బిజినెస్

వడివడిగా పారిశ్రామికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో త్వరలో 16 భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు, పలు పారిశ్రామిక నగరాలు, టౌన్‌షిప్‌లు రానున్నాయి. పరిశ్రమలకు వసతులు కల్పించే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) ఇందుకు మార్గం సుగమం చేయనుంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై సవివరమైన చర్చ జరిగింది. వీటిని నెలకొల్పడానికి అవసరమైన భూసేకరణ కేటాయింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. భూసేకరణ సమస్యను అధిగమించడం కోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. భూసేకరణ, వాటి పరిరక్షణ, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలకు అనువైన పరిస్థితుల కల్పన, పారిశ్రామిక విస్తరణ మొదలైన అంశాలు వీరికి అప్పగించడం కూడా జరిగిపోయంది. దీని కోసం జీవోఎంఎస్ నెంబర్ 27ను గత నెల 10న విడుదల చేసింది. దీంతో జిల్లా కలెక్టర్లకు కూడా ఎపిఐఐసి బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదా లభించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని తిరిగి తీసుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్, రోడ్ల సౌకర్యం తదితర వౌలిక సదుపాయాలు కల్పించడం వంటి బాధ్యతలను కలెక్టర్లకే అప్పగించింది. రాష్ట్ర విభజన తరువాత నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ప్రధాన వాణిజ్య సంస్థల ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలను వేగవంతం చేసినది తెలిసిందే. పరిశ్రమలకు కావలసిన సౌకర్యాలను కల్పించి ఆర్థిక వృద్ధిని పెంచడంతోపాటు ల్యాండ్ బ్యాంక్‌ని కూడా పెంచుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనదీ విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలన్నింటిలో ఇప్పటికే 2 లక్షల ఎకరాల భూమిని ఇందుకోసం గుర్తించింది. మరిన్ని భూముల్ని గుర్తించి, సేకరించే పనిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు దక్షిణ భారత పారిశ్రామిక కారిడార్లను ఆంధ్రప్రదేశ్‌తో కలుపుతూ అభివృద్ధి చేయడం కోసం నిర్ణయం తీసుకుంది. అవి విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (విసిఐసి), చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ( సిబిఐసి), కర్నూలు-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (కెబిఐసి). దీంతో ఈ మూడు జాతీయ ప్రధాన కారిడార్లను కలుపుతూ వెళ్లే 7 ప్రాంతాలుగా కర్నూలులోని ఓర్వకల్ (కెబిఐసి), నెల్లూరులోని కృష్ణపట్నం (సిబిఐసి), అనంతపురంలోని హిందూపురం (సిబిఐసి), చిత్తూరులోని శ్రీకాళహస్తి-ఏర్పేడు (విసిఐసి), కృష్ణా జిల్లాలోని గన్నవరం-కంకిపాడు (విసిఐసి), తూర్పు గోదావరిలోని కాకినాడ (విసిఐసి), విశాఖపట్నం (విసిఐసి)లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత వాణిజ్య రంగ ప్రోత్సాహకంలో భాగంగా నవ్యాంధ్రప్రదేశ్‌ను ‘సూర్యోదయ రాష్ట్రం’గా (సన్‌రైజ్ స్టేట్) ప్రస్తావించడం విదితమే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ దిశలో సత్వర పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం క్లస్టర్ ప్రాతిపదిన ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం 16 భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గుర్రంపాలెం (విశాఖపట్నం జిల్లా)లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, కాపులుప్పాడ (విశాఖపట్నం జిల్లా)లో ఇంటిగ్రేటెడ్ ఐటి టౌన్‌షిప్, నక్కపల్లి (విశాఖపట్నం జిల్లా)లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, కృష్ణాజిల్లాలో మెగా ఫుడ్‌పార్క్, నందిగామ (కృష్ణాజిల్లా)లో ఇండస్ట్రియల్ పార్క్, దొనకొండ (ప్రకాశం జిల్లా)లో పిపిపి విధానంలో రీజనల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రైజ్, పామూరు (ప్రకాశం జిల్లా)లో నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, కర్నూలు జిల్లాలో అల్ట్రా మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రీస్ హబ్, అనంతపురం జిల్లాలో పాలసముద్రం క్లస్టర్, నాయుడుపేట (నెల్లూరు జిల్లా)లో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్, చిత్తూరు జిల్లాలో నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, సెరామిక్ క్లస్టర్, ఏర్పేడు, శ్రీకాళహస్తి ఇండస్ట్రియల్ నోడ్, తిరుపతి (చిత్తూరు జిల్లా)లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లను తెస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి జిల్లాల వారీగా, పారిశ్రామిక యూనిట్ల వారీగా భూకేటాయింపుల్లో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ల దృష్టికి తెచ్చి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాటి సత్వర కేటాయింపులకు అవసరమైన అనుమతులను వేగవంతంగా జారీ చేయాలని సంబంధిత కార్యదర్శులనూ ఆదేశించారు.