బిజినెస్

‘తూర్పు’లో మరింతగా రబ్బరు సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 5: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం గిరిజన ప్రాంతంలో మరింతగా రబ్బరు సాగుకు రబ్బర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తే మరిన్ని ప్రాంతాల్లో రబ్బరు మొక్కల పెంపకంలో గిరిజనులను భాగస్వాములను చేసేందుకు సిద్ధంగా ఉంది. రబ్బర్ బోర్డు జాయింట్ రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్ సి. సాబు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.
గిరిజనుల జీవితాల్లో రబ్బరు సాగు వెలుగులు నింపుతోందని వివరించారు. రంపచోడవరం ఐటిడిఎ పరిధిలో 1998లోనే కొంతమంది ఔత్సాహికులు రబ్బరు సాగు ప్రారంభించారన్నారు. ఆ తరువాత రబ్బర్ బోర్డు అక్కడి వాతావరణ పరిస్థితులను గమనించి దశలవారీగా రబ్బరు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించిందని తెలిపారు. మారేడుమిల్లి, దేవరాపల్లి తదితర ప్రాంతాల్లో రబ్బరు సాగు చేస్తున్న రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. పిఎం కోట ప్రాంతంలో వేసిన రబ్బరు చెట్ల నుంచి వచ్చే ఏడాది ల్యాటెక్స్ (రబ్బరు పాలు) సేకరించేందుకు వీలవుతుందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం 500 ఎకరాల్లో రబ్బరు సాగు చేస్తున్నారని, దీనిని మరింతగా విస్తరించే వీలు ఉందన్నారు. ఎకరా స్థలంలో రబ్బరు మొక్కలు నాటేందుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని, అయతే మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుం దని వివరించారు.
ఆ తరువాత మూడు సంవత్సరాలు ఆదాయం ఉండదని, కానీ తరువాత నుంచి ఆదాయం భారీగా ఉంటుందని తెలియజేశారు. ఇప్పటికే రంపచోడవరంలో మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండగా, ఆన్‌లైన్‌లో రేటు చూసి ల్యాటెక్స్ విక్రయించే వెసులుబాటు కూడా ఉంది. దీంతో రబ్బరు సాగు గిరిజన కుటుంబాల్లో కొత్త కాంతు లను ఇస్తోంది.
కాగా, బ్లాక్‌ల వారీగా ఎక్కువ సంఖ్యలో మొక్కలను పెంచేందుకు రబ్బరు బోర్డు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే మరిన్ని ప్రాంతాల్లో సాగు చేసేందుకు సిద్ధమని సాబు తెలిపారు. ఇది గిరిజనులకు ఉపాధితో పాటు అటవీకరణకు దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు రబ్బరు సాగుకు అనుకూలం కాదన్నారు. విశాఖలో తరచూ తుపానులు సంభవించే అవకాశం ఉందని, గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని గుర్తుచేశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదు అవుతున్నాయన్నారు. కానీ ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకే ఉండాలని, వర్షపాతం కూడా తగినంతగానే ఉండాల్సి ఉంటుందన్నారు.

గిరిజన ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతున్న రబ్బరు చెట్లు, చెట్ల కాండాల నుంచి సేకరిస్తున్న ల్యాటెక్స్ (పాలు)