బిజినెస్

దళారుల చేతిలో రైతన్న దోపిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 10: రైతులను దళారులు నిట్టనిలువునా దోచేసుకుంటున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే అన్నదాతకు సుమారు రూ. 500 కోట్ల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతుకు దళారుల జోక్యం వలన కలిగిన నష్టమిది. రాష్ట్రం మొత్తం కరవుతో అల్లాడుతుంటే గత ఏడాది జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సోమశిల, కండలేరు జలాశయలాలతో పాటు జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 9.5 లక్షల ఎకరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరిసాగు చేపట్టారు. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో మొదలైన సాగు ప్రస్తుతం జిల్లాలో అంతిమదశకు చేరుకుంది. ఇప్పటికే 7.5 లక్షల ఎకరాల్లో కోతలు కూడా పూర్తయ్యాయి. మిగతా చోట్ల కోతలు ప్రారంభదశలో ఉన్నాయి. ప్రకృతి కరుణతో సంతోషంగా సాగు చేపట్టిన రైతులకు చివరకు దళారులు వికృతి రూపంలో పంట దోచుకుపోయేలా తయారైయ్యారు. జిల్లాలో ముఖ్యంగా జిలకర మసూర (బిపిటి), నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్), బుడ్డలు (1010) రకం వరిని సాగు చేశారు. కోతలు ప్రారంభంగాక మునుపు మార్చి మొదటి వారంలో అన్ని రకాల ధాన్యానికి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దీనికితోడు దిగుబడి కూడా ఈ ఏడాది ఆశాజనకంగా ఉండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే కోతలు ప్రారంభం కాగానే ఒక్కసారిగా ధరలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. మార్చి ప్రారంభంలో బిపిటి రకం పుట్టి (880 కేజీలు) రూ. 17,300 ఉండగా, ప్రస్తుతం రూ. 14 వేలకు మించి రైతుకు అందడం లేదు. నెల్లూరు మసూర పుట్టి రూ. 15 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 11 వేలకు చేరుకుంది. ప్రభుత్వం మద్దతు ధర రూ. 12,325గా నిర్ణయించింది. 1010 రకం మార్చి ప్రారంభంలో రూ. 13 వేలు పలకగా, నేడు రూ. 10 వేలకు పడిపోయింది. ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరను రూ. 11,985గా నిర్ణయించింది. మొదట్లో ఉన్న ధరల మాట అటుంచితే కనీసం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతుకు అందడంలో కూడా అన్యాయం జరుగుతోంది. రైతును దళారులు నిండా మోసం చేస్తున్నా జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలు పలుమార్లు నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఒక్క దళారిపైనా కేసు నమోదు కాకపోవడం విశేషం. జిల్లాలో చేపట్టిన 9.5 లక్షల ఎకరాల సాగు ద్వారా మార్కెట్లోకి సుమారు 30 లక్షల పుట్ల ధాన్యం వస్తోంది. ఇందులో సింహభాగం ఇప్పటికే రైతుల నుంచి మిల్లర్ల చేతిలోకి వెళ్లిపోయింది. పుట్టికి కనీసం రూ. 2 వేలకు తక్కువ కాకుండా రైతు నష్టపోయాడు. ఈ లెక్కన ఇప్పటికే జిల్లాలో రైతులు రూ. 500 కోట్ల మేర నష్టపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ధాన్యాన్ని కొనేందుకు 164 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం ఆ క్రమంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఇప్పటిదాకా కేవలం 81 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. అందులోనూ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతున్న కేంద్రాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఇలా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అందరు చేస్తున్న అవకతవకలకు, అలసత్వ నిర్ణయాలకు చివరకు అన్నదాత బలవుతుండడం బాధాకరం. గత నాలుగు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంలో కాస్తంత చురుకుదనం కనిపించడంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సరిగా నిర్వహించాలనీ, రైతుకు మద్దతు ధర లభించేలా చూడాలని ముఖ్యమంత్రి కాస్త కటువుగానే జిల్లా అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జరగాల్సిన నష్టం జరిగిపోయాక తీసుకునే నిర్ణయాలు ఎవరికి ఉపయుక్తంగా ఉంటాయో ప్రభుత్వమే ఆలోచించాలి.