బిజినెస్

అవినీతి నిరోధానికి మరింత పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని సవరించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) కార్యక్రమంలో ఆయన వార్షికోపన్యాసమిస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న అవినీతి నిరోధక చట్టాన్ని 1988లో ఆర్థిక సరళీకరణకు ముందు రూపొందించడం జరిగిందని, ఆర్థిక నిర్ణయాల్లో అవినీతికి, పొరపాట్లకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంలో ఇది విఫలమవుతోందని అన్నారు. నిర్ణయాల్లో జరుగుతున్న పొరబాట్లను అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఉంచడంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు దేశ ఆర్థిక ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చే విధంగా సరైన, సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకునేందుకు జంకుతున్నారని తెలిపారు. రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోళ్లు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, వాణిజ్య రంగాలకు సంబంధించిన నిర్ణయాలే ఇందుకు ఉదాహరణ అని, వీటిని దృష్టిలో ఉంచుకుని సరళీకృత ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని పునస్సమీక్షించి, దానిని సవరించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని జైట్లీ పేర్కొన్నారు.
రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులకు రక్షణ
ఇందుకు సంబంధించిన బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. అవినీతి నిరోధక చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ప్రస్తుతం పార్లమెంట్ ముంగిట ఉన్నాయని, అస్థిర పరిస్థితుల నుంచి పార్లమెంట్ బయటపడితే ఏదో ఒక దశలో వీటిపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ఉపకరించే చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలన్నదే ఈ సవరణల ప్రధాన లక్ష్యమని, రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పిస్తుందని జైట్లీ వివరించారు.
దర్యాప్తు సంస్థల నైపుణ్యం పెరగాలి
‘లైసెన్స్ రాజ్’ యుగం నుంచి సరళీకృత యుగంలోకి మారిన ఆర్థిక వ్యవస్థతో పాటే నేరాలు కూడా మారాయని, రోజు రోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో సమీకృతమైందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక నేరాలకు కూడా విస్తృతంగా ఉపకరిస్తుండటంతో సరళీకృత యుగంలో మనీ లాండరింగ్ కార్యకలాపాలు, పన్ను మోసాలు, మార్కెట్ అవకతవకలు వంటి నేరాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఇటువంటి ఆధునిక నేరాలను అరికట్టేందుకు దర్యాప్తు సంస్థలు నిరంతరం తమ నైపుణ్యానికి పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ ఉద్ఘాటించారు.

చిత్రం.. అరుణ్ జైట్లీకి జ్ఞాపికను అందజేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దినేశ్వర్ శర్మ