బిజినెస్

కొత్తదనంలో భారతీయులది కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: ఏ రంగంలోనైనా కొత్తదనంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారని గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల అన్నారు. భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఆలోచనాపరంగా సత్తాను చాటుతున్నారని పేర్కొన్నారు. ఒకరోజు భారత పర్యటనలో భాగంగా సోమవారం ఇక్కడకు చేరుకున్న నాదెళ్ల.. తమ సంస్థ నిర్వహించిన ‘టెక్ ఫర్ గుడ్, ఐడియాస్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన డిజిటల్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ సహకారంపై, దేశ ఐటి రంగంపై చర్చించారు. ఈ మేరకు మోదీ సమావేశం అనంతరం ట్విట్ చేశారు. కేంద్ర ఐటి, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాలను కూడా కలిశారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ నిర్వహించిన కార్యక్రమంలో సిన్హాతో కలిసి నాదెళ్ల పాల్గొన్నారు. కాగా, తెలుగువాడైన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా ఎన్నికైన దగ్గర్నుంచి భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. ఇకపోతే అంతర్జాతీయంగా మైక్రోసాఫ్ట్‌కు పోటీదారైన యాపిల్ సిఇఒ టిమ్ కుక్.. ఇటీవల భారత్‌లో నాలుగు రోజులు పర్యటించిన నేపథ్యంలో నాదెళ్ల తాజా సుడిగాలి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కుక్ తన పర్యటనలో ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్‌తోపాటు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ తదితర వ్యాపార, పారిశ్రామికవేత్తలను కలుసుకున్నది తెలిసిందే. హైదరాబాద్‌లో యాపిల్ మ్యాపింగ్ సెంటర్‌ను కూడా ఈ సందర్భంగా కుక్ ప్రారంభించారు.

chitram....
సోమవారం న్యూఢిల్లీలో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల కరచాలనం

20 నెలల కనిష్టానికి పి-నోట్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ, మే 30: పార్టిసిపేటరీ నోట్ల (పి-నోట్స్) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడులు ఈ ఏప్రిల్ నాటికి 20 నెలల కనిష్టాన్ని తాకాయి. 2.11 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. కాగా, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. పి-నోట్స్ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఈ నెల ఆరంభంలో కఠినతరం చేయడంతో ఇప్పటికే విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడులు పడిపోయినది తెలిసిందే. ఈ క్రమంలో పి-నోట్స్ ద్వారా దేశీయ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులు మున్ముందు మరింతగా తగ్గవచ్చన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో కనిపిస్తోంది.

జనవరి-మార్చి వృద్ధిరేటు 7.1 శాతం: డిబిఎస్
న్యూఢిల్లీ, మే 30: దేశ జిడిపి వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో దాదాపు 7.1 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం డిబిఎస్ అంచనా వేసింది. మంగళవారం జనవరి-మార్చి త్రైమాసిక జిడిపి గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనున్న క్రమంలో డిబిఎస్ తమ అంచనాను వెలిబుచ్చింది. కాగా, ప్రైవేట్ రంగంలో మందగించిన పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగంలో ప్రమాదకరస్థాయికి చేరుకున్న మొండి బకాయిలు ఈ ఏడాది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడింది.

సెనె్సక్స్ 72 పాయింట్లు వృద్ధి
ముంబయి, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 72 పాయింట్లు పుంజుకుని 26,725.60 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 21.85 పాయింట్లు అందుకుని 8,178.50 వద్ద నిలిచింది. దీంతో గత వారం వరుసగా నాలుగు రోజులపాటు లాభాల్లో కదలాడిన సూచీలు.. సోమవారం ఆ లాభాలను కొనసాగించినట్లైంది. మెటల్, ఐటి, టెక్నాలజీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు లాభాల్లోనే కదలాడాయి.
పిఒఎస్ ఏర్పాటులో
ఎస్‌బిఐ టాప్
ముంబయి, మే 30: పాయింట్-ఆఫ్-సేల్ (పిఒఎస్) టెర్మినల్స్ ఇన్‌స్టాలింగ్‌లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. దేశంలోని ఇతర బ్యాంకులకంటే ముందుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 2.96 లక్షల పిఒఎస్‌లను ఏర్పాటు చేసింది. ఈ విషయంలో 2.81 లక్షలతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రెండో స్థానంలో ఉండగా, 2.58 లక్షలతో యాక్సిస్, 2 లక్షలతో ఐసిఐసిఐ బ్యాంక్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయని ఆర్‌బిఐ సోమవారం వెల్లడించింది.

విశాఖ వేదికగా
బ్రిక్స్ సదస్సు?
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 30: అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా ఖ్యాతినార్జిస్తున్న విశాఖ.. మరో భారీ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. విశాఖపట్నం వేదికగా ఈ ఏడాది చివరి నాటికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సు నిర్వహించే అవకాశం ఉందని విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు వెల్లడించారు. కేంద్రంలో అధికారం చేపట్టి భారతీయ జనతా పార్టీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలోని ఆయన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల ఇష్టాగోష్ఠిలో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారు. బ్రిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత్.. ఈ సారి సదస్సును విశాఖలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోందని, అందుకు వేదికగా విశాఖను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో అంతర్జాతీయ సీ ఫుడ్ ట్రేడ్ ఫెయిర్‌ను నిర్వహించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), భాగస్వామ్య సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విశాఖలో విజయవంతంగా నిర్వహించినది తెలిసిందే.

మూడింతలైన
టాటా మోటార్స్ లాభం
ముంబయి, మే 30: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 5,177.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 1,716.5 కోట్ల రూపాయలుగానే ఉండగా, ఈసారి మూడింతలు ఎగిసింది. అమ్మకాలు 18.76 శాతం పెరిగి ఈసారి 79,926.12 కోట్ల రూపాయలుగా, పోయినసారి 67,297.99 కోట్ల రూపాయలుగా ఉన్నాయని సోమవారం స్పష్టం చేసింది.

సెయిల్ నష్టం
రూ. 1,231 కోట్లు
న్యూఢిల్లీ, మే 30: దేశీయ అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ సెయిల్ స్టాండలోన్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 1,230.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో సంస్థ 334.22 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 2 శాతం తగ్గి 11,371.66 కోట్లుగా నమోదైందని సోమవారం సెయిల్ చెప్పింది.

క్షీణించిన
ఎన్‌టిపిసి లాభం
న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వరంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసి స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఆఖరు త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7.73 శాతం క్షీణించి 2,716.41 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో లాభం 2,944.03 కోట్ల రూపాయలుగా ఉందని ఎన్‌టిపిసి లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సోమవారం తెలిపింది. ఇక స్టాండలోన్ ఆదాయం ఈసారి 19,879.38 కోట్ల రూపాయలుగా, పోయినసారి 18,560.70 కోట్ల రూపాయలుగా ఉంది.