బిజినెస్

ఎయిర్‌టెల్-ఎయిర్‌సెల్ ఒప్పందానికి టెలికామ్ శాఖ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: నాలుగో తరం (4జి) స్పెక్ట్రమ్ కొనుగోలుకు సంబంధించి ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు భారతీ ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్ మధ్య కుదిరిన రూ.3,500 కోట్ల వివాదాస్పద ఒప్పందాన్ని టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు టెలికామ్ శాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ ఈ నెల 4వ తేదీన ఈ ఒప్పందాన్ని ఆమోదించారని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై ప్రతిస్పందించేందుకు ఎయిర్‌టెల్ సంస్థ నిరాకరించింది. ఎనిమిది సర్కిళ్లలో ఎయిర్‌సెల్‌కు చెందిన 4జి స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకునేందుకు ఎయిర్‌టెల్ రూ.3,500 కోట్లతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సర్కిళ్లలో చెన్నై సహా తమిళనాడు, బిహార్, జమ్మూ-కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అస్సాం, ఈశాన్య ప్రాంత సర్కిళ్లు ఉన్నాయి. ‘ఎయిర్‌సెల్ స్పెక్ట్రమ్‌ను గమనంలోకి తీసుకున్న తర్వాత ఒడిశా సర్కిల్‌లో ఎయిర్‌టెల్ స్పెక్ట్రమ్ గరిష్ఠ పరిమితిని అధిగమించడంతో అనుమతి నిమిత్తం 1.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను సరెండర్ చేయాల్సిందిగా ఆ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఒప్పందానికి అనుమతి లభించకముందు ఉన్న 1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో 1.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ సరెండర్ చేసింది’ అని ఆ అధికారి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సర్వీసు ఏరియాకు కేటాయించిన మొత్తం స్పెక్ట్రమ్‌లో ఏ ఆపరేటర్ అయినా 25 శాతానికి మించి వాటా కలిగి ఉండటానికి వీల్లేదు.
ఎయిర్‌టెల్, ఆర్‌కామ్‌లతో ఎయిర్‌సెల్ కుదుర్చుకున్న ఒప్పందాలను ఆమోదిస్తే దాని మలేసియా మాతృ సంస్థ మ్యాక్సిస్ పరారయ్యే అవకాశం ఉందని, కనుక ఎయిర్‌సెల్ వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌చేస్తూ ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఈ నెల 8వ తేదీన లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ఎయిర్‌సెల్/మ్యాక్సిస్‌తో పాటు మలేసియాలోని ఆ సంస్థ యజమాని టి.ఆనంద్ కృష్ణన్‌పై సిబిఐ ఇప్పటికే సమగ్రమైన చార్జిషీటు దాఖలు చేసిన విషయం విదితమే. అలాగే వీరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు దాఖలు చేసి టెలికామ్ శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ ఆస్తులను జప్తు చేసినప్పటికీ మ్యాక్సిస్ సంస్థ ఆస్తులను మాత్రం జప్తు చేయలేదని ప్రశాంత్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎయిర్‌సెల్‌లో మ్యాక్సిస్‌కు 74 శాతం వాటా ఉండగా, మిగిలిన 26 శాతం వాటాను సింద్యా సెక్యూరిటీస్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ సంస్థ కలిగివున్న విషయం తెలిసిందే. ఆనంద కృష్ణన్‌తో కలసి దయానిధి మారన్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని, సోదరుడు కళానిధి మారన్‌తో కలసి నడుపుతున్న సన్‌టీవీ నెట్‌వర్క్‌లో మ్యాక్సిస్ గ్రూపు పెట్టుబడులు పెట్టినందుకు బదులుగా దయానిధి మారన్ ఎయిర్‌సెల్‌లో చెన్నై టెలికామ్ ప్రమోటర్ సి.శివాసన్‌కరన్‌కు చెందిన వాటాను బలవంతంగా ఆనంద కృష్ణన్‌కు అమ్మించాడని ఆరోపిస్తూ 2014 ఆగస్టులో సిబిఐ 2జి ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.