బిజినెస్

సంక్షోభంలో ఆయిల్‌పామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 13: ధర గిట్టుబాటు కాకపోవటంతో ఆయిల్‌పామ్ రైతులు తమ తోటలను తామే నరుక్కునే దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. కనీస పెట్టుబడి కూడా దక్కకపోవటంతో ఆయిల్‌పామ్ సాగుకు స్వస్తిచెప్పి ఇతర పంటలవైపు రైతులు చూస్తున్నారు. గత ఏడాది మార్చిలో టన్ను ఆయిల్‌పామ్ పండ్ల ధర 8,440 రూపాయలు పలికితే, ఇపుడు 5,803 రూపాయలకు దిగజారింది. దీంతో దేశంలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే, రాష్ట్రంలో ఉభయగోదావరి జిల్లాలు ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు లక్షా 50వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోంది. వంట నూనెల డిమాండ్‌లో దాదాపు 80 శాతం డిమాండ్‌కు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న నేపథ్యంలో మన దేశంలోనే ఆయిల్‌పామ్ సాగును చేపట్టి, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో పాటు, ఇతర పంటల కన్నా ఆర్థికంగా అధిక ప్రయోజనాన్ని పొందవచ్చన్న ఉద్దేశ్యంతో ఉభయగోదావరి జిల్లాల రైతులు ఆయిల్‌పామ్ సాగువైపునకు మళ్లారు. కానీ గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. విదేశాల నుండి దిగుమతవుతున్న ముడి ఆయిల్‌పామ్‌పై గత యుపిఎ ప్రభుత్వం 80 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తే, ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వం ఆ దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించింది. దీనివల్ల విదేశీ ముడి పామాయిల్ పోటీని తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ పండ్ల ధర గణనీయంగా దిగజారింది. దిగుమతి సుంకాన్ని మరింత పెంచితే తప్ప, మన దేశంలో పండుతున్న ఆయిల్‌పామ్ పండ్ల ధర పెరిగే అవకాశం కనిపించడంలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా దిగుమతి సుంకాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఆయిల్‌పామ్ సాగును ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 2000-2001 సంవత్సరాల్లో ఇలాగే ఆయిల్‌పామ్ పండ్ల ధర దారుణంగా దిగజారినపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకాన్ని (ఎంఐఎస్) అమలుచేసి, రైతులను ఆదుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ అలాంటి ఎంఐఎస్‌ను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆయిల్‌పామ్ పరిశోధనా సంస్థ 2010లోనే టన్ను ఆయిల్‌పామ్ పండ్లకు కనీసం 8,500 రూపాయల ధర లభిస్తే తప్ప ఆయిల్‌పామ్ సాగు మనుగడ సాధ్యంకాదని చెప్పిందని, దానిని బట్టి చూస్తే నేటి పరిస్థితులకు అనుగుణంగా ధర కనీసం 10,000 రూపాయలుగా ఉండాలనేది రైతుల వాదన. చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయాన్ని చెబుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ రైతులు తమ తోటలను తామే నరుక్కునే దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయిల్‌పామ్ సాగుకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావించి, కేంద్రంతో చర్చించి పరిష్కారాన్ని చూపించకపోతే రానున్న రోజుల్లో ఆయిల్‌పామ్ సాగు మరింత ప్రమాదంలో పడే అవకాశముంది.

భారీ స్థాయలో కుప్పలుగా పోసిన ఆయిల్‌పామ్ పండ్లు