బిజినెస్

విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా 900 సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్.. తమ రుణగ్రహీతల్లో ఏకంగా సుమారు 900 సంస్థలని ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్లు)గా ప్రకటించింది. ఈ జాబితాలో విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయెల్లరీ, ఫరెవర్ ప్రీషియస్ జ్యుయెల్లరీ అండ్ డైమండ్స్, జూమ్ డెవలపర్స్, నాఫెడ్, ఎస్ కుమార్ నేషన్‌వైడ్ తదితర సంస్థలున్నాయి. ఇటీవల లిక్కర్‌కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ కింగ్‌ఫిషర్‌ను కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించినది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికికే మొండి బకాయిలు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో చాలావరకు ప్రభుత్వ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా నమోదైనది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐసహా కొన్ని బ్యాంకుల నికర లాభాలు సగానికిపైగా ఆవిరైపోగా, మరికొన్ని బ్యాంకులు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీనంతటికీ కారణం నిరర్థక ఆస్తులే (మొండి బకాయిలు). ఈ త్రైమాసికం (జనవరి-మార్చి)లోనూ లాభాలపై మొండి బకాయిల ప్రభావం ఉంటుందని ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తాజాగా దాదాపు 900 సంస్థలని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. ఈ సంస్థలు తీసుకున్న రుణాల విలువ సుమారు 11,000 కోట్ల రూపాయలు. ఇందులో గరిష్ఠంగా విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయెల్లరీ (రూ. 900.37 కోట్లు), ఫరెవర్ ప్రీషియస్ జ్యుయెల్లరీ అండ్ డైమండ్స్ (రూ. 747.98 కోట్లు), జూమ్ డెవలపర్స్ (రూ. 410.18 కోట్లు), నాఫెడ్ (రూ. 224.26 కోట్లు), ఎస్ కుమార్ నేషన్‌వైడ్ (రూ. 146.82 కోట్లు) సంస్థల బకాయిలున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా 1,500 కోట్ల రూపాయల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు బకాయి పడింది. మరోవైపు మొండి బకాయిలను వదిలించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) విధించిన డెడ్‌లైన్‌లో భాగంగా ఈ మార్చి 31లోగా 3,000 కోట్ల రూపాయల నిరర్థక ఆస్తులను ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ సంస్థలకు (ఎఆర్‌సి) పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమ్మేయనుంది. నిజానికి గడచిన ఆరేళ్లలో ఎఆర్‌సి మార్కెట్‌కు వెళ్లని ఏకైక బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకేనని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంతసుబ్రమణ్యన్ పిటిఐకి తెలిపారు. అయితే ముంచుకొస్తున్న బాసెల్-3 నిబంధనలు, ఆర్‌బిఐ డెడ్‌లైన్, బ్యాంక్ శ్రేయస్సు దృష్ట్యా ఇప్పుడు ఎఆర్‌సిల వద్దకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెళ్లకతప్పడం లేదు. రుణాలు తీసుకున్నవారిలో తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారు జాతి ప్రయోజనాల దృష్ట్యా చెల్లించాలని కూడా ఉషా అనంతసుబ్రమణ్యన్ విజ్ఞప్తి చేస్తుండటం బ్యాంకింగ్ రంగాన్ని మొండి బకాయిలు ఏ స్థాయిలో భయపెడుతున్నాయో అర్థమవుతోంది. ఇదిలావుంటే గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు గతంతో పోల్చితే 5.97 శాతం నుంచి 8.47 శాతానికి ఎగబాకాయి. నికర నిరర్థక ఆస్తులు సైతం 3.82 శాతం నుంచి 5.86 శాతానికి ఎగిశాయి. 2014 డిసెంబర్ 31 నాటికి 22,211.43 కోట్ల రూపాయలుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు.. 2015 డిసెంబర్ 31 నాటికి 34,338.22 కోట్ల రూపాయలకు పెరిగాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 13,787.76 కోట్ల రూపాయల నుంచి 22,983.40 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గనిర్దేశకాల ప్రకారం విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ముద్రపడిన సంస్థకు మరే ఇతర బ్యాంక్, ఆర్థిక సంస్థలు మళ్లీ రుణాలివ్వవు. అంతేగాక బకాయిపడిన మొత్తం చెల్లించి విల్‌ఫుల్ డిఫాల్టర్ జాబితా నుంచి పేరు తొలిగించుకున్నాక కూడా ఐదేళ్లపాటు ఆ సంస్థ ప్రమోటర్లకు మరే ఇతర సంస్థల కోసం రుణాలు తీసుకునే సౌకర్యం ఉండదు.