బిజినెస్

వేల ఉద్యోగాలు పోయాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 7: చైనా ప్రభుత్వరంగ బ్యాంకులు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న చైనాలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు కీలక రంగాల ప్రగతికి బ్రేకులు వేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య జాతీయ స్థాయిలో నడుస్తున్న నాలుగు అతిపెద్ద సర్కారీ బ్యాంకుల లాభాల్లో వృద్ధి లోపించింది.
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో గతంతో పోల్చితే కొన్నింటి లాభాలు పడిపోగా, మరికొన్నింటివి అంతే స్థాయిలో నమోదయ్యాయి. నిరుడు తొలి మూడు త్రైమాసికాల్లోనూ ఈ బ్యాంకుల లాభాల వృద్ధి గతంతో పోల్చితే 1 శాతాన్ని మించలేదని చైనా అధికార న్యూస్ ఏజెన్సీ జిన్హువా తెలిపింది.
ఈ క్రమంలోనే ఈ బ్యాంకులు వ్యయ నియంత్రణ చర్యలకు దిగగా, అందులోభాగంగానే ఏకంగా 25,260 మందిని తీసేసినట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. 2015 డిసెంబర్ ఆఖరుకల్లా చైనా బ్యాంకింగ్ ఉద్యోగుల సంఖ్య గరిష్ఠంగా 1.87 మిలియన్లుగా ఉంది. అయితే ఇందులో బ్యాంక్ ఆఫ్ చైనా ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరి నాటికి 6,881 తగ్గి 3,03,161కి దిగజారింది. అలాగే అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా సిబ్బంది సంఖ్యా 4,023 పడిపోయి 4,99,059కి పతనమైంది. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాలోని ఉద్యోగుల సంఖ్య కూడా 7,635 క్షీణించి 4,58,711కి దిగివచ్చింది.
చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ ఉద్యోగుల్లో 6,721 మంది ఉపాధిని కోల్పోగా, బ్యాంక్‌లో ప్రస్తుతం 3,62,462 ఉద్యోగులున్నారు. కాగా, మొండి బకాయిల తీవ్రత కూడా అధికంగా ఉండటంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న బ్యాంకర్లు.. ఉద్యోగుల వేతన భారాన్ని దించుకునే దిశగానే ముందుకెళ్తున్నారు. అందుకు నాంది పలుకుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకైన ప్రభుత్వరంగ బ్యాంకులే ఇంత పెద్ద ఎత్తున తొలగింపులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది.
చాలా బ్యాంకులూ ఇప్పుడు ఇదే బాటలో నడుస్తుండటం చైనీయులను కలవరపెడుతోంది. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రభావంతో ఉక్కు, బొగ్గు ఉత్పాదక రంగాల్లో స్థాయికి మించి ఉన్న ఉద్యోగులను తొలగిస్తామని చైనా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిణామం 1.8 మిలియన్ల మందికి ఉపాధిని దూరం చేస్తుందని అంచనా. చివరకు 2.3 మిలియన్ల జవాన్లతో బలంగా ఉన్న సైన్యంలోనూ వచ్చే ఏడాదికల్లా 3 లక్షల మంది సిబ్బందిని తొలగించాలనే నిర్ణయానికి డ్రాగన్ సర్కారు రావడం గమనార్హం. మొత్తానికి చైనా ఆర్థిక మందగమనం అక్కడి ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది.