బిజినెస్

అనారోగ్యంలో ఆక్వాసాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 29: అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యలకు డిమాండ్ ఉన్నప్పటికి వేసవికాలంలో సాగుచేసిన సాగు మాత్రం రోగాల పాలవుతోంది. ఇది వర్షాకాలం సాగుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వర్షాకాలం ఆక్వాసాగు గణనీయంగా తగ్గే అవకాశాలుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారక ద్రవ్యం తగ్గనుంది. ఈ సంవత్సరం ఎండలు మండిపోయనది తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భానుడి ప్రతాపంతో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ. దీంతో వాతావరణంలో తీవ్రమైన మార్పులే చోటుచేసుకున్నాయి.
ఆ ప్రభావం రొయ్యల సాగుదారులపై పడింది. ఎండ వేడిమికి రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిలో సెలనీటిలు పెరిగి రొయ్యల ఎదుగుదల నిలిచిపోయింది. ఖర్చులు మాత్రం దారుణంగా పెరిగినప్పటికీ రోగాలు మాత్రం రొయ్యలను వదలలేదు. ఒక సంవత్సరం రొయ్యల సాగుబాగుంటే మరో రెండు సంవత్సరాలు పంట దిగుబడులు బాగలేకపోవటంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 15 వందల హెక్టార్లల్లోని రొయ్యల సాగులో బాక్టీరియా పెద్ద ఎత్తున సోకి మెప్పల వ్యాధికి మృత్యువాత పడ్డాయి. దీంతో రొయ్యల రైతులు ఆర్థికంగా చితికిపోయారు. జిల్లాలోని చీరాల, వేటపాలెం, నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, శింగరాయకొండ, గుడ్లూరు మండలాల్లో సుమారు ఐదువేల హెక్టార్లల్లో ఆక్వాసాగు చేపట్టగా దాదాపు 15 వందల హెక్టార్లలోని సాగు రోగాలబారిన పడింది. వెనామి రొయ్య కేజి సుమారు 425 రూపాయల వరకు ఉండటంతో రైతులు ఆ సాగు వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం దిగుబడులు రావటం లేదు. రొయ్యల సాగును ప్రోత్సహించాలని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్య శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ రోగాలు మాత్రం రొయ్యలను వెంటాడుతూ రైతులను ఆర్థికంగా నిలువునా ముంచుతున్నాయి. గతంలో రొయ్యల సాగు బాగుండటంతో కొంతమంది చిన్న, సన్నకారు రైతులు చెరువులను కౌలుకు తీసుకునేందుకు ముందు కు వచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో చెరువులను కౌలుకు తీసుకునేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు.
ప్రధానంగా రోగాలను తట్టుకునే విధంగా ఉన్న రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రొయ్య రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉన్న రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీలపై కూడా అధికారులు కొరడా ఝుళిపించకపోతే మాత్రం నాణ్యమైన పిల్లలు రైతులకు సరఫరా చేయరన్న వాదన వినిపిస్తోంది. పెట్టుబడులు భారీగా పెరిగినప్పటికీ అందుకు అనుగుణంగా దిగుబడులు రావడం లేదు. రొయ్యల పంట రోగాలబారిన పడిపోతుండటంతో రైతులు భారీగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద వేసవికాలంలో రోగాలబారిన పడి రొయ్యల చెరువులు పెద్ద మొత్తంలో తుడుచుకుపెట్టుకుపోవటంతో ఆ ప్రభా వం వర్షాకాలంపై పూర్తిస్థాయిలో పడనుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రొయ్య రైతులకు ప్రత్యేకమైన, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి రొయ్యల సాగును ప్రోత్సహించాలని ఆక్వా రైతులు, నిపుణులు ముక్తకంఠంతో కోరుతున్నారు.