బిజినెస్

ఆర్‌బిఐ పాలసీపైనే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష, వర్షాల ప్రగతి, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘వర్ష సమాచారం, ఆర్‌బిఐ ద్య్రవ్యపరపతి విధాన సమీక్ష ఈ వారం మార్కెట్ తీరును శాసిస్తాయి. వర్షాలు ఊహించినట్లుగానే సకాలంలో కురిస్తే మార్కెట్లు పరుగులు పెట్టడం ఖాయం.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. మంగళవారం ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష చేయనున్నది తెలిసిందే. ‘ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ తీసుకునే నిర్ణయాలు, చేసే వ్యాఖ్యలు మదుపరుల పెట్టుబడులను నిర్దేశిస్తాయి.’ అని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు గౌరంగ్ షా అన్నారు. ఇకపోతే ఏప్రిల్ నెలకుగాను పారిశ్రామికోత్పత్తి గణాంకాలు శుక్రవారం విడుదలవుతుండటంతో అవి కూడా మార్కెట్ తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మంగళవారం ఆర్‌బిఐ నిర్వహించే ద్రవ్యసమీక్షపైనే అందరి చూపూ ఉందన్న అభిప్రాయాలు పెద్దగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈసారి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్ల తగ్గింపు ఏమీ ఉండకపోవచ్చన్న అంచనాలు గట్టిగానే ఉన్నప్పటికీ, పారిశ్రామిక రంగం నుంచి వడ్డీరేట్లు తగ్గించాలన్న డిమాండ్ ఉండటం, అన్నింటికంటే మించి ఈ సెప్టెంబర్‌లో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ పదవీకాలం ముగుస్తుండటంతో దానికి ముందు నిర్వహించే చివరి రెండు సమీక్షల్లో ఒకటైన ఈ సమీక్షలో రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏం మాట్లాడుతారన్నది మదుపరులలో మిక్కిలి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని మనీపామ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ నిర్దోశ్ గౌర్ వ్యక్తం చేశారు. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపించడం లేదని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచేదిగానే నిపుణులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా ఈ వారం భారత స్టాక్ మార్కెట్లపై అధిక ప్రభావాన్ని చూపేది మాత్రం ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షేనని కొటక్ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్, పిసిజి రిసెర్చ్ ఉపాధ్యక్షుడు దీపేన్ షా అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చికిగాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఫలితాలు ముగిసినందున మదుపరుల చూపంతా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షపైనేనని అంటున్నారు. కాగా, గడచిన రెండు వారాలు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసినది తెలిసిందే.
బిఎస్‌ఇలో బాండ్ల వేలం
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ)లో సోమవారం విదేశీ మదుపరులకు 4,046 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీ బాండ్లను వేలం వేయనున్నారు. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది.