బిజినెస్

ఎస్‌బిఐ విల్‌ఫుల్ డిఫాల్టర్ల రుణాల విలువ రూ. 11,700 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ప్రకటించిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) బకాయిల విలువ 11,705 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలు తెలియజేస్తున్నాయి. మొత్తం 1,164 రుణాలను ఎస్‌బిఐ విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించగా, ఇందులో లిక్కర్‌కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణం కూడా ఉంది. ఇది ఎస్‌బిఐకి 1,600 కోట్ల రూపాయల వరకు బకాయి పడినది తెలిసిందే. కాగా, ఎస్‌బిఐ అనుబంధ సంస్థల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 197 విల్‌ఫుల్ డిఫాల్టర్లతో మిగతా నాలుగు అనుబంధ సంస్థల కంటే ముందుంది. ఈ 197 కేసుల్లో రుణాల విలువ 2,088 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 124 కేసులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల (రూ. 1,328 కోట్లు), 66 కేసులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (రూ. 974 కోట్లు), 65 కేసులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (రూ. 839 కోట్లు), 43 కేసులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (రూ. 829 కోట్లు) ఉన్నాయి. 2014 డిసెంబర్ 31 నాటికి 61,991.45 కోట్ల రూపాయలుగా ఉన్న ఎస్‌బిఐ నిరర్థక ఆస్తుల విలువ.. 2015 డిసెంబర్ 31 నాటికి 72,791.73 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఎస్‌బిఐ లాభాలు ఈ మొండి బకాయిల కారణంగానే గతంతో పోల్చితే సగానికిపైగా పడిపోగా, 67 శాతం క్షీణతతో 1,259.49 కోట్ల రూపాయల లాభానికి పరిమితమైంది. ఈ జనవరి-మార్చి త్రైమాసికం లాభాలపైనే మొండి బకాయిల ప్రభావం ఉండొచ్చని బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఇప్పటికే ప్రకటించినది తెలిసిందే. మరో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడానైతే మొండి బకాయిల కారణంగా ఈ అక్టోబర్-డిసెంబర్‌లో ఏకంగా 3,342 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

రెండేళ్లు పెరిగిన సిక్కా పదవీకాలం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్.. తమ సిఇఒ విశాల్ సిక్కా పదవీకాలాన్ని దాదాపు రెండేళ్లపాటు పొడిగించింది. 2014 ఆగస్టులో ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా సిక్కా నియమితులయ్యారు. 2019 జూన్ 13 వరకు ఆయనతో కాంట్రాక్టు ఉండగా, దాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కుదించిన ఇన్ఫోసిస్ బోర్డు.. ఈ ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు మరో కొత్త కాంట్రాక్టును కుదుర్చుకోబోతోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి పదవీ విరమణ అనంతరం సంస్థ కష్టనష్టాల్లో పడినది తెలిసిందే. ఈ క్రమంలో సంస్థలోకి ప్రవేశించిన సిక్కా.. తన వ్యూహాత్మక ధోరణితో తిరిగి ఇన్ఫోసిస్‌ను గట్టెక్కించారు. సీనియర్లు వీడిపోతున్న తరుణంలో బాసటగా నిలిచారు.

నేటి నుండి పొగాకు కొనుగోళ్లు

ఒంగోలు, ఫిబ్రవరి 24: నేటి నుండి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రీజియన్ పరిధిలోగల ఏడు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు రీజియన్ పరిధిలోని పొదిలి -1,2, కందుకూరు -1,2, కనిగిరి, డిసిపల్లి, కలిగిరి పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయ. మరోవైపు రైతులు ఇప్పటికే తమ పొగాకు బేళ్ళను ఆయా వేలం కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు.
ఈ ఏడు వేలం కేంద్రాల పరిధిలో 39.5 మిలియన్ కేజిల పొగాకు ఉత్పత్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్ణయించగా, 34 మిలియన్ కేజిల పొగాకును రైతులు ఉత్పత్తి చేశారు. 25,500 హెక్టార్లల్లో రైతులు పొగాకు పంటను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి 5.5 మిలియన్ కేజిలు తగ్గినట్లు పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ తేలిక నేలల ఆర్‌ఎం రత్నసాగర్ విలేఖరులకు తెలిపారు. ఈ ఏడాది నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేశారన్నారు. కాగా, ప్రారంభ ధర కేజికి గరిష్ఠంగా 160 రూపాయలుండాలని, సగటు ధర 150 రూపాయలకు తగ్గకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని జిల్లాలోని పొగాకు రైతు సంఘాల నాయకులు, రైతులు కోరుతున్నారు. అదేవిధంగా పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపార కంపెనీలు, ట్రేడ్ వింగ్స్ ప్రారంభం నుండే కొనుగోళ్ళల్లో పాల్గొని కొనుగోలు చేయటం వలన వ్యాపారుల్లో పోటీ పెరిగి గిట్టుబాటు ధరలు వస్తాయని ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని బోర్డు, ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
అయితే గురువారం ప్రారంభమయ్యే వేలం కేంద్రాల్లో రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయా? లేదా? అనే విషయం తేలనుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్నిరకాలుగా ఖర్చులు పెరిగాయని, గిట్టుబాటు ధరలు కల్పించకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.

ఊపందుకున్న కెటిపిఎస్ 7వ దశ పనులు

పాల్వంచ, ఫిబ్రవరి 24: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కెటిపిఎస్‌లో కొత్తగా చేపట్టిన 7వ దశ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇటీవల టిఎస్ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు పలు విభాగాలపై చూపుతున్న చొరవతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బాయిలర్, ఇఎస్‌పి ఎరక్షన్, చినీ సెగ్మెంట్ పనులు జోరుగా సాగుతున్నాయి. రూ. 5 వేల కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ పనులు బిహెచ్‌ఇఎల్ తీసుకుంది. 36 నెలల్లో పనులను పూర్తిచేసేందుకు జెన్‌కో యాజమాన్యంతో ఒప్పందం జరిగింది. అయితే 2014 డిసెంబర్‌లో మొబిలైజేషన్ పనులు తీసుకొని పనులు ప్రారంభించకపోవడంతో కొంతమేరకు జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఇఎస్‌పి పునాదుల నిర్మాణం, బ్యాక్‌ఫిల్లింగ్, డక్ ఫౌండేషన్ పనులు పూర్తయి ఎరక్షన్ దశకు చేరుకుంది. బాయిలర్ నిర్మాణంలో సివిల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మార్చినాటికి సివిల్ పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పునాదుల తవ్వకం పనులు పూర్తయ్యాయ. ఫౌండేషన్ నిర్మాణంతోపాటు కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. 71 పెడస్టల్స్‌కు 61 కాంక్రీట్ పనులు, మిల్లు బంకర్ల ఫౌండేషన్ పనులు, చినీ పునాదుల తవ్వకం పూర్తయింది. ఈ సెగ్మెంట్ కాంక్రీట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తొమ్మిది సెగ్మెంట్లకు ఇనుపరాడ్లు కట్టారు. ఇప్పటి వరకు 5 సెగ్మెంట్లలో కాంక్రీట్ పనులు పూర్తవగా, పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసేందుకు టిఎస్‌జెన్‌కో అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ నిర్మాణానికి అగ్రిమెంట్ ప్రకారం ఇసుకను వరంగల్ జిల్లా ఏటూరునాగారం క్వారీ నుండి తీసుకురావాల్సివుండగా కినె్నరసాని నదిలో లభించే ఇసుకతోనే నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు స్పందించి నాణ్యమైన ఇసుకతో నిర్మాణాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

టమోటా ధరలు భారీగా పతనం

మదనపల్లె, ఫిబ్రవరి 24: దక్షిణాది రాష్ట్రాల్లో టమోటా పంటల దిగుబడులు అధికంగా ఉండటంతో ధరలు భారీస్థాయిలో పతనం అవుతున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంత రైతులు పండిస్తున్న పంటకు సైతం గిట్టుబాటు కావడం లేదు. పండించిన పంటకు మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులదే పైచేయిగా మారుతోంది. టమోటాను కొనేవారు లేకపోవడంతో వ్యాపారులు అడిగిన కాడికి అమ్ముతున్నారు. గత నెలన్నర రోజుల క్రితం కిలో టమోటా 10 నుంచి 15 రూపాయలకు తక్కువ కాకుండా పలికింది. 15 రోజుల క్రితం కిలో 8 రూపాయలు పలికిన టమోటా, నాలుగు రోజులుగా 3 నుంచి 5 రూపాయల మధ్య ధరలు పలుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గురువారం మార్కెట్‌కు దాదాపు 290 టన్నుల టమోటా వచ్చింది. ఇందులో జిల్లా నుంచి 140 టన్నులు రాగా, కర్ణాటక, కడప, అనంతపురం జిల్లాల నుంచి 150 టన్నుల వరకు వచ్చింది. మహారాష్ట్ర, పాండిచ్చేరి, ఢిల్లీ, కర్ణాటక ప్రాంతాల్లో టమోటాకు డిమాండ్ తక్కువగా ఉండటంతో మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు విపరీతంగా తగ్గుముఖం పట్టాయి.