బిజినెస్

గ్లోబల్ మార్కెట్లు తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 30: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 13 నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని అందుకుని 28 వేల స్థాయిని అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 8,700 స్థాయి ఎగువన స్థిరపడింది. ఆసియా, ఐరోపా మార్కెట్లతోపాటు అమెరికా మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల సంకేతాలు భారతీయ స్టాక్ మార్కెట్లను లాభాల్లో పరుగులు పెట్టించాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు బాగుండటంతో విదేశీ మదుపరుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పెట్టుబడులూ సూచీలను భారీ లాభాల దిశగా నడిపించాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచేందుకు అవకాశాలున్నా విదేశీ మదుపరులు పట్టించుకోకపోవడం గమనార్హం. దీతో ఉదయం ఆరంభం నుంచి లాభాల్లోనే కదలాడిన సూచీలు సమయం ముగుస్తున్నకొద్దీ ఆ లాభాలను మరింతగా పెంచుకుంటూపోయాయి. టెలికామ్ మినహా ఆటో, ఐటి, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, హెల్త్‌కేర్, టెక్నాలజీ, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్, మెటల్, రియల్టీ, ఇండస్ట్రియల్స్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 1.81 శాతం నుంచి 0.84 శాతం వరకు ఆయా షేర్ల విలువ పెరిగింది. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 440.35 పాయింట్లు పుంజుకుని 28,343.01 వద్ద ముగియగా, 2015 జూలై 23 స్థాయి 28,370.84 పాయింట్లకు చేరువైంది. ఇక నిఫ్టీ 136.90 పాయింట్లు ఎగిసి 8,744.35 వద్ద నిలవగా, 2015 ఏప్రిల్ 15 స్థాయి 8,750.20 పాయింట్లకు దగ్గరైంది. కాగా, మంగళవారం ట్రేడింగ్‌లో టెలికామ్ షేర్ల విలువ మాత్రం 1.20 శాతం పడిపోయింది. ఇకపోతే ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా, సింగపూర్ సూచీలు 0.85 శాతం నుంచి 0.06 శాతం మేర లాభపడ్డాయి. జపాన్ సూచీ మాత్రం స్వల్పంగా నష్టపోగా, ఐరోపా మార్కెట్లలో జర్మనీ 1.10 శాతం, ఫ్రాన్స్ 0.93 శాతం, బ్రిటన్ 0.04 శాతం చొప్పున పెరిగాయి.
ఆల్‌టైమ్ హైకి బిఎస్‌ఇ మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: మరోవైపు మంగళవారం మదుపరుల కొనుగోళ్ల దూకుడు మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ ఆల్‌టైమ్ హైకి చేరింది. 110.7 లక్షల కోట్ల రూపాయల (1.64 ట్రిలియన్ డాలర్లు)ను తాకింది. ఈ ఒక్కరోజే మదుపరుల సంపద 1,39,948 కోట్ల రూపాయలు పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా 1,10,70,610 కోట్ల రూపాయలకు చేరింది. దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ 5,02,202.97 కోట్ల రూపాయలతో సెనె్సక్స్ టాప్-10 సంస్థల్లో అగ్రస్థానంలో ఉండగా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 3,45,650.10 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉంది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3,22,240.25 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో నిలిచింది.