్య

ఏపిలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్
ఏర్పాటును ఆమోదించిన సిసిఐ

హైదరాబాద్, ఫిబ్రవరి 16: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయల్), ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపిజిడిసి) సంయుక్తంగా ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అనుమతించింది. కాకినాడలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్, ట్రేడింగ్ నిమిత్తం ఏపిజిడిసి, గెయిల్, షెల్, ఇఎన్‌జిఐఇ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఇందులో ఏపి ప్రభుత్వం, గెయిల్‌కు 48 శాతం వాటా, జిడిఎఫ్ ఎస్‌యుఇజడ్, షెల్ సంస్థకు 26 శాతం చొప్పున వాటాలు ఆమోదించారు. గత ఏడాది ఎల్‌ఎన్‌జి ఏర్పాటు, ట్రేడింగ్ నిమిత్తం రెండు ఎంఓయూలపై సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.

వచ్చే ఏడాది పది కొత్త ప్రాజెక్టులు

ప్రకటించిన సింగరేణి

హైదరాబాద్, ఫిబ్రవరి 16: వచ్చే ఏడాది పది కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు సింగరేణి సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ ప్రకటించారు. అలాగే 660 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని కూడా నిర్ణయించామన్నారు. బెల్లంపల్లి ఒసి-2, కాసీపేట-2, శాంతిఖని కంటిన్యూయస్ మైనర్, కోయగూడెం ఒసి-2, జెవిఆర్‌ఒసి-2, మణుగూరు ఒసిసి, కెటికె ఓసి, పివికె కంటిన్యూయస్ మైన్, కెకెఓసి, ఒడిశాలోని నైటీ బ్లాక్‌లను ప్రారంభించనున్నట్లు ఆయన మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో వివరించారు. కాగా, వర్తమాన సంవత్సరంలో 600 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. కొత్తగా ప్రారంభం కావాల్సిన గనుల ప్లానింగ్, ప్రభుత్వ అనుమతులు పొందడం, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ సంబంధిత విషయాలను ఉన్నతాధికారులతో, నిపుణులతో చర్చించామన్నారు. గనుల ప్రణాళిక అమలు నుంచి గనుల తవ్వకం వరకు అన్ని దశల్లో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సిఎండి ఆదేశించారు. నైనీ బ్లాక్‌ను మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గును వెలికితీసే అవకాశం ఉందన్నారు.

27న ‘ది లేబుల్ బజార్’ ఫ్యాషన్ ఎగ్జిబిషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 16: దేశవిదేశాలకు చెందిన ప్రముఖ డిజైనర్ల కలెక్షన్లతో హైదరాబాద్ వేదికగా ఓ సరికొత్త ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతోంది. ఈ నెల 27న పార్క్ హయత్‌లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ను యువ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ స్టైలిష్ట్‌లు అనం మీర్జా, తాన్యా రావ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కర్టెన్‌రైజర్ ఇప్పటికే జరగగా, ఇందులో టాలీవుడ్ నటి శ్రీయా శరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత పెళ్లిళ్ళ సీజన్‌కు అనుగుణంగా, నగరవాసుల ఫ్యాషన్ అభిరుచికి తగ్గట్లుగా ఈ ఎగ్జిబిషన్‌లో జ్యుయెల్లరీ, యాక్ససరీస్, లెహంగాస్, ట్యూనిక్స్, అనార్కలీస్, బ్యూటీ ప్రోడక్ట్స్, శారీస్, షూస్, బ్యాగ్స్, క్లచస్, పార్టీ అండ్ క్యాజువల్ వేర్ తదితర కలెక్షన్స్‌ను అందుబాటులో ఉంచినట్లు తాన్యా తెలిపారు. సుమారు 35 మంది డిజైనర్లు ఈ ఎగ్జిబిషన్‌లో తమ ఫ్యాషన్ కలెక్షన్లను పెడుతున్నట్లు చెప్పారు. అందరికీ ఈ ఎగ్జిబిషన్‌లో తమకు కావాల్సిన వాటిని ఒక్కచోటనే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోందని తాన్యా అన్నారు.

ఐసిఎఐ హైదరాబాద్‌కు నూతన కార్యవర్గం

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) హైదరాబాద్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఐసిఎఐకి సంబంధించిన వ్యవహారాలను చార్టడ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949 ప్రకారం ప్రత్యేక కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. ఇందులో 40 మంది సభ్యులుంటారు. ఆందులో 32 మంది ఇతర సభ్యుల చేత ఎన్నుకోబడతారు. మిగిలిన 8 మందిని కేంద్ర ప్రభుత్వం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇతర భాగస్వామ్య సభ్యులు ఎంపిక చేస్తారు. కాగా, ఐసిఎఐ అధ్యక్షుడు దేవారాజారెడ్డిని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా సన్మానించింది.