బిజినెస్

ముదురుతున్న ఎండలతో తగ్గుతున్న ఆక్వా సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 19: రొయ్యల సాగు ప్రస్తుత వేసవి కాలంలో గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. వర్షాకాలంలో సాగుచేసిన రొయ్యల పంటను మూడు వంతుల రైతులు తీసేయగా, మిగతా రైతులు సైతం చెరువుల్లోని రొయ్యలను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటను సొమ్ము చేసుకున్న రైతులు.. వేసవికాలం సాగు వైపు మొగ్గుచూపారు. అయతే ఈ సంవత్సరం మాత్రం వేసవి కాలంలో రొయ్యల సాగు తగ్గనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆక్వా సాగు సాధారణంగా ఐదు వేల హెక్టార్లలో ఉండగా, ఈ వేసవి కాలంలో మూడు వేల హెక్టార్లలోనే సాగుచేసే అవకాశాలున్నాయని జిల్లా మత్స్యశాఖాధికారి లక్ష్మీ నారాయణ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.
ఒక రైతుకు పది రొయ్యల చెరువులు ఉంటే రెండు చెరువులను మాత్రమే సాగు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటి శాతం పెరిగి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నాయని, దీంతో రైతులు ఆచితూచి పంటను సాగుచేయాలనుకుంటున్నారని చెప్పారు. గత సంవత్సరంతోపాటు ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలకు అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ముదిరిన ఎండలు రొయ్యల సాగుకు ఏమాత్రం అనువు కాదని రైతులు భావిస్తున్నారు. చివరకు సముద్రపు క్రీకుల్లో సైతం ఉప్పునీటి శాతం పెరిగిపోయే అవకాశం ఉండటంతో రైతులు సాగుకు వెనుకడుగేస్తున్నారు. అయతే కొంతమంది రైతులు మాత్రం ప్రస్తుతం ఉన్న ధరలను చూసి సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురిస్తే దిగుబడులు పెరిగే అవకాశం ఉండటంతో వారు సాగుకు మొగ్గు చూపుతుండగా, మెజారిటీ రైతులు మాత్రం సాగుకు దూరంగానే ఉండాలని భావిస్తున్నారు.
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యలకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు వేసవికాలం కాకపోయినా వర్షాకాలంలోనైనా సాగు చేసేందుకు ముందుగానే కౌలుకు చెరువులను తీసుకుంటున్నారు. గతంలో హెక్టారు పదివేల రూపాయలకు కూడా అడగని కౌలుదారులు నేడు 50 వేల రూపాయలకు పైగానే అడుగుతుండటంతో రొయ్యల చెరువులు సాగు చేయనివారు కౌలుకు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం కేజి 30 కౌంట్ వెనామీ రొయ్య ధర ఆరు వందల రూపాయలకు పైగానే ఉంది. ఈ ధరకు 70 నుండి వంద కౌంట్ రొయ్యల దిగుబడులు వచ్చినా అధిక ఆదాయం రానుందని ఆక్వా రైతులు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.
ఇదిలాఉండగా హేచరీల్లో ఉత్పత్తిచేసే వెనామీ రొయ్య మార్కెట్‌లో 32 పైసల నుండి 33 పైసల వరకు మాత్రమే పలుకుతోంది. గతంలో 80 పైసల వరకు వెనామీ రొయ్య పిల్లను హేచరీల యజమానులు విక్రయించారు. అయనప్పటికీ ఉష్ణోగ్రతల కారణంగా వేసవికాలంలో ఆక్వా సాగు చేపట్టేందుకు రైతులు ముందుకురావటం లేదు. దీంతో ధరలు మరింతగా పతనమవు తాయా? అన్న ఆందోళన హేచరీ నిర్వాహకుల్లో కనిపి స్తోంది. కాగా, హేచరీలు ఎంపెడా నిబంధనలు పాటించకపోవటంతోనే నాణ్యమైన వెనామీ రొయ్య పిల్లలు తయారుకావటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెనామీ తల్లి రొయ్యను ఇతర దేశాల నుండి హేచరీల యజమానులు కొనుగోలుచేసి ఆ తల్లి రొయ్యతో పిల్లను ఉత్పత్తి చేయాల్సి ఉంది. కాని అక్కడ నుండి తల్లిరొయ్యను హేచరీల యజమానులు కొనుగోలు చేయకుండా ఇక్కడే చెరువుల్లో ఏపుగా పెరిగిన తల్లి రొయ్యనుండే పిల్లలను ఉత్పత్తి చేస్తూ రొయ్యల రైతులను నిలువునా మోసం చేస్తున్నారు.
మరోవైపు రొయ్య రైతులను ఆదుకునేందుకు సరైన కోల్డ్ స్టోరేజిలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవటంతో ప్రైవేటు కోల్డ్ స్టోరేజిల యజమాన్యాలు సిండికేట్‌గా మారి రైతులను నిలువునా దోచుకుంటున్నాయ. ఆక్వా రంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క వాగ్దానాలను గుప్పిస్తుండగా, మరోపక్క వారి సంక్షేమం మాట పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్‌లో వెనామీ రొయ్యలకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల కారణంగా సాగును వేసవికాలంలో రైతులు గణనీయంగా తగ్గిస్తుండటం గమనార్హం.

కేజ్ కల్చర్‌లో
గొరకల చేప పెంపకం
విశాఖపట్నం, మార్చి 19: ప్రయోగాత్మకంగా ఆరు జిల్లాల్లో గొరకల (నైల్ తిలారియా) చేప పెంపకాన్ని కేజ్ కల్చర్ (పంజరాల్లో చేపల పెంప కం) విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ చేపడుతోంది. నిజానికి రాష్ట్రంలో ఈ రకం చేప వినియోగం అంతగా లేనప్పటికీ, ఆగ్నేయాసియా దేశాల్లో డిమాండ్ ఉండటంతో తొలిసారిగా కేజ్ కల్చర్ క్రింద పెంచేందుకు మత్స్యశాఖ ఏ ర్పాట్లు చేసింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, అనంతపురం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపల పెంపకాన్ని చేపట్టారు. విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం పెద్దేరు రిజర్వాయర్‌లో ఈ చేపలను పెంచేందుకు కేజ్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు 80 లక్షల రూపాయలను కేటాయించగా, స్థానిక మత్స్యకారులకు ఈ చేపల పెంపకం, దాణా వేయడం, కేజ్‌కు ఉన్న వలను నిర్ణీత కాలంలో శుభ్రం చేయడంలో టాటా ట్రస్టు తర్ఫీదునిచ్చింది. 1.5 లక్షల చిరు చేపలను విజయవాడ నుంచి తీసుకువచ్చి నర్సీపట్నంలోని తాండవ రిజర్వాయరులో జనవరి నుంచి పెంచారు. చిరు చేపలు 15 నుంచి 30 గ్రాముల బరువు ఎదిగిన తరువాత వాటిని ఈ నెల 12న పెద్దేరు రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన పంజరాల్లో విడిచిపెట్టారు. మొత్తం 24 కేజ్‌లను చెరువు మధ్యలో ఏర్పాటు చేశారు. కాగా, వీటికి వేసే దాణా నీటిపై తేలియాడుతుండటంతో దాణా సరిపోకపోతే చిన్న చేపలను పెద్ద చేపలు తినేసే ప్రమాదం ఉన్నందున రెండు షిప్టుల్లో సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని విశాఖలోని మత్స్యశాఖ ఎడి పి కోటేశ్వరరావు తెలిపారు. కాగా, 1.5 లక్షల చిరు చేపలను తెచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల 45 వేల వరకూ చనిపోయాయని చెప్పారు. వీటి బరువు 850 గ్రాములకు చేరుకునే వరకూ పెంచుతామని, సెప్టెంబర్ నాటికి తొలి పంట అందుబాటులోకి వస్తుందని వివరించారు. మత్స్యకారులకు మెరుగైన ఆదాయంతోపాటు విదేశీ మారక ద్రవ్యం లభించే వీలుందన్నారు.