బిజినెస్

సిలికాన్ వ్యాలీలో పాలికామ్ సిఇఒతో కెటిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్.. సిలికాన్ వ్యాలీలో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ముందుగా పాలికామ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కెటిఆర్ సందర్శించినట్లు బుధవారం విడుదలైన ఓ ప్రకటన తెలియజేసింది. పాలికామ్ సిఇఒ పీటర్ లీవ్‌తో జరిగిన సమావేశంలో తమ సంస్థ అభివృద్ధిలో హైదరాబాద్‌దే కీలకపాత్ర అని పీటర్ అన్నారని, నగరంలోని సంస్థ ఆర్‌అండ్‌డి విభాగంలో సుమారు 70 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టినట్లు చెప్పారని ప్రకటన పేర్కొంది. కాగా, పాలికామ్ విస్తరణకు తమ ప్రభుత్వం మద్దతిస్తుందని కెటిఆర్ హామీ ఇచ్చారు. అనంతరం స్లమ్ బర్గర్, సాన్ మినా ప్రతినిధులతోనూ కెటిఆర్ సమావేశమయ్యారు.

ఐదు నెలల కనిష్టానికి పిఎమ్‌ఐ
న్యూఢిల్లీ, జూన్ 1: తయారీ రంగంలో వృద్ధిరేటు గత నెల మేలో ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. విదేశాల నుంచి తగ్గిన డిమాండ్, పెరిగిన ఉత్పాదక వ్యయంతో తయారీ వృద్ధిరేటు 50.7 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల ఏప్రిల్‌లో 50.5 శాతంగానే ఉన్నప్పటికీ మే గణాంకాలు ఐదు నెలల కనిష్టమని నికీ/మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పిఎమ్‌ఐ) బుధవారం తెలిపింది. ఇదిలావుంటే తాజా ఈ గణాంకాలతో వచ్చే వారం జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

‘ఐఎమ్‌సిసిఐతో వాణిజ్యం బలోపేతం’
రబత్, జూన్ 1: ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతానికి భారత్, మొరాకో దేశాలు చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించాయి. ఖనిజ సంపన్న ఆఫ్రికా ఖండంలో భారత ఆర్థిక కార్యకలాపాలకు మొరాకోను వేదికగా చేసుకోవాలని కేంద్రంలోని మోదీ సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ పర్యటిస్తున్న భారత ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ.. మొరాకో ప్రధాన మంత్రి అబ్దుల్లా బెంకిరనే ఓ కార్యక్రమంలో భారత్-మొరాకో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐఎమ్‌సిసిఐ)ని ప్రారంభించారు. ప్రపంచీకరణ మధ్య ఐఎమ్‌సిసిఐ వంటి సంస్థల అవసరం ఉందని, వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని ఇరువురు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

కొత్త పన్నుతో సేవలు ప్రియం
న్యూఢిల్లీ, జూన్ 1: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త పన్ను బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. 0.5 శాతంగా ఉన్న ఈ కృషి కల్యాణ్ సెస్‌వల్ల పన్ను వర్తించే అన్ని సేవలు బుధవారం నుంచి ప్రియం అయ్యాయి. హోటల్ భోజనం, ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్, సినిమాలు, ప్రజారోగ్యం, బ్యాంకింగ్ లావాదేవీల వ్యయం జూన్ 1నుంచి పెరిగింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్, ఎటిఎఫ్, సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరల పెరుగుదల కూడా బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల పన్ను విధించగలిగే అన్ని సేవలపై సేవా పన్ను బుధవారం నుంచి 15 శాతం అయింది. జైట్లీ బడ్జెట్‌లో సేవా పన్నును 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచారు. ఇది 2015 జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. 2015 నవంబర్ 15 నుంచి 0.5 స్వచ్ఛ భారత్ సెస్ అమలులోకి వచ్చింది. దీంతో సేవాపన్ను 14.5 శాతం అయింది. బుధవారం నుంచి అమలులోకి వచ్చిన 0.5 శాతం ‘కృషి కల్యాణ్ సెస్’ వల్ల మొత్తం సేవా పన్ను 15 శాతానికి చేరింది.
కాగా, ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను 17-18 శాతానికి చేరువగా చేయడానికే ప్రభుత్వం సేవాపన్నును దశలవారీగా పెంచుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో గడచిన ఐదు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర 4.47 రూపాయలు, డీజిల్ ధర 6.46 రూపాయలు ఎగిసినట్లైంది. తాజాగా లీటర్ పెట్రోలు ధర రూ. 2.58, డీజిల్ ధర రూ. 2.26 చొప్పున పెరిగినది తెలిసిందే. గత ఐదు వారాల్లో వీటి ధరలు పెరగడం ఇది మూడోసారి. పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ. 65.60, డీజిల్ ధర రూ. 53.93గా ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) ధర కూడా కిలో లీటర్ రూ. 3,945.47 పెరిగి రూ. 46,729.48కి చేరింది. 14.2 కిలోల నాన్ సబ్సిడీ వంటగ్యాస్ ధర కూడా రూ. 21 పెరిగి ఢిల్లీలో ప్రస్తుతం రూ. 548.50 పలుకుతోంది.