బిజినెస్

అమాయకుల అత్యాశే.. అక్రమార్కుల వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 26: మోసపూరిత పథకాలతో ఏటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వేల కోట్ల రూపాయల్లో తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. అమాయకుల అత్యాశే.. అక్రమార్కుల వ్యాపారమవు తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నకిలీ దందా అధికమే. ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే, రాష్ట్ర జనాభాలో 12 శాతం మంది అంటే దాదాపు 50 లక్షల మంది అమాయకులు అత్యాశతో అద్భుతమైన ప్రకటనలకు, ఇతర ప్రలోభాలకు లోనయి వివిధ గోల్డ్ కంపెనీలలో వేల కోట్ల రూపాయలను పెట్టుబడలుగా పెట్టి తీరా మోసపోయి గడచిన పదేళ్లుగా విలవిల్లాడుతున్నారు. దాదాపు అమాయకులను మోసం చేసిన గోల్డ్ కంపెనీలన్నింటిపై సిఐడి అధికారులు సాగిస్తున్న దర్యాప్తులు వివిధ దశల్లో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికీ నేటివరకు న్యాయం జరుగని వైనం ఆంధ్రభూమి దృష్టికి వచ్చింది. అతి తక్కువ పెట్టుబడితో స్వల్పకాల వ్యవధిలో ఎక్కవ రాబడి ఆశించి లక్షలాది మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని రోజువారీ సంపాదనను కూడా వివిధ సంస్థల్లో దినసరి, వీక్లీ, మంత్లీ స్కీములలో పెట్టుబడులుగా పెట్టి మోసపోయారు. వడ్డీ సంగతి దేవునికెరుక అసలు వస్తే చాలని ఇప్పుడు నిరీక్షిస్తున్నారు. వీరిలో అనేక మంది బలవరన్మరణాలు పొందారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా రియల్‌టైమ్ గవర్నెన్స్ అంటున్నారు. అయతే గత ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులపై ఒక్కసారి దృష్టిసారిస్తే బాగుంటుంది. ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన విజయవాడ సోదరుల అగ్రిగోల్డ్ సంస్థ దేశవ్యాప్తంగా 32 లక్షల మందిని, 6,380 కోట్ల రూపాయల మేర మోసగిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 19 లక్షల 52 వేల మంది 3,966 కోట్ల రూపాయల మేర మోసపోయారు. అలాగే అక్షయ గోల్డ్ సంస్థ 10 లక్షల మంది డిపాజిట్‌దారులను రూ. 335 కోట్ల 75 లక్షల మేర మోసగిస్తే దీనిపై ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో క్రైం నెంబరు 89/2012 కింద కేసు నమోదైంది. సిఐడి అడిషనల్ ఎస్పీ డి మేరి ప్రశాంతి 26 పేజీల ఛార్జిషీట్‌కు 3,214 పేజీలు కల్గిన 154 డాక్యుమెంట్స్‌తో నేడు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఒంగోలు కోర్టులో 38 మంది ముద్దాయిలపై చార్జిషీట్‌ను దాఖలు చేయటం జరిగింది. అవని గోల్డ్ ఫార్మ్స్, ఎస్టేట్స్ కంపెనీ డైరెక్టర్లు 45 వేల మంది డిపాజిట్‌దారుల నుంచి 19 కోట్లు సేకరించి మోసం చేయగా, సిఐడి అధికారులు ఇప్పటికే ఆ సంస్థ డైరెక్టర్లు టి మాల్యాద్రి, డి వెంకటేశ్వర్లు, ఇ రవికుమార్ గౌడ్‌లను అరెస్టు చేయటం జరిగింది. ఇక విజయవాడకు చెందిన అభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ సంస్థ డైరెక్టరు నాలుగు లక్షల డిపాజిట్ దారుల నుంచి 221 కోట్ల రూపాయలను సేకరించగా, ఈ కేసులో సిఐడి అధికారులు 19 కేసులు నమోదు చేసి కూకట్ల శ్రీనివాసరావు, కెఎస్ ఫణీంద్ర మూర్తి, సంపత్, కె రజనీకుమార్‌లను అరెస్టు చేశారు. 2001లో 1956 కంపెనీ యాక్ట్ కింద గోల్డ్ ఎండి పుష్పం అప్పలనాయుడు ప్రారంభించిన గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శుద్ధి చేయని వజ్రాలు, బంగారం, ప్లాటీనం వంటివి ఎగుమతి చేస్తామంటూ దాదాపు 56 వేల మంది డిపాజిట్‌దారుల నుంచి 110 కోట్ల రూపాయలను సేకరించింది. దానిపై కూడా అనేకానేక కేసులు నమోదయ్యాయి. బొమ్మరిల్లు ఫార్మ్స్ ఎల్లాస్ కంపెనీ రియల్ ఎస్టేట్ పేరిట దినసరి కలెక్షన్‌లతోను, అలాగే ఎఫ్‌డి, రికరింగు డిపాజిట్‌లతో 25 వేల మంది నుంచి 85 కోట్ల రూపాయలను సేకరించింది. వివిధ కంపెనీల తీరు ఇలా ఉంటే కర్నూలుకు చెందిన కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం డిపాజిట్లు సేకరించి కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా 11 వేల మంది డిపాజిట్‌దారుల నుంచి 750 కోట్ల రూపాయలను మోసం చేస్తే సిఐడి ఏడు కేసులు నమోదు చేసింది. వివిధ ప్రాంతాల్లోని విద్యా సంస్థలను స్వాధీనపరచుకుని ప్రస్తుతానికి వాటి నిర్వహణ బాధ్యతలను చైతన్య సంస్థలకు అప్పగించింది. విశాఖ పట్టణంకు చెందిన కనమర్లపూడి సురేంద్రబాబు మరో 11 మంది కలసి సెక్యూర్డ్ ఇనె్వస్ట్‌మెంట్ మేకింగ్ సర్వీస్ ‘సిమ్స్’ సంస్థను నెలకొల్పి 48 వేల 439 మంది డిపాజిట్‌దారుల నుంచి 340 కోట్ల రూపాయలను సేకరించి మోసగించింది. ఎన్‌మార్ట్ సభ్యులు 2 లక్షల 26 వేల మంది నుంచి 126 కోట్ల రూపాయలను సేకరించింది. సిరి గోల్డ్ ఫార్మా ఎస్టేట్ కంపెనీ 550 మంది ఏజెంట్ల ద్వారా 3,303 మంది డిపాజిట్‌దారుల నుంచి 33 కోట్ల రూపాయలను సేకరించింది. 1998 నుంచి 2005 మధ్య ఈ మోసాలు సాగాయి. విజయవాడకు చెందిన ఉమా చిట్ కంపెనీ రెండు వేల మంది నుంచి 900 కోట్ల రూపాయలను సేకరించి మోసగించింది. పై కేసుల దర్యాప్తులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ప్రతి సంస్థ కూడా ఆకర్షణీయమైన జీతాలు, కమిషన్‌లతో వేలాది మంది ఏజెంట్లను, డెవలప్‌మెంటు ఆఫీసర్లను నియమించి వారివారి బంధువుల నుంచి అధిక మొత్తాలను సేకరించటం జరిగింది. ప్రస్తుతం ఆ ఏజెంట్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. మొత్తానికి అమయాకుల లాభాపేక్షే అక్రమార్కుల పాలిట వరంలా మారుతోంది.