బిజినెస్

ఎల్‌అండ్‌టి నికర లాభం రూ. 2,454 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, మే 25: లార్సెన్ అండ్ టర్బో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 18.55 శాతం పెరిగి 2,453.64 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 2,069.64 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలిపింది. ఆదాయం ఈసారి 33,157.04 కోట్ల రూపాయలుగా, పోయినసారి 28,022.62 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం 2015-16లో సంస్థ ఏకీకృత నికర లాభం 5,090.53 కోట్ల రూపాయలుగా, 2014-15లో 4,764.82 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 2015-16లో గతంతో పోల్చితే 12 శాతం ఎగిసి 1,03,522 కోట్ల రూపాయలను తాకింది.

బుధవారం ముంబయలో ఆర్థిక ఫలితాలను
ప్రకటిస్తున్న ఎల్‌అండ్‌టి ప్రతినిధులు

టాటా స్టీల్ నికర నష్టం
రూ. 3,214 కోట్లు

న్యూఢిల్లీ, మే 25: టాటా స్టీల్ ఏకీకృత నికర నష్టం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 3,213.76 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 5,702.28 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం ఈసారి 29,507.55 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 33,666.18 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం సంస్థ ప్రకటించింది. మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ ఏకీకృత నికర నష్టం 3,049.32 కోట్ల రూపాయలుగా, ఆదాయం 1.17 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నష్టం 3,925.52 కోట్ల రూపాయలుగా, ఆదాయం 1.40 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే బ్రిటన్‌లో నష్టాల్లో నడుస్తున్న టాటా స్టీల్ వ్యాపారాన్ని, ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన వారి జాబితాలో ఇంకా ఎంపిక ప్రక్రియ ఏదీ చేపట్టలేదని టాటా స్టీల్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

38 శాతం పెరిగిన
గెయిల్ లాభం

న్యూఢిల్లీ, మే 25: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్ నికర లాభం ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 38.7 శాతం పెరిగి 770 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో 511 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం ఇక్కడ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బిసి త్రిపాఠి విలేఖరులకు తెలియజేశారు. టర్నోవర్ మాత్రం 18.3 శాతం క్షీణించి 11,627 కోట్ల రూపాయలకు పడిపోయిందన్నారు. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సంస్థ లాభం 2,299 కోట్ల రూపాయలుగా, టర్నోవర్ 51,614 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) లాభం 3,039 కోట్ల రూపాయలుగా, టర్నోవర్ 56,569 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ వెల్లడించింది.

బజాజ్ ఆటో
లాభం రూ. 803 కోట్లు

న్యూఢిల్లీ, మే 25: దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో స్టాండలోన్ నికర లాభం ఈ మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో 29.18 శాతం పెరిగి 803.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు జనవరి-మార్చిలో ఇది 621.62 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బజాజ్ ఆటో తెలిపింది. స్టాండలోన్ నికర అమ్మకాలు ఈసారి 5,303.89 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,623.7 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు చెప్పింది. మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ ఏకీకృత నికర లాభం 3,783.98 కోట్ల రూపాయలుగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 3,025.63 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. ఏకీకృత నికర అమ్మకాలు సైతం క్రిందటిసారితో చూస్తే 21,106.15 కోట్ల రూపాయల నుంచి 22,252.78 కోట్ల రూపాయలకు పెరిగాయి.

జబల్‌పూర్ మీదుగా
భోపాల్-హైదరాబాద్ విమానం
ప్రారంభించిన ఎయిరిండియా

హైదరాబాద్, మే 25: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా.. జబల్‌పూర్ మీదుగా భోపాల్ నుంచి హైదరాబాద్‌కు విమాన సేవలను ప్రారంభించింది. ‘కనెక్ట్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా మొదలైన ఈ విమాన సేవలు వారానికి నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో బుధవారం ఎయిరిండియా స్పష్టం చేసింది. మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఉదయం 8:45 గంటలకు భోపాల్ నుంచి ఎయిరిండియా విమానం 9863 బయలుదేరుతుంది. ఇది జబల్‌పూర్‌కు 9:50 గంటలకు చేరి, అక్కడి నుంచి తిరిగి 10:20 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు మధ్యాహ్నం 12:20 గంటలకు వస్తుంది.
మళ్లీ తిరుగు ప్రయాణంలో ఎయిరిండియా విమానం 9864 హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12:50 గంటలకు మొదలై, జబల్‌పూర్‌కు 2:50 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి 3:20 గంటలకు బయలుదేరి భోపాల్‌కు సాయంత్రం 4:25 గంటలకు చేరుతుంది. ఇదిలావుంటే జూన్ 16 నుంచి భోపాల్, జబల్‌పూర్ మధ్య ఎయిరిండియా 9867/9868 డైరెక్ట్ ఫ్లైట్ ఒకటి మొదలవుతోంది. ఈ సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది.