బిజినెస్

ఐదేళ్ల గరిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో మెరుగైన ఉత్పత్తి.. అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపి)ని ఐదేళ్ల గరిష్ఠానికి చేర్చింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐఐపి గణాంకాలు 9.8 శాతంగా నమోదైయ్యాయి. సెప్టెంబర్‌లో ఇది 3.84 శాతంగా ఉండగా, గత ఏడాది అక్టోబర్‌లో మైనస్ 2.7 శాతంగా ఉంది. తాజా గణాంకాలపై ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అర్వింద్ సుబ్రమణ్యన్ విలేఖరుల వద్ద స్పందిస్తూ ‘ఐఐపి పరుగులు పెడుతోంది. ఉత్సాహకరంగా గణాంకాలు నమోదయ్యాయి.’ అన్నారు. పిహెచ్‌డి చాంబర్ ప్రధాన కార్యదర్శి సౌరభ్ సన్యాల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రెండంకెల వృద్ధిరేటును సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలు కొనసాగితే మరింతగా పారిశ్రామికోత్పత్తి పెరుగుతుందని పారిశ్రామిక సంఘం ఫిక్కీ ప్రధాన కార్యదర్శి ఎ దిదార్ సింగ్ అన్నారు. ఎగుమతుల సంఘం ఇఇపిసి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. కాగా, 2010 అక్టోబర్‌లో ఐఐపి గణాంకాలు 11.36 శాతంగా నమోదవగా, ఆ తర్వాత ఆ స్థాయిలో నమోదవడం ఇదే.

పెట్టుబడుల ఉపసంహరణతో రూ. 12,701 కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇప్పటిదాకా ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగిన పెట్టుబడుల ఉపసంహరణ విలువ 12,701 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. ఆర్‌ఇసి, పిఎఫ్‌సి, డ్రెడ్జింగ్ కార్ప్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్ప్ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించుకున్నట్లు చెప్పారు.

కార్ల ధరలను పెంచిన జనరల్ మోటార్స్
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వాహన ధరలను పెంచిన సంస్థల్లో జనరల్ మోటార్స్ ఇండియా కూడా చేరిపోయింది. మోడల్, వేరియంట్ ఆధారంగా జనవరి నుంచి 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు జనరల్ మోటార్స్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువలో ఒడిదుడుకులు, పెరిగిన ఉత్పాదక వ్యయం కారణంగా ధరలను పెంచక తప్పట్లేదని పేర్కొంది. కాగా, గురువారం మారుతి సుజుకి, బుధవారం హ్యుందాయ్ మోటార్స్, అంతకుముందు టొయోటా, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యు సంస్థలు కూడా వాహన ధరలను ఇదే కారణాలతో పెంచినది తెలిసిందే. జనరల్ మోటార్స్ దేశీయంగా చెవర్‌లెట్ బ్రాండ్‌తో వాహన విక్రయాలు జరుపుతోంది.

విశాఖ ఉక్కు కర్మాగారంలో
10 శాతం వాటా విక్రయం

ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: విశాఖ ఉక్కు కర్మాగారంలోని ప్రభుత్వ పెట్టుబడి నుంచి పది శాతం ఈక్విటీని ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. టిడిపి సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శుక్రవారం పార్లమెంట్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు.
ప్రభుత్వ ప్రతిపాదనను తొలి దశలో కార్మిక సంఘాలు వ్యతిరేకించినా తరువాత తమ ఆమోదాన్ని తెలియచేశాయని మంత్రి అన్నారు. పెట్టుబడులను ఉపసంహరించటం వల్ల కర్మాగారం భవితవ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఏడు ఎఫ్‌డిఐలకు ఎఫ్‌ఐపిబి ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి).. 5,240 కోట్ల రూపాయల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇండియా అడ్వాంటేజ్ ఫండ్ ఎస్4 ఐ, ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ హోల్డింగ్స్, స్ట్రగెన్స్ డెబ్ట్ ఫండ్, ఎక్స్‌ట్రామార్క్స్ ఎడ్యుకేషన్ ఇండియా, ఏజియో ఇమేజ్ లిమిటెడ్, మెంటెర్రా వెంచర్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పారగాన్ పార్ట్‌నర్స్ గ్రోత్ ఫండ్ ఎఫ్‌డిఐలకు ఎఫ్‌ఐపిబి సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, శేఖరన్ లిమిటెడ్ తదితర నాలుగు ఎఫ్‌డిఐ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని ఎఫ్‌ఐపిబి వాయిదా వేసింది.