బిజినెస్

విజయ్ మాల్యాకు బిగుస్తున్న ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 7: మనీ లాండరింగ్ కేసుతో పాటు వేలాది కోట్ల రూపాయల రుణాలను చెల్లించకుండా బ్యాంకులను మోసగించిన కేసులో ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, మరికొందరు ఇతర నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంతకుముందు తొలి విడతగా మాల్యాకు చెందిన రూ.1,411 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఇడి తాజాగా మరిన్ని చర్యలు చేపట్టి బకాయిలను రాబట్టేందుకు రెండో విడతలో మరిన్ని ఆస్తులను జప్తు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం రూ.6 వేల కోట్లకు పైగా ఆస్తులను ఇడి గుర్తించింది. నేర శిక్షా స్మతి (సిఆర్‌పిసి)లోని సెక్షన్ల కింద ఇప్పటికే నేరస్థుడిగా ముద్ర పడిన విజయ్ మాల్యా ఇటీవల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కాకుండా తప్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని సెక్షన్ల ప్రకారం రెండోసారి విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమాయత్తమవుతోంది. ఇందుకోసం మాల్యాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని షేర్లు, స్థిర, చరాస్తులను గుర్తించామని, వీటిని స్తంభింపజేసి స్వాధీనం చేసుకోవడం ద్వారా కేసు దర్యాప్తును మరింత విస్తృతం చేయాలని యోచిస్తున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో విజయ్ మాల్యాతో పాటు ఇతర నిందితులపై కూడా ఇదేవిధమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని, వీరి ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించాల్సిందిగా బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే లేఖలు రాసిందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
‘పరారీలో ఉన్న వ్యక్తి’గా ప్రకటించాలి..
ఇదిలావుంటే, విజయ్ మాల్యాను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు నుంచి ఉత్తర్వును పొందేందుకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కృషి చేస్తోంది. ఈ ఉత్తర్వును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపి భారత్-బ్రిటన్ మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందాన్ని (ఎంఎల్‌ఎటి) అమలు చేయించడం ద్వారా విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకొచ్చి దర్యాప్తులో పాల్గొనేలా చూడాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంలో విజయ్ మాల్యాపై వ్యక్తిగతంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఇడి చాలా కాలం నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్ సహా విజయ్ మాల్యాపై అనేక అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నందున ఆయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూన్‌లోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది.