బిజినెస్

వృద్ధిదాయక బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొనియాడిన పారిశ్రామిక, వ్యాపార రంగం
పోర్టులకు రైల్వే సదుపాయ కల్పనపై హర్షాతిరేకాలు
సరకు రవాణా కారిడార్ల ఏర్పాటును స్వాగతించిన పరిశ్రమ
2016-17 ఆదాయ లక్ష్యం రూ. 1.84 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ 2016-17పై భారతీయ పారిశ్రామిక రంగం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇది వృద్ధి కారక బడ్జెట్ అంటూ కొనియాడింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను గురువారం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో మూడు కొత్త సరకు రవాణా కారిడార్లను 2019 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల సరకు రవాణా వ్యయం తగ్గుతుందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమనం మధ్య వార్షిక రెవిన్యూ లక్ష్యాన్ని 1.84 లక్షల కోట్ల రూపాయలుగా నిర్దేశించుకోవడం మాత్రం సవాలేనని అభిప్రాయపడ్డాయి. ఈ బడ్జెట్‌లో ప్యాసింజర్, సరకు రవాణా చార్జీల జోలికి వెళ్లని మోదీ సర్కారు.. నార్త్-సౌత్, ఈస్ట్-వెస్ట్, ఈస్ట్ కోస్ట్ రవాణా కారిడార్లను 2019కల్లా పూర్తిచేయాలని సంకల్పించింది. దీంతో సరకు రవాణాకు సంబంధించి తీసుకున్న చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయని పారిశ్రామిక సంఘం సిఐఐ రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఎక్విప్‌మెంట్ డివిజన్ వైస్ చైర్మన్ తిలక్ రాజ్ సేథ్ అన్నారు. సరకు రవాణా కారిడార్లతో ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే సదుపాయం పెరుగుతుందని, ఇది పారిశ్రామిక, వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుందన్నారు. ఎగుమతిదారులు సైతం రైల్వే బడ్జెట్‌ను స్వాగతించారు. పారిశ్రామిక, వ్యాపార రంగాభివృద్ధికి దోహదపడేలా పోర్టులకు రైల్వే సౌకర్యాన్ని కల్పించడంపై తాజా బడ్జెట్ దృష్టి పెట్టిందన్నారు. 7,517 కిలోమీటర్ల తీరప్రాంతంలోగల పోర్టులకు రైల్వే సదుపాయం తప్పనిసరి అని, ఇప్పటిదాకా తాము వౌలిక సదుపాయాల అభివృద్ధికే డిమాండ్ చేస్తున్నామని తాజా బడ్జెట్‌లో ఈ డిమాండ్ కొంత తీరిందని ఎగుమతి దారులన్నారు. గోడౌన్లు, సరకు రవాణా టెర్మినళ్లకు రైల్వే సదుపాయం పెరగడం మంచిదని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఒ) ఆనందం వెలిబుచ్చింది. కాగా, సరకు రవాణా కారిడార్ల ఏర్పాటు, 400 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ తమకు కలిసొస్తుందని రియల్ ఎస్టేట్ రంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఈ నెల 29న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న వార్షిక సాధారణ బడ్జెట్‌లో రైల్వే శాఖకు 4,301 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు.
మార్కెట్ నుంచి రూ. 20 వేల కోట్ల సమీకరణ
వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో మార్కెట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల నిధులను రైల్వే శాఖ సమీకరించనుంది. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సి), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌విఎన్‌ఎల్) ద్వారా ఈ నిధులను రైల్వే శాఖ సేకరిస్తుంది. ఐఆర్‌ఎఫ్‌సి 19,760 కోట్ల రూపాయలు, ఆర్‌విఎన్‌ఎల్ 240 కోట్ల రూపాయలను సమీకరిస్తాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 11,848 కోట్ల రూపాయల నిధులను ఈ రెండు సంస్థల ద్వారా రైల్వే శాఖ సమీకరించింది. 11,591.66 కోట్ల రూపాయలను ఐఆర్‌ఎఫ్‌సి ద్వారా, 255.90 కోట్ల రూపాయలను ఆర్‌విఎన్‌ఎల్ ద్వారా అందుకుంది. నిజానికి 2015-16 బడ్జెట్‌లో 17,655 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, మళ్లీ దాన్ని సవరించారు. ఇకపోతే వివిధ భాగస్వామ్యాల ద్వారా 18,340 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ ఆశిస్తోంది. సంస్థాగత, బహుళార్థ ఫండ్ ఏజెన్సీల నుంచి కూడా 20,985 కోట్ల రూపాయలు అందుకోగలమని రైల్వే శాఖ ఆశిస్తోంది.
రూపీ బాండ్లతో అంతర్జాతీయ మార్కెట్లలోకి
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రైల్వే శాఖ 1.21 లక్షల కోట్ల రూపాయలతో మూలధన వ్యయ ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలోనే ఈ ప్రణాళికకు కావాల్సిన నిధుల కోసం రూపాయి బాండ్ల జారీపై దృష్టి పెట్టింది. అంతేగాక రాష్ట్రాలతో కలిసి జాయింట్ వెంచర్ల ఏర్పాటు, నూతన పిపిపి ఒప్పందాలను కుదుర్చుకోవడం, పెట్టుబడుల కోసం బహుళ, ద్వైపాక్షిక ఏజెన్సీలతో కలవడం వంటివి చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తాను రెండోసారి ప్రవేశపెడుతున్న 2016-17 రైల్వే బడ్జెట్ సందర్భంగా చెప్పారు. 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి సిద్ధంగా ఉందన్నారు.
చెన్నైలో రైల్ ఆటో హబ్
చెన్నైలో దేశంలోనే తొలి రైల్ ఆటో హబ్‌ను ఏర్పాటు చేయాలని తాజా బడ్జెట్ సందర్భంగా రైల్వే శాఖ ప్రతిపాదన చేసింది. దీన్ని భారతీయ ఆటోమొబైల్ రంగం స్వాగతించింది. ఆటో రంగాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందంటూ కేంద్ర ప్రభుత్వ ప్రకటనపట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ హబ్ వల్ల తయారీ కేంద్రాల నుంచి వాహన రవాణాకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆటో సంస్థలు అంటున్నాయి. ‘వాహానాల రవాణాకు సంబంధించిన వౌలిక సదుపాయాల కల్పనలో చెన్నై ఆటో హబ్ ఓ గొప్ప మైలురాయి.’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు (సేల్స్, మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ పిటిఐకి తెలిపారు. ఇదే తరహా అభిప్రాయాన్ని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నే కూడా వ్యక్తం చేశారు. తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, నిర్ణయాల వల్ల సరకు రవాణా భారం తగ్గిపోతోందని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ అధ్యక్షుడు గుల్యుమ్ సికార్డ్ అన్నారు. దేశంలోని అతిపెద్ద ఆటో హబ్‌లలో చెన్నై నగరం ఒకటని, దీనికి సరకు రవాణా సదుపాయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు.
రూ. 15 వేల కోట్లు తగ్గొచ్చు
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రైల్వే శాఖ ఆదాయం బడ్జెట్ లక్ష్యానికి 15 వేల కోట్ల రూపాయలు తగ్గొచ్చని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. 2015-16 బడ్జెట్‌లో 1.83 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో నెల రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న క్రమంలో 1.67 లక్షల కోట్ల రూపాయలకు రైల్వే ఆదాయం పరిమితం కావచ్చని మంత్రి చెప్పారు. భారత్‌ను ప్రభావితం చేస్తున్న ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య ఆదాయం పడిపోయిందన్నారు. ప్యాసింజర్ల ద్వారా 45,376 కోట్ల రూపాయలు, సరకు రవాణా ద్వారా 1.11 లక్షల కోట్ల రూపాయలు ఈసారి రావచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ సందర్భంగా చెప్పారు.

ఎవరేమన్నారు?
‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంపై, కొత్త ప్రాజెక్టుల అమలుపై తాజా రైల్వే బడ్జెట్ దృష్టి పెట్టడం అభినందనీయం. ముఖ్యంగా మూడు కొత్త రవాణా కారిడార్ల వల్ల పారిశ్రామిక, వ్యాపార రంగంపై రవాణా భారం తగ్గుతుంది.’
- సిఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందార్
‘సరకు రవాణా చార్జీల హేతుబద్దీకరణ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) విధానంపై సమీక్షలతో రైలు రవాణా పెరగడమేగాక, ఆదాయం కూడా పెరుగుతుంది. సరకు రవాణా కారిడార్ల ఏర్పాటు, పోర్టులకు రైల్వే సదుపాయం కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నాం.’
- ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా
‘కమాడిటీ రంగాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య తాజా బడ్జెట్‌లో రైల్వే మంత్రి చార్జీల జోలికి వెళ్లలేదు. రైల్వేల అభివృద్ధి వ్యయంపైనా ఏమాత్రం వెనుకాడలేదు.’
- అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా
‘1.8 లక్షల కోట్ల రూపాయల రెవిన్యూ లక్ష్యం చాలా అధికం. దీన్ని చేరుకోవడం చాలా కష్టం. జిడిపి వృద్ధి తదితర అంశాలనూ ప్రభావితం చేస్తుంది. వేతన సంఘం సిఫార్సులతో 30,000 కోట్ల రూపాయల మేర రైల్వేపై భారం పడనుంది. 2019 నాటికి సరకు రవాణా కారిడార్ల పూర్తి కూడా సవాలే.’
- ఎల్‌అండ్‌టి రైల్వే బిజినెస్ సిఇఒ రాజీవ్ జ్యోతి
‘చార్జీలను పెంచకపోవడం వల్ల ప్యాసింజర్, సరకు రవాణా మరింత పెరిగి రైల్వేకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా కొత్త సరకు రవాణా కారిడార్లలో ఢిల్లీ-చెన్నైని నార్ట్-సౌత్, ఖరగ్‌పూర్-ముంబయిని ఈస్ట్-వెస్ట్, ఖరగ్‌పూర్-విజయవాడను ఈస్ట్ కోస్ట్ కారిడార్లు కలుపుతాయి.’
- జిఇ ట్రాన్స్‌పోర్టేషన్ అధ్యక్షుడు నలిన్ జైన్
‘పోర్టులకు రైల్వే సదుపాయం పెరగడం వల్ల వ్యాపార నిర్వహణ మెరుగుపడుతుంది. ఎగుమతి, దిగుమతుల రవాణా వ్యయం కూడా తగ్గుతుంది.’
- ఇఇపిసి ఇండియా చైర్మన్ టిఎస్ భాసిన్
chitram...
రైల్వే బడ్జెట్ 2016-17తో
పార్లమెంట్ వద్ద మంత్రి సురేశ్ ప్రభు