బిజినెస్

ఒక్క ఫోన్ ధర రూ. 3,600

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘ఫ్రీడమ్ 251’ వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. ఇప్పటికే ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ అంశంలో ఇప్పుడు సరికొత్త వార్తా బయటికొచ్చింది. అదేమిటంటే?.. రింగింగ్ బెల్స్‌కు ఒక్కో మొబైల్‌ను 3,600 రూపాయల చొప్పున అమ్మినట్లు యాడ్‌కామ్ సంస్థ తెలిపింది. 251 రూపాయలకే 3జి స్మార్ట్ఫోన్ అంటూ ఫ్రీడమ్ 251ను నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ గత నెల మార్కెట్‌కు పరిచయం చేసినది తెలిసిందే. అయితే ఈ ఫోన్ ఐటి ఉత్పత్తుల సంస్థ యాడ్‌కామ్ తెచ్చిన ఐకాన్ 4ను పోలి ఉందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమైనదీ విదితమే. దీనిపై స్పందిస్తూ రింగింగ్ బెల్స్.. తమ వద్ద నుంచి కొన్ని డివైజ్‌లను తీసుకుందని అప్పుడే చెప్పిన యాడ్‌కామ్.. ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేమంది. కానీ శుక్రవారం యాడ్‌కామ్ (అడ్వాంటేజ్ కంప్యూటర్స్) వ్యవస్థాపక చైర్మన్ సంజీవ్ భాటియా ఓ పత్రికా ప్రకటనలో రింగింగ్ బెల్స్‌కు ఒక్కో డివైజ్‌ను 3,600 రూపాయలకు విక్రయించామని చెప్పారు. అమ్మిన సమయంలోనే దీనివల్ల తమ బ్రాండ్‌కు లేదా తమకు ఎలాంటి నష్టం జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రింగింగ్ బెల్స్‌ను హెచ్చరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో యాడ్‌కామ్‌కు చెందిన ఐకాన్ 4 మోడల్ ధర 3,999 రూపాయలు. అయితే వీటిని గంపగుత్తగా కొనుగోలు చేసి మార్కెట్‌లో 251 రూపాయలకే రింగింగ్ బెల్స్ అమ్మేందుకు సిద్ధమవడంపట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనివల్ల తమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడినా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని తేల్చిచెప్పారు. కాగా, సబ్సిడీ ధరకు విక్రయించినా ఒక్కో 3జి స్మార్ట్ఫోన్ ధర 3,500 రూపాయలకు దిగువన ఉండదని, అది అసాధ్యమని గత నెల ఫ్రీడమ్ 251 విడుదల సందర్భంగానే భారతీయ సెల్యులార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీనికి సమాధానంగా ఈ ఫోన్ తయారీకి దాదాపు 2,500 రూపాయలకు ఖర్చవుతోందని, కొత్త మార్కెటింగ్ విధానాలు, పన్నుల తగ్గింపు, ఓ ఈ-కామర్స్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా విక్రయించి లబ్ధి పొందగలమని రింగింగ్ బెల్స్ అధ్యక్షుడు అశోక్ చద్ధా చెప్పారు. అయినప్పటికీ 251 రూపాయలకు అమ్మడం కష్టమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతూనే ఉండగా, ఇప్పుడు యాడ్‌కామ్ వెల్లడించిన తాజా వివరాలతో ఫ్రీడమ్ 251పై అనుమానాలు తీవ్రతరమయ్యాయి. మరోవైపు ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించాలన్న వినతులతో ఆ దిశగా టెలికామ్ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగినది తెలిసిందే. టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రింగింగ్ బెల్స్ వ్యవహారాన్ని దగ్గరగా గమనిస్తున్నామని ఇప్పటికే చెప్పారు. ప్రకటించినట్లుగా 251 రూపాయలకే మొబైల్ ఇవ్వకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఎక్సైజ్, ఆదాయ పన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు కూడా రింగింగ్ బెల్స్ వ్యవహారాలపై విచారణ జరుపుతున్నాయి. సంస్థ విశ్వసనీయతపై ఆరా తీయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి టెలికామ్ శాఖ కూడా సూచించింది. ఇక ఫ్రీడమ్ 251లోని యాప్స్‌లో చాలావరకు యాపిల్ ఐఫోన్‌లోని యాప్స్ ఉండగా, దీన్ని 4 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కమ్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్‌తో రూపొందించినట్లు రింగింగ్ బెల్స్ తెలిపింది. ఆండ్రాయిడ్ లాలీపప్ ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 8 జిబి. దీన్ని 32 జిబి వరకు పెంచుకోవచ్చు. 3.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 1,450 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఉమెన్ సేఫ్టీ, స్వచ్ఛ్ భారత్, ఫిషర్‌మెన్, ఫార్మర్, మెడికల్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంతకుముందు ప్రపంచంలోనే అత్యంత చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను 2,999 రూపాయలకే రింగింగ్ బెల్స్ విడుదల చేసింది. ఈ క్రమంలో 3జి స్మార్ట్ఫోన్‌ను 251 రూపాయలకే తీసుకురాగా, తొలి విడతలో భాగంగా రెండు రోజల్లో 6 కోట్లకుపైగా బుకింగ్స్‌ను అందుకున్నట్లు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. బుకింగ్స్ తొలిరోజు విపరీతమైన డిమాండ్ కారణంగా సర్వర్లు డౌనై 24 గంటలపాటు బుకింగ్స్ నిలిచిపోగా, ఆ తర్వాత మళ్లీ మొదలయ్యాయి. అయితే తొలి 30,000 బుకింగ్స్ సమయంలో ఫోన్ ధరను రింగింగ్ బెల్స్ వసూలు చేయగా, దీన్ని మళ్లీ తిరిగిచ్చేస్తామని, ఫోన్ డెలివరీ సమయంలో తీసుకుంటామని ఆ సంస్థ ఇటీవల తెలిపింది. ఇంకోవైపు ఫ్రీడమ్ 251కు సంబంధించి కస్టమర్ కేర్ సేవలను అందించిన సంస్థ కూడా రింగింగ్ బెల్స్ తీరును తప్పుబట్టింది. తమ బకాయిలను చెల్లించమని కోరితే తప్పించుకుని తిరుగుతున్నారని ఆ సంస్థ మండిపడింది. అయితే పెద్ద ఎత్తున వచ్చే కాల్స్‌ను అందుకోవడంలో విఫలమైందని, మరో సంస్థతో కస్టమర్ కేర్ సేవలను కుదుర్చుకునే ఉద్దేశ్యంతో ఉన్నామని రింగింగ్ బెల్స్ చెబుతోంది. మొత్తానికి ఫ్రీడమ్ 251 వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రింగింగ్ బెల్స్ తీరు దీనిపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది.