బిజినెస్

కలిసొచ్చిన చమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా లాభాల్లో ముగిశాయి. వరుసగా సూచీలు నాలుగో రోజూ లాభాల్లోనే కొనసాగగా, రెండు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న సంకేతాల మధ్య చమురు, గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 79.64 పాయింట్లు పెరిగి 23,788.79 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 23.80 పాయింట్లు ఎగిసి 7,234.55 వద్ద స్థిరపడింది. హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, రియల్టీ, మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్ల విలువ 1.10 శాతం నుంచి 0.49 శాతం పెరిగింది. మిడ్-క్యాప్ సూచీ 0.75 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.46 శాతం చొప్పున పెరిగాయి.

మద్యం బ్రాండ్లతో బీర్, వైన్లను కలపొద్దు

అఖిల భారత బ్రూవర్స్ సంఘం డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే మద్యం బ్రాండ్లతో తక్కువ శాతం కలిగిన బీర్, వైన్లను కలపవద్దనీ అఖిల భారత బ్రూవర్స్ సంఘం డైరెక్టర్ జనరల్ శోభన్ రాయ్ డిమాండ్ చేశారు. ఇతర దేశాలలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్యాన్ని ప్రోత్సహిస్తుండగా, భారత్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని శోభన్ రాయ్ సోమవారం ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం అలవాటును మాన్పించలేని పరిస్థితిలో ఆల్కహాల్ తక్కువగా ఉండే మద్యాన్ని ప్రోత్సహించడం ఒక్కటే ప్రత్యామ్నాయం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది సామాజిక అవసరంగా కూడా ప్రభుత్వాలు వ్యవహారించాల్సి ఉందన్నారు. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వాలు ఆదాయ వనరులుగానే చూస్తున్నాయని పేర్కొన్న ఆయన ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్యాన్ని, ఎక్కువగా ఉండే మద్యంతో ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు. ఐఎంఎఫ్‌ఎల్ బ్రాండ్లతో సమానంగా బీర్, వైన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయడం దారుణమన్నారు. తెలంగాణలో ఏటా 515 లక్షల ఐఎంఎఫ్‌ఎల్ కేసుల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, 500 లక్షల కేసులు బీర్ల విక్రయాలని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఐఎంఎఫ్‌ఎల్ మద్యంలో 1,983 లక్షల లీటర్ల ఆల్కహాల్ కలిగి ఉండగా, బీర్‌లో కేవలం 234 లక్షల లీటర్ల ఆల్కహాల్ మాత్రమే ఉంటుందని శోభన్ రాయ్ వివరించారు. కాగా, దేశంలో 18,000 మంది జనాభాకు ఒక్క మద్యం షాపు కలిగి ఉండగా, చైనా వంటి దేశాల్లో 300 మందికి ఒక్క మద్యం షాపు ఉందని గుర్తు చేశారు. మొత్తంగా ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే బీర్, వైన్ అమ్మకాలను ప్రోత్సహించేందుకు వీటిని ఐఎంఎఫ్‌ఎల్ మద్యంతో కలపకుండా తక్కువ పన్ను వసూలు చేసి ప్రోత్సహించాలన్నారు.

జికా ఇకపై టియాగో
కారు పేరు మార్చిన టాటా మోటార్స్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రముఖ దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ త్వరలో తీసుకొస్తున్న తమ నూతన వాహనం పేరును జికా నుంచి టియాగోగా మార్చింది. సోమవారం ఓ ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. జికా పేరిట ప్రాణాంతక వైరస్ ఉన్న నేపథ్యంలో కొత్త కారు పేరును మార్చాలని గత నెలలో నిర్ణయించుకున్న టాటా మోటార్స్.. అందుకు అనుగుణంగా అనే్వషణలో పడింది. ఈ క్రమంలోనే టియాగో పేరును ప్రకటించింది. దీన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు టాటా మోటార్స్ దరఖాస్తు చేసుకోగా, మార్చి చివర్లో ఈ కారును మార్కెట్‌కు పరిచయం చేయనుంది. టియాగోతోపాటు సివెట్, అడోర్ పేర్లను పరిశీలించిన టాటా మోటార్స్.. సామాజిక, మొబైల్ ఫోన్ మాధ్యమాల్లో అత్యధికులు టియాగోకే ఓటు వేయడంతో అదే ఖరారైంది.

గుంటూరు మిర్చియార్డుకు
లక్షా 66వేల బస్తాలు
గుంటూరు, ఫిబ్రవరి 22: మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసిన మిర్చిని పెద్దఎత్తున మిర్చియార్డుకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రికార్డు స్థాయిలో గుంటూరు మిర్చియార్డుకు 1,66,198 బస్తాలు తెచ్చారు. వీటిలో 1,44,516 బస్తాల అమ్మకాలు జరిగాయి. సరాసరి ధర క్వింటాల్‌కు 14,700 రూపాయలు పలికింది. నెంబర్ 5 రకం అత్యధికంగా 14,700 రూపాయలు పలకగా 334 రకం 14,600, 341 రకం 14,400, 273 రకం 13,900, సూపర్ 10 రకం 13,400 రూపాయల చొప్పున ధర పలికాయి.

భారీగా తీసుకొచ్చిన
మిర్చి బస్తాలతో రైతులు

శ్రీసిటీలో రోట్‌లాక్స్ ఉత్పత్తులు ప్రారంభం

సత్యవేడు, ఫిబ్రవరి 22: బ్రిటన్‌కు చెందిన రోట్‌లాక్స్ సంస్థ సోమవారం శ్రీసిటీ సెజ్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఆ సంస్థ డైరెక్టర్ సీమ్స్‌సేల్స్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీలో రోట్‌లాక్స్ సంస్థ ఏర్పాటు కావడంతో ప్రపంచ దేశాలన్నీ ఇటువైపు చూస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎంతో ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ సీనియర్ సలహాదారు సుచిత్‌రామన్, జిఎం ప్రసన్న రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీసిటీ సెజ్‌లో రోట్‌లాక్స్ కార్యకలాపాలను
ప్రారంభిస్తున్న సంస్థ ప్రతినిధులు

30 నెలల కనిష్టానికి రూపాయి

68.61 వద్దకు దిగజారిన విలువ

ముంబయి, ఫిబ్రవరి 22: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 30 నెలల కనిష్టానికి దిగజారింది. 15 పైసలు కోల్పో యి 68.61 వద్దకు పడిపోయింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న తరుణంలో దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి డాలర్‌కు డిమాండ్ ఏర్పడింది. సోమవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో 68.50 నుంచి 68.70 మధ్య రూపాయి విలువ కదలాడింది. ఈ క్రమంలో ఆల్‌టైమ్ హై కనిష్ట స్థాయికి క్షీణిస్తుందా? అన్న అనుమానాలు ఒకానొక దశలో కలిగాయి. 2013 ఆగస్టు 28న డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 68.80 వద్దకు పడిపోగా, ఇదే రోజున ఒక దశలో 68.85 స్థాయికి పతనమైంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో రూపా యి విలువ దిగజారలేదు. ఇప్పటివరకు రూపాయి విలువ కనిష్టం ఇదే. అయితే సోమవారం ఈ స్థాయిలను మించుతుందా? అన్నతీరులో రూపాయి నష్టాలు సాగాయి.