బిజినెస్

అవసరమైతే మరిన్ని నిధులిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్: అవసరమైతే ప్రభుత్వరంగ బ్యాంకులకు మరిన్ని నిధులను కేంద్రం అందిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని మొండి బకాయిల సమస్య ప్రభుత్వానికి బాగా తెలుసన్న ఆయన ప్రభుత్వరంగ బ్యాంకులకు మరిన్ని నిధులను అందించడానికి తాము సిద్ధమని చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో జ్ఞాన్ సంగం సందర్భంగా విలేఖరులతో సిన్హా మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లోని నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) సుమారు 8 లక్షల కోట్ల రూపాయలుంటాయన్న ఆయన నిధుల కొరత సమస్య తలెత్తితే కావాల్సినన్ని నిధులను బ్యాంకర్లకు ఇస్తామని చెప్పారు. 2019 మార్చికల్లా ప్రభుత్వరంగ బ్యాంకులకు 70,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించినది తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 25,000 కోట్ల రూపాయలను అందిస్తున్న కేంద్రం.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో మరో 25,000 కోట్ల రూపాయలను అందించనుంది. ఆ తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల చొప్పున సాయం చేయనుంది. బాసెల్-3 నిబంధనల ప్రకారం బ్యాంకుల మూలధన అవసరాల నిమిత్తం ఈ నిధులను ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం లక్షా 85,000 కోట్ల రూపాయల నిధులు అవసరమైనప్పటికీ, అందులో 70,000 కోట్ల రూపాయలకే ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది బ్యాంకింగ్ రంగానికి. మిగతా లక్షా 15,000 కోట్ల రూపాయలు మార్కెట్లు, బాండ్లు ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని చెప్పింది. అయితే మొండి బకాయిలు పెరగడం, వాటి ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో లాభాలు పడిపోయిన నేపథ్యంలో మరిన్ని నిధులను అందించేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు సిన్హా ఇచ్చారు.
సమస్య పరిష్కారానికి కృషి
8 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలు బ్యాంకింగ్ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)తో కలిసి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సిన్హా తెలిపారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోని 69 లక్షల కోట్ల రూపాయల రుణాల్లో దాదాపు 11 శాతం మొండి బకాయిలేనన్నారు. ఈ మొండి బకాయిల వసూలుకు తగిన విధంగా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురాగలమన్న విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
బ్యాంక్ అధికారుల ఆందోళన
ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన అధికారుల్లో కొందరు జ్ఞాన్ సంగం సందర్భంగా ఆందోళనకు దిగారు. బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఎఐబిఒసి) నిరసన తెలిపింది. ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాను 50 శాతం దిగువకు తెస్తామని ఇటీవలి బడ్జెట్‌లో ప్రతిపాదించడాన్ని సమాఖ్య వ్యతిరేకించింది. రెండు రోజులపాటు జరుగుతున్న జ్ఞాన్ సంగం శుక్రవారం మొదలైంది.

జ్ఞాన్ సంగంలో మాట్లాడుతున్న జయంత్ సిన్హా