బిజినెస్

ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధనం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వరంగ బ్యాంకులకు తొలి విడత ఆర్థిక సాయంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో నిధులను విడుదల చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా, తొలి విడతలో 20,000 కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ప్రభుత్వ సాయం అందనుంది. నిజానికి గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిల కారణంగా మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో నష్టాలను మూటగట్టుకున్నది తెలిసిందే. అయితే అంతర్జాతీయ ప్రమాణాలైన బాసెల్-3 నిబంధనల ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకులకు 1.80 లక్షల కోట్ల రూపాయల మూలధనం అవసరం. కానీ ప్రభుత్వం మాత్రం 70,000 కోట్ల రూపాయలనే అందిస్తామని, మిగతా 1.10 లక్షల కోట్ల రూపాయలను మార్కెట్ల నుంచి సమీకరించుకోవాలని సూచించింది. ఇందుకు బాండ్లు, డిబెంచర్లు జారీ చేసుకోవచ్చంది. అయితే మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు) నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మెరుగైన సాయాన్ని బ్యాంకులు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకర్ల సూచనలతో తొలి విడతలోనే 20,000 కోట్ల రూపాయలను అందించాలని ఆర్థిక సేవల శాఖ నిర్ణయించింది. దీనిపై జైట్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల తీవ్రతను గమనించిన జైట్లీ.. అవసరమైతే బ్యాంకులకు మరింత సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమని గతంలోనే భరోసా ఇచ్చారు. దీంతో తొలి విడత సాయానికి జైట్లీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తుందనే అంతా భావిస్తున్నారు. ఇకపోతే బ్యాంకులకు అందిస్తామన్న 70,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయంలో గత ఆర్థిక సంవత్సరం 25,000 కోట్ల రూపాయలను ఇవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 25,000 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) 10,000 కోట్ల రూపాయలు, ఆపై ఆర్థిక సంవత్సరం (2018-19) మరో 10,000 కోట్ల రూపాయలను ఇస్తామని ప్రకటించింది. కాగా, నిరుడు ప్రభుత్వం నుంచి 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్థిక సాయం అందగా, అందులో అత్యధిక నిధులు ఎస్‌బిఐ (రూ. 5,393 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ. 2,455 కోట్లు), ఐడిబిఐ బ్యాంక్ (రూ. 2,229 కోట్లు), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (రూ. 2,009 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 1,732 కోట్లు)లకు అందాయి.

ఈ జనవరి-మార్చిలో ప్రభుత్వ బ్యాంకుల నష్టాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,367 కోట్లు
కెనరా బ్యాంక్ 3,905 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,587 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా 3,230 కోట్లు
సిండికేట్ బ్యాంక్ 2,158 కోట్లు
ఐడిబిఐ బ్యాంక్ 1,736 కోట్లు
యూకో బ్యాంక్ 1,715 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ 898 కోట్లు
అలహాబాద్ బ్యాంక్ 581 కోట్లు
కార్పొరేషన్ బ్యాంక్ 511 కోట్లు
దేనా బ్యాంక్ 326 కోట్లు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 120 కోట్లు