బిజినెస్

ఆర్‌బిఐలో రాజన్‌ను మించిన జీతగాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. భారత ద్రవ్యవిధానానికి మూల స్తంభం. అలాంటి ఆర్‌బిఐకి గవర్నర్ రఘురామ్ రాజన్ బాస్. అయితే హోదా పరంగా ఆర్‌బిఐలో రాజన్ అత్యున్నత వ్యక్తి కావచ్చుగానీ, వేతనం విషయంలో మాత్రం కానేకాదు. అవును మరి.. ఆర్‌బిఐలో రాజన్ కంటే ఎక్కువగా జీతాలు తీసుకునే ఉద్యోగులున్నారు. సమాచార హక్కు చట్టం క్రింద తాజాగా ఆర్‌బిఐ విడుదల చేసిన వివరాల ప్రకారం రాజన్ వేతనం నెలకు 1,98,700 రూపాయలు. బేసిక్ పే 90,000 రూపాయలైతే, డిఎ (కరువు భత్యం) 1,01,700 రూపాయలు. మరో 7,000 రూపాయలు ఇతర అలవెన్సుల రూపంలో వస్తున్నాయి. అయితే ఇంతకంటే ఎక్కువగా నెలసరి జీతం తీసుకుంటున్న ఉద్యోగులు ఆర్‌బిఐలో ముగ్గురున్నారు. వారు గోపాలకృష్ణ సీతారామ్ హెగ్డే (4 లక్షల రూపాయలు), అన్నామలై అరపులి గౌండర్ (2,20,355 రూపాయలు), వి కందసామి (2.1 లక్షల రూపాయలు). కాగా, వెబ్‌సైట్‌లో ఆర్‌బిఐ తెలిపిన ఈ వివరాలు జూన్-జూలై 2015కు సంబంధించినవి. ఇకపోతే ఈ ముగ్గురు ఏ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనే సమాచారాన్ని మాత్రం ఆర్‌బిఐ తెలియపరచలేదు. అయితే గతంలో హెగ్డే ఆర్‌బిఐ ప్రిన్సిపల్ లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు. ఇక హెగ్డే, కందసామి బేసిక్ పే, డిఎ వివరాలు కూడా వెల్లడించలేదు. దీంతో దీనికి సంబంధించి ఆర్‌బిఐ అధికార ప్రతినిధి అల్పన కిల్లవాలాను కోరినప్పటికీ స్పందన లేదు. అంతేగాక రాజన్‌తోసహా ఉన్నతోద్యోగుల ప్రస్తుత వేతనాల వివరాలను ఇవ్వలేదు. మరోవైపు ఆర్‌బిఐలోని నలుగురు డిప్యూటి గవర్నర్లు, 11 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాల కంటే కూడా కిల్లవాలా నెలసరి వేతనం ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆర్‌బిఐలో సమాచార శాఖ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా కిల్లవాలా ఉన్నారు. నెలకు దాదాపు 1,78,265 రూపాయల జీతాన్ని తీసుకుంటున్నారు. ఇందులో బేసిక్ పే 67,000 రూపాయలు, డిఎ 85,239 రూపాయలు, 26,026 రూపాయలు ఇతర అలవెన్సులు. కానీ ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్ల వేతనం నెలకు 1,73,900 రూపాయలుగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లది 1,70,864 రూపాయలుగా ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కంటే ఆర్‌బిఐలో ఎక్కువగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు కనీసం 44 మంది ఉన్నారు.

‘ఈసారి జిడిపి వృద్ధి 8 శాతం’
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) దాదాపు 8 శాతంగా నమోదు కావచ్చని పారిశ్రామిక సంఘం పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది. పెరిగిన ఆదాయం, దిగివచ్చిన ఉత్పాదక వ్యయం, ద్రవ్యోల్బణం అదుపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు వంటివి భారత జిడిపి వృద్ధిరేటును పెంచవచ్చని అభిప్రాయపడింది. కాగా, ఆర్‌బిఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జిడిపి వృద్ధి 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసినది తెలిసిందే. అలాగే ప్రపంచ జిడిపిలో 2000వ సంవత్సరంలో 1.43 శాతంగా ఉన్న భారత జిడిపి వృద్ధి.. 2015వ సంవత్సరంలో 2.86 శాతంగా ఉండవచ్చని కూడా పిహెచ్‌డి చాంబర్ అంచనా వేసింది.

గత ఆర్థిక సంవత్సరం
8 శాతం తగ్గిన పసిడి దిగుమతులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశంలోకి బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో దాదాపు 8 శాతం తగ్గి 31.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పతనం, భారత కరెంట్ ఖాతా లోటు దృష్ట్యా క్రిందటిసారి పసిడి దిగుమతులు తగ్గిపోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో 34.38 బిలియన్ డాలర్ల పుత్తడి దిగుమతులు జరిగాయి. కాగా, గత నెల మార్చిలో దేశంలోకి బంగారం దిగుమతులు 972.96 మిలియన్ డాలర్లుగానే నమోదయ్యాయి. ఇది ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్యలోటును ఐదేళ్ల కనిష్టానికి తీసుకెళ్లడం గమనార్హం. ఇక భారత కరెంట్ ఖాతా లోటు 2015-16 మూడో త్రైమాసికం జిడిపిలో 1.3 శాతానికి తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఇది 1.5 శాతంగా ఉంది. మరోవైపు తగ్గిన బంగారం దిగుమతుల ప్రభావం ఆభరణాలు, రత్నాల ఎగుమతులపై చూపుతోంది. మార్చిలో రత్నాలు, ఆభరణాల ఎగుమతి విలువ కేవలం 4.6 శాతం వృద్ధి చెంది 3.61 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. కాగా, దేశీయ దిగుమతుల్లో ముడి చమురు తర్వాత స్థానం బంగారానిదే.