బిజినెస్

దేశానికే ఆదర్శం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 25: కడియం నర్సరీలను దేశానికే ఆదర్శ నర్సరీలుగా తీర్చిదిద్దాలని, మొక్కల పెంపక క్షేత్రాలను ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ ప్రతినిధులు సిఎంను కలిశారు. అసోసియేషన్ ప్రచురించిన నర్సరీటుడే ఆంగ్ల పత్రికను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తూ దేశంలో లభ్యమయ్యే మొక్కలే కాకుండా ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునే విదేశీ ఫల, పుష్ప జాతులను కూడా నర్సరీలకు తెప్పించాలని, శాస్ర్తియ పరిశోధనలతో హైబ్రీడ్ వంగడాలను సృష్టించి అభివృద్ధి చేయాలని సూచించారు. నర్సరీ యజమానుల సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి ఉద్యానవన, వ్యవసాయ, అటవీశాఖలతో టాస్క్ ఫోర్స్ వేస్తామన్నారు. రైతులకు మొక్కల పెంపకం, పర్యావరణ హితంగా ఉండే మొక్కలపై సమాచారాన్ని అందించటానికి నర్సరీటుడే లాంటి పత్రికలు ఉపయోగపడతాయని, వైజ్ఞానిక సమాచారాన్ని నర్సరీ రైతులకు అందించాలని కోరారు. కాగా, తమ నర్సరీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఎగుమతులపై పన్ను మినహాయంపులు ప్రకటించాలని అసోసియేషన్ ప్రతినిధులు బాబును కోరారు. కడియం లో 1,500 నర్సరీలు ఉన్నాయని, అయితే మార్కెట్ మీద తమకు ఆధిపత్యం లేదని, మార్కెట్లో మొక్క ల విక్రయాలకు ప్రోత్సాహకాలు లేవని సిఎం దృషి టకి తెచ్చారు. దీంతో తాము త్వరలో ఏర్పాటు చేయనున్న టాస్క్ ఫోర్స్ ఈ సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుందని చంద్రబాబు హామీనిచ్చారు.

సిస్టెమా శ్యామ్ నష్టం
రూ. 406 కోట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రైవేట్‌రంగ టెలికాం సంస్థ సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌టిఎల్) నికర నష్టం ఈ సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో 406.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే గత ఏడాది ఇదే వ్యవధిలో 437.9 కోట్ల రూపాయల నికర నష్టాన్ని సంస్థ అందుకుంది. ఎమ్‌టిఎస్ బ్రాండ్ పేరిట టెలికాం సేవలను అందిస్తున్న ఈ సంస్థ.. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో విలీనమవుతోంది. కాగా, ఆదాయం ఈసారి 376.3 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 342.7 కోట్ల రూపాయలుగా ఉంది.

ఐఆర్‌ఇడిఎ లాభం
రూ. 147 కోట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 25: భారత పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (ఐఆర్‌ఇడిఎ) లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 9 శాతం పెరిగి 147.12 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్-సెప్టెంబర్‌లో ఇది 134.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు ఐఆర్‌ఇడిఎ తెలియజేసింది. వడ్డీ ఆదాయం ఈసారి 561.74 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 511.61 కోట్ల రూపాయలుగా ఉంది.

లాభాల్లోకి ల్యాంకో ఇన్‌ఫ్రా

న్యూఢిల్లీ, నవంబర్ 25: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో సంస్థ ఏకీకృత నికర లాభం 98.98 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) జూలై-సెప్టెంబర్‌లో 527.48 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకుంది. ఈ మేరకు వివరాలను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ తెలియజేసింది. ఇకపోతే ఆదాయం ఈసారి 3,418.60 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,287.25 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, ఈ ఏప్రిల్-సెప్టెంబర్‌లో సంస్థ 201.38 కోట్ల రూపాయల ఏకీకృత నష్టాన్ని అందుకుంది. గత ఏప్రిల్-సెప్టెంబర్‌లో ఇది 833.83 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక 2014-15లో సంస్థ 2,036.74 కోట్ల రూపాయల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసింది.

‘బంగారంపై దిగుమతి పన్ను తగ్గించాలి’
న్యూఢిల్లీ, నవంబర్ 25: బంగారం దిగుమతులపై సుంకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తగ్గిస్తే రత్నాలు, ఆభరణాల ఎగుమతులకు దోహదపడినట్లవుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. పసిడి దిగుమతులు భారం కావడం వల్ల రత్నాలు, ఆభరణాల ఎగుమతి రంగం తీవ్రంగా ప్రభావితమవుతోందన్న ఆమె.. ఏ మాత్రం అవకాశం ఉన్నా బంగారంపై దిగుమతి పన్నును తగ్గించాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నట్లు పిటిఐకి చెప్పారు.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా
వడోదర, నవంబర్ 25: అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ).. వచ్చే నెల జరపాలనుకున్న దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేసింది. డిసెంబర్ 1-2 తేదీల్లో జరపాలని ఇంతకుముందు ఎఐబిఇఎ ప్రతిపాదించింది. అయితే డిప్యూటి చీఫ్ లేబర్ కమిషనర్ ఎమ్‌కె చౌధరితో చర్చల అనంతరం సమ్మెను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం పిటిఐకి తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో కెరియర్ ప్రోగ్రెషన్ పథకం అమలుకు నిరసనగా ఈ బంద్‌ను స్టేట్ సెక్టార్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌బిఇఎ) పిలుపునిచ్చింది.