బిజినెస్

మదుపరి మెడకు మొండి బకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు.. వాటి మార్కెట్ విలువను మించిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన బ్యాంకుల మార్కెట్ విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, ఈ బ్యాంకుల మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) మాత్రం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. అంటే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో 100 రూపాయలను పెట్టుబడిగా పెట్టిన ప్రతి మదుపరిపై 150 రూపాయల మొండి బకాయి భారం ఉందన్నమాట. ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లోని మొత్తం ఎస్‌బిఐసహా 24 ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్ విలువ 2,62,955 కోట్ల రూపాయలుగా ఉండగా, డిసెంబర్ 2015 నాటికి ఈ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 3,93,035 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో మార్కెట్ విలువతో పోల్చితే మొండి బకాయిల విలువ 1.5 రెట్లు అధికం. ఒకవేళ గనుక ఇప్పుడున్న రుణాలకు సంబంధించి తాజాగా మొండి బకాయిలను ప్రకటిస్తే ఆ విలువ సుమారు 8 లక్షల కోట్ల రూపాయలను తాకుతుందని అంచనా. మరోవైపు దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఈ మొండి బకాయిల తీవ్రత చాలా తక్కువగా ఉండటం.. రుణాల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉదాసీనత, వాటి మంజూరులో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల మార్కెట్ విలువలో వాటి నిరర్థక ఆస్తులు కేవలం 6.6 శాతంగా ఉన్నాయి. ఇప్పటికే మొండి బకాయిల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో పెద్దఎత్తున ప్రభుత్వ బ్యాంకులు నష్టాలకు లోనయ్యాయి. ఎస్‌బిఐసహా మరికొన్ని బ్యాంకుల లాభాలు ఆవిరైపోయాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికంపైనా మొండి బకాయిల ప్రభావం ఉంటుందని ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ముందుగానే చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు ప్రమాదకర స్థాయిని మించిపోయిన నేపథ్యంలో, రాజకీయ, ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్న తరుణంలో బాకీల వసూళ్లలో బ్యాంకులకు స్వేచ్ఛనిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సంకేతాలిస్తున్నారు. ఆర్‌బిఐ కూడా మొండి బకాయిలను వదిలించుకోవడానికి 2017 మార్చిని డెడ్‌లైన్‌గా విధించింది. దీంతో బ్యాంకులు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమయ్యాయి.