బిజినెస్

రికార్డు ధర పలికిన పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం రోజు పత్తి రికార్డు ధర పలికింది. క్వింటాలు పత్తి ధర రూ.6,670 పలికింది. ఇది దేశంలోనే రికార్డు. బుధవారం మార్కెట్‌కు 964 పత్తి చెక్కుల్లో 1908 క్వింటాళ్ళ పత్తి అమ్మకానికి వచ్చినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మదిరే భాస్కర్‌రెడ్డి తెలిపారు. క్వింటాల్ పత్తి ధర రూ.5500 నుంచి రూ.6670కు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈధర ఆదోనిలో తప్ప దేశంలోని మరే మార్కెట్‌లో పలకలేదని జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమాని సోమశేఖర్‌గౌడ్, పత్తి వ్యాపారి హరియాదవ్ తెలిపారు. పత్తి అమ్మకానికి కేంద్రమైన గుజరాత్ రాష్ట్రంలోని మార్కెట్లో సైతం క్వింటాల్ పత్తి ధర రూ.5 వేలలోపే ఉందని పత్తి వ్యాపారి రాము తెలిపారు. ఆదోని మార్కెట్‌లో వ్యాపారులు, జిన్నింగ్ ఫ్యాక్టరీల యజమానులు పోటీపడడంతో రూ.6,670 ధర పలికిందన్నారు. మార్కెట్‌లో సరాసరి పత్తి మోడల్ ధర రూ.6,120 ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని నంద్యాల, ప్రొద్దుటూరు, గుంటూరు, అదిలాబాద్, వరంగల్ మార్కెట్‌లలో సైతం ఈధర పలకలేదని వ్యాపారులు హరి, రాములు తెలిపారు. ఆదోనిలో గత మూడేళ్లలో 60 జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. పత్తి కొరత ఏర్పడడంతో వ్యాపారులు, జిన్నింగ్ ఫ్యాక్టరీల యజమానులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారని సోమశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. దూది కండీ ధర రూ.48 వేల నుంచి రూ.53 వేలకు చేరుకుందని సోమశేఖర్‌గౌడ్ తెలిపారు. ధర పెరగడంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం,,, ఆదోని మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన పత్తి

సవాళ్లను అధిగమించాలి

హెచ్‌ఆర్ నిపుణులకు కార్పొరేట్ అధిపతుల పిలుపు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 21: మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు కార్పొరేట్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు ఆచరణాత్మకమైన విధానాలతో పరిష్కారాలను చూపాలని బ్రాడ్‌రిడ్జ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి లక్ష్మీకాంత్ తెలిపారు. బుధవారం ఇక్కడ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణ విభాగం మానవవనరుల అభివృద్ధి అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన సమాచారాన్ని సకాలంలో సేకరించడం, ఉద్యోగ నియామకాల్లో ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి మానవవనరుల నిపుణులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్పొరేట్ రంగంలో పోటీతత్వం నెలకొందన్నారు. నిర్ణయాలు సకాలంలో తీసుకుని వాటిని సమర్ధంగా అమలు చేయడంపై మానవవనరుల విభాగం శ్రద్ధ చూపాలన్నారు. సవాళ్లను అధిగమించే శక్తిని పెంపొందించుకోకుండా, జడత్వం ఉండే నిపుణుల వల్ల అవినీతి పెరుగుతుందన్నారు. లక్నో ఐఐఎం ప్రొఫెసర్ డాక్టర్ దేబాషిస్ చటర్జీ మాట్లాడుతూ, మానవ ప్రవర్తన విధానాలను హెచ్‌ఆర్ నిపుణులు అధ్యయనం చేయలన్నారు. మార్పును కోరుకోవడం, అనునిత్యం కొత్త అంశాలపై అధ్యయనం, టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ కావాలని ఆయన కోరారు. సిఐఐ తెలంగాణ హెచ్‌ఆర్ విభాగం కన్వీనర్ ఉమా దేవగుప్తాపు, సిఐఐ ఏపి పూర్వ చైర్మన్ ప్రదీప్ దోబాలే తదితరులు ప్రసంగించారు.

డిసెంబర్ నాటికి
సెయిల్- ఆర్సెలార్ జెవి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్, ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) వంద కోట్ల డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే జాయింట్‌వెంచర్ డిసెంబర్ నాటికల్లా ఖరారవుతుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్ చెప్పారు. జాయింట్‌వెంచర్‌కు సంబంధించిన అన్ని లాంఛనాలను డిసెంబర్‌నాటికల్లా పూర్తి చేయాలని తాను ఆ రెండు సంస్థలకు చెప్పానని, డిసెంబర్‌లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని భారత వాణిజ్య మండలి (ఐసిసి) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. సింగ్ గత నెల లండన్‌లో ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో సమావేశమై జాయింట్‌వెంచర్‌పై చర్చలు జరిపారు. భారత్‌లో ఆటోమోటివ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్మీ మిట్టల్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సెయిల్ చైర్మన్ పికె సింగ్, ఆర్సెలార్ మిట్టల్ యూరప్ గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సిఈఓ ఆదిత్య మిట్టల్, ఆర్సెలార్ మిట్టల్ తరఫున జాయింట్‌వెంచర్ చర్చలకు నాయకత్వం వహిస్తున్న బ్రియాన్ అరానా కూడా హాజరయ్యారు.
జాయింట్‌వెంచర్ రూపంలో భారత్‌లో ఆటోమోటివ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించడానికి ఆర్సెలార్ మిట్టల్, సెయిల్ గత ఏడాది మేలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. శరవేగంగా ఎదుగుతున్న భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమకు సాంకేతికంగా అత్యధునాతనమైన ఉక్కు ఉత్పత్తులను అందించే ఒక ప్రపంచ స్థాయి ఉక్కు పరిశ్రమను ఈ జాయింట్‌వెంచర్ ఏర్పాటు చేస్తుంది. దీనికి అవసరమైన హాట్‌రోల్డ్ ముడి సరకును ఒడిశాలోని భిలాయ్‌లో ఏర్పాటు చేసిన సెయిల్‌కు చెందిన కొత్త హాట్‌స్ట్రిప్ మిల్‌నుంచి సరఫరా చేస్తారు. 2026 నాటికల్లా భారత దేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దేశంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్సెలార్ మిట్టల్ అంటోంది. రాబోయే పదేళ్లలో దేశంలో ప్యాసింజర్ వాహనాల తయారీ సంఖ్య ఇప్పుడున్న 30 లక్షలనుంచి 70 లక్షలకు పెరిగే అవకాశముందని కూడా ఆ కంపెనీ అంచనా వేస్తోంది.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపిఓ
10 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: బీమా రంగానికి చెందిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) బుధవారం సాయంత్రానికల్లా పది రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం 13,23,78,973 షేర్లకు గాను 138 కోట్ల షేర్లకు బిడ్డింగ్ వచ్చింది. బుధవారం ఐపిఓకు చివరి రోజు. దీని ఒక్కో షేరు ధర రూ.330-334 మధ్య ఉంటుంది. ఐపిఓకన్నా ముందే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 4.89 కోట్ల షేర్లను ఒక్కో షేరు రూ. 334 చొప్పున యాంకర్ ఇనె్వస్టర్లకు విక్రయించింది. దీనిద్వారా రూ. 1635.33 కోట్లు సేకరించింది.
నేడే హెచ్‌పిఎల్ ఐపిఓ
కాగా, తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపిఓ) ద్వారా రూ. 361 కోట్లను సేకరించడం కోసం హెచ్‌పిఎల్ ఎలక్ట్రికల్, పవర్ గురువారం మార్కెట్లోకి రానుంది. ఈ నెల 26న ఈ ఐపిఓ ముగస్తుంది. ఈ ఐపిఓ షేరు ధర రూ. 175-202 మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది.