బిజినెస్

8న మూడో విడత పసిడి బాండ్ల పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకం మూడో దశను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇంతకుముందు రెండు దశల్లో ఈ పథకం ద్వారా దాదాపు 1,050 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. ఈ క్రమంలో ఈ నెల 8 నుంచి 14 వరకు బాండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని, 29న బాండ్లను జారీ చేస్తామని ఓ ప్రకటనలో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సిఐఎల్), ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల ద్వారా ఈ బాండ్లను విక్రయిస్తామని పేర్కొంది. పసిడి బాండ్ల పథకంలో భాగంగా గత ఏడాది నవంబర్‌లో తొలి విడత బాండ్లను జారీ చేసిన ప్రభుత్వం.. 246 కోట్ల రూపాయల విలువైన 915.95 కిలోల బంగారానికి సంబంధించి సబ్‌స్క్రిప్షన్లను అందుకుంది. జనవరిలో రెండో విడత బాండ్లను జారీ చేయగా, ఈసారి 798 కోట్ల రూపాయల విలువైన 3,071 కిలోల బంగారానికి సంబంధించి సబ్‌స్క్రిప్షన్లను పొందింది. విదేశాల నుంచి భారీగా జరుగుతున్న పసిడి దిగుమతులకు కళ్ళెం వేయడం, తద్వారా కరెంట్ ఖాతా లోటును అదుపులో ఉంచడం, ఇండ్లలో ఉన్న బంగారాన్ని మార్కెట్‌లోకి తీసుకురావడం లక్ష్యంగా గత ఏడాది నవంబర్ 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

భారత్‌లో అత్యంత విశ్వసనీయ
ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్ అమెజాన్
న్యూఢిల్లీ, మార్చి 4: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్.. భారత్‌లో అత్యంత విశ్వసనీయ ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్ అని ఓ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో దేశీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ నిలిచాయి. టాప్-10లో ఈబే, మింత్రా, యెప్‌మి, జబాంగ్, నాప్‌టాల్, షాప్‌క్లూజ్, ఆస్క్‌మిబజార్ కూడా చోటు సంపాదించాయి. ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ (టిఆర్‌ఎ) ఏటా విడుదల చేసే ఈ రిపోర్ట్‌లో దేశంలోని 16 నగరాలకు చెందిన 21-50 మధ్య వయసున్న 2,500 మంది అభిప్రాయాలను తీసుకున్నారు.
మాల్యాకు నోటీసుల జారీకి
కర్నాటక హైకోర్టు ఆదేశం
బెంగళూరు, మార్చి 4: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు కర్నాటక హైకోర్టు శుక్రవారం నోటీసుల జారీకి ఆదేశించింది. రూ. 7,000 కోట్లకుపైగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో మాల్యాను అరెస్టు చేయాలని, పాస్ట్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐసహా మొత్తం 13 బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు పైవిధంగా స్పందించింది. మాల్యాతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, రుణాలతో ప్రమేయమున్న మరికొన్ని సంస్థలు, వ్యక్తులపై బ్యాంకులు హైకోర్టుకు వెళ్లాయి. అంతకుముందు బెంగళూరులోని డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్‌నూ మాల్యా అరెస్టుపై ఎస్‌బిఐ ఆశ్రయించినది తెలిసిందే.
7 వరకు బంద్
సమ్మెను పొడిగించిన జ్యుయెలర్లు
న్యూఢిల్లీ, మార్చి 4: ఎక్సైజ్ పన్నును 1 శాతం విధించడం, 2 లక్షల రూపాయలకు మించి జరిపే కొనుగోళ్లకు పాన్ కార్డు తప్పనిసరి చేయడం వంటి వాటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆభరణాల వర్తకులు చేపట్టిన సమ్మెను ఈ నెల 7 వరకు పొడిగించారు. బుధవారం ఈ సమ్మె మొదలవగా, తొలుత మూడు రోజులేనని జ్యుయెలర్లు ప్రకటించారు. అయితే శుక్రవారానికి మూడో రోజవగా, దీన్ని మరో మూడు రోజులపాటు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్) చైర్మన్ జివి శ్రీధర్ ప్రకటించారు. మరోవైపు ఈ సమ్మె కారణంగా ఢిల్లీ, ముంబయి బులియన్ మార్కెట్లు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం షాపుల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
డిమాండ్లను పరిష్కరిస్తాం: జైట్లీ
మరోవైపు జ్యుయెల్లర్లు చేస్తున్న సమ్మెపట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పందించారు. వారి డిమాండ్లను పరిష్కారిస్తామన్న హామీనిచ్చారు. 12 కోట్ల రూపాయలకు మించిన టర్నోవర్‌ను కలిగిన జ్యుయెలర్లకు వెండి మినహా ఆభరణాల అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును 1 శాతం విధించడంపట్ల వర్తకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి, మార్చి 4: గత మూడు రోజులుగా భారీ లాభాలను అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం స్వల లాభాలకు పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 39.49 పాయింట్లు పెరిగి 24,646.48 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 9.75 పాయింట్లు అందుకుని 7,485.35 వద్ద నిలిచింది. మెటల్, పిఎస్‌యు, బ్యాంకింగ్, విద్యుత్, రియల్టీ, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 2.15 శాతం నుంచి 0.40 శాతం పెరిగింది. ఇక ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్ సూచీలు 1.18 శాతం లాభాపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఇ బాండ్ల వేలం
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) విదేశీ మదుపరులకు మంగళవారం 4,681 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుందని ఓ ప్రకటనలో ఎక్స్‌చేంజ్ వర్గాలు తెలిపాయి.

చిన్న పరిశ్రమలకు చేయూతనివ్వాలి
విశాఖపట్నం, మార్చి 4: రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్న పరిశ్రమలను పట్టించుకోవడం లేదని మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బివి రామారావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత చిన్న పరిశ్రమలకు ఇవ్వడం లేదని వాపోయారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అధికంగా ఉన్నప్పటికీ వాటికి సరైన ప్రోత్సాహం కొరవడిందన్నారు. కేవలం కొత్త పరిశ్రమలకు రాయితీలు ఇస్తామంటున్న ప్రభుత్వం ఉన్న పరిశ్రమలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ముద్ర రుణాలకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎటువంటి హామీలు, ష్యూరిటీ లేకుండానే ముద్ర రుణాలు రూ. 50వేల నుంచి రూ. 10 లక్షల వరకు పొందే అవకాశం ఉందన్నారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం ముద్ర రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని, ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తానన్నారు.