బిజినెస్

భారత సంతతి సోదరుల హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 24: బ్రిటన్ కుబేరుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఆదివారం విడుదలైన బ్రిటన్ వార్షిక ధనవంతుల జాబితాలో భారత సంతతి సోదరులు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ‘ది సండే టైమ్స్’ సంపన్నుల జాబితా 2016లో 13.1 బిలియన్ పౌండ్లతో ముంబయికి చెందిన డేవిడ్ రూబెన్, సిమన్ రూబెన్ సోదర ద్వయం అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత 13 బిలియన్ పౌండ్లతో నాడు భారత్‌లో, ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించిన హిందుజా సోదరులైన శ్రీచంద్, గోపిచంద్ హిందుజాలు రెండో స్థానంలో ఉన్నారు. కాగా, 1950వ దశకంలో ముంబయిలోని ఓ ఇరాకీ-జేవిష్ కుటుంబంలో రూబెన్ సోదరులు జన్మించారు. ఆ తర్వాత వీరు బ్రిటన్‌లో స్థిరపడగా, మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో వారి సంపద పెరిగింది. నిజానికి నిరుడు బ్రిటన్ సంపన్నుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న రూబెన్ సోదరుల సంపద.. ఈ ఏడాది 3.4 బిలియన్ పౌండ్లు పెరగడంతో తొలి స్థానానికి ఎగబాకారు. బ్రిటన్‌లో వీరికున్న ఆస్తుల గురించి చెబితే.. లండన్‌లో మిల్‌బ్యాంక్ టవర్, విక్టోరియాలో జాన్ లెవీస్ పార్ట్‌నర్‌షిప్ హెచ్‌క్యు, స్లోయెన్ స్ట్రీట్‌లో దుకాణాలతోపాటు లండన్ ఆక్స్‌ఫర్డ్ ఎయిర్‌పోర్టు, లండన్ హెలీపోర్ట్ రూబెన్ సోదరుల సొంతం. అంతేగా మెట్రో బ్యాంక్‌లో వీరి పెట్టుబడులు 1.6 బిలియన్ పౌండ్లుగా ఉన్నాయని ది సండే టైమ్స్ వార్తాపత్రిక స్పష్టం చేసింది. రూబెన్ సోదరుల సంపద అధికంగా నగదు, బాండ్ల రూపంలోనే ఎక్కువగా ఉంది. ఇక విదేశాల్లోని మెటల్స్ కార్యకలాపాల విలువ 300 మిలియన్ పౌండ్లుగా ఉంటుంది. ఇదిలావుంటే హిందుజా సోదరుల సంపద యథాతథంగా ఉండటంతో జాబితాలో వారి స్థానం కూడా నిరుడు మాదిరిగా రెండో స్థానంలోనే ఉంది. 250 ఏళ్ల లీజుకుగాను లండన్‌లోని ఓల్డ్ వార్ ఆఫీసైన వైట్‌హాల్‌ను 300 మిలియన్ పౌండ్లతో దక్కించుకున్న హిందుజా సోదరులు.. దాన్ని 1 బిలియన్ పౌండ్ల విలువైన హోటల్‌గా మార్చనున్నారు. ఇకపోతే మరో భారత సంతతి బిలియనీర్ లక్మీనివాస్ మిట్టల్.. టాప్-10 నుంచి వైదొలిగారు. నిరుడు 7వ స్థానంలో ఉంటే, ఈ ఏడాది 11వ స్థానానికి పడిపోయారు. నిజానికి గడచిన ఎనిమిదేళ్లుగా మిట్టల్ తన ప్రాభవాన్ని కోల్పోతున్నారు. 2008లో 27.7 బిలియన్ పౌండ్లతో బ్రిటన్ కుబేరుల్లో అగ్రపథాన ఉన్న మిట్టల్.. 2015లో 7వ స్థానానికి దిగజారారు. ఈ ఏడాది ఆయన సంపద 7.12 బిలియన్ పౌండ్లుండగా, 11వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉక్కు రంగం సంక్షోభంలో చిక్కుకోవడమే దీనికి కారణమని తాజా జాబితాను రూపొందించిన రాబర్ట్ వాట్స్ తెలిపారు. ఉక్కు సంక్షోభం మరో భారత సంతతి కుబేరుడైన లార్డ్ స్వరాజ్ పాల్, ఆయన కుటుంబ సంపదపైనా ప్రభావం చూపింది. నిరుడు 44వ స్థానంలో ఉండగా, ఈ ఏడు 740 మిలియన్ పౌండ్లతో ఏకంగా 110 స్థానాలు తగ్గి, 154వ స్థానంలోకి దిగివచ్చారు. ఇకపోతే వార్నర్ మ్యూజిక్ యజమాని లెన్ బ్లెవట్నిక్ 11.59 బిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో ఉండగా, ఈ ఏడాది బ్రిటన్‌లో మొత్తం 120 మంది బిలియనీర్లున్నట్లు తేలింది. భారత్‌లో 56 మంది ఉండగా, చైనాలో 193 మంది, రష్యాలో 43 మంది ఉన్నారు. ఇక ప్రపంచంలో 50 మంది అత్యంత సంపన్నుల్లో 17.9 బిలియన్ పౌండ్లతో ముకేశ్, అనిల్ అంబానీ సోదరులు 30వ స్థానంలో ఉన్నారు. టాప్-50లో భారత్ తరఫున కేవలం అంబానీలకే చోటు దక్కగా, తొలి స్థానంలో 88.7 బిలియన్ డాలర్లతో వాల్‌మార్ట్‌కు చెందిన వాల్టన్ కుటుంబం నిలిచింది. ఇక వెయ్యి మంది జాబితాలో 125 మంది మహిళా సంపన్నులున్నారు.