బిజినెస్

కడియం పూలకు కరెన్సీ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: పాత పెద్ద నోట్ల రద్దు సంక్షోభం నేపథ్యంలో ప్రసిద్ధిచెందిన తూర్పు గోదావరి జిల్లా కడియపులంక పూల మార్కెట్ వ్యాపారుల పరిస్థితి ‘పూలు అమ్మినచోటే..’ అన్నట్టుగా తయారైంది. పూలతోపాటు మొక్కల ఎగుమతులకు దేశవ్యాప్తంగా పేరొందిన కడియపులంకలో కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. పూల మార్కెట్‌కు కరెన్సీ కష్టాలు ఆవరించడంతో పూల రైతులు కుదేలయ్యారు. ఎగుమతులు లేకపోవడంతో కుళ్లిపోతున్నాయి. దీంతో మార్కెట్‌లో పూలన్నీ పెంటకుప్పలపై గుట్టలుగా పారేస్తున్న దుస్థితి దాపురించింది. కూలీలకు చిల్లర నోట్లు ఇవ్వలేని స్థితిలో దాదాపుగా తోటల్లో పూలను కోయించలేని స్థితి ఎదురైంది. కొనుగోలుదారుల నుండి సైతం పూల ఉత్పత్తులకు గిరాకీ పడిపోవడంతో ధరల్లేక కనీసం కూలీ ఖర్చులు కూడా దక్కని విపత్కర పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ పూల తోటలను దునే్నయడం మంచిదనే ఆలోచనలో రైతులున్నారు. సువాసనలు వెదజల్లే పూలన్నీ మార్కెట్ నుంచి కొనేవారు లేక కళ్లముందే చెత్తకుప్పలకు చేరుతుండటంతో రైతులు విలవిల్లాడుతున్నారు. పండించిన పూలకు సరైన ధర లేక, కొనుగోలు చేసేవారు లేక, కమీషన్ వర్తకులు చిల్లర నోట్లు ఇవ్వలేని స్థితిలో రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. చిల్లర నోట్లు ఇవ్వలేక, అమ్మేవారు పెద్ద నోట్లు తీసుకోలేక మార్కెట్ స్తంభించింది. కడియపులంక హోల్‌సేల్ పూల మార్కెట్ నుంచి నిత్యం రాష్ట్రం నలుమూలలకు, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వివిధ రకాల పూల ఎగుమతి జరుగుతుంటుంది. రోజూ సగటున సుమారు 50 టన్నుల వివిధ రకాల పూలు ఈ మార్కెట్‌కు వస్తుంటాయి. కమీషన్ వర్తకులు డిమాండును బట్టి ధరలను రైతులకు చెల్లిస్తుంటారు. తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అక్కడి పూల తోటలు పాడైపోవడంతో ప్రస్తుతం కడియపులంక నుంచే తమిళనాడు అవసరాలకు సరిపడా పూలన్నీ ఎగుమతి జరుగుతోంది. తమిళనాడుకు ఎగుమతులు పెరిగిన తర్వాత కడియపులంకలో పూలకు గిరాకీ అధికమైంది. రైతులకు కూడా మంచి ధరలే లభించాయి. కానీ 500, 1,000 నోట్ల రద్దు తర్వాత మొత్తం వ్యాపారమంతా చతికిలపడిందని కమీషన్ వర్తకుడు వీరబాబు వాపోయారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలిసిందే. ఈ నెల 8వ తేదీ రాత్రి ఈ మేరకు నరేంద్ర మోదీ ప్రకటించగా, డిసెంబర్ 30 వరకు బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో రద్దు చేసిన నోట్లను డిపాజిట్ చేసి, వాటికి సమాన విలువ కలిగిన కొత్త నోట్లను తీసుకోవచ్చని చెప్పారు. అయతే నోట్ల సరఫరాలో నెలకొన్న ఇబ్బందులతో మార్కెట్ లావాదేవీల్లో ప్రతిష్టంభన నెలకొంది. కాగా, కేజీ వంద రూపాయలు పలికే చామంతి పూలు ఇపుడు వీలును బట్టి 10, 20 రూపాయలకి అమ్మాల్సిన పరిస్థితి దాపురించింది. దానికీ డిమాండులేక పారేస్తున్నామని కమీషన్ వర్తకులు చెబుతున్నారు. మార్కెట్‌కు వచ్చే పూలు కూడా యాభై టన్నుల నుంచి ఐదు టన్నులకు పడిపోయాయ. పెళ్లిళ్ల సీజన్, కార్తీక మాసం అయినప్పటికీ పూలకు ధరలేక రైతులు కుదేలయ్యారు. మోదీ నిర్ణయం మంచిదే కావచ్చు గానీ, తమవంటి సామాన్యులపై పెత్తనం ఏమిటని, వ్యాపారాన్ని కోల్పోయామని కమీషన్ వ్యాపారి సత్తిబాబు ఆవేదన చెందారు. 100 రూపాయలు పలికే చామంతి.. ఇప్పుడు కేజీ పది నుంచి ఇరవై రూపాయలకు, 50 రూపాయలు పలికే లిల్లీ పూలు.. 10-15 రూపాయలకు ధరలు దిగజారాయ. 300-400 రూపాయలుండే కాగడా పూలు 100 రూపాయలు పలకడం గగనమైపోతోందని తెలిపారు. కడియపులంక పూల మార్కెట్‌కు సుమారు 25 కిలో మీటర్ల పరిధిలోని 16 గ్రామాల నుంచి వివిధ రకాల పూల ఉత్పత్తులు వస్తుంటాయి. వీటిని వర్తకులు వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. నోట్ల దెబ్బతో కోట్లాది రూపాయల వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇదిలా వుండగా కడియం నర్సరీల నుంచి దేశవ్యాప్తంగా మొక్కల ఎగుమతులు జరుగుతుంటాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల వీటి ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు స్తంభించాయ. కడియం ప్రాంతంలో సుమారు నాలుగు వేల నర్సరీలున్నాయి. దాదాపు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో నర్సరీలను పెంచుతున్నారు. నర్సరీలపై ఆధారపడి వందలాది కూలీలు పని చేస్తుంటారు. ఒక్కో నర్సరీలో కూలీలు, ఉద్యోగులకు జీతాల రూపేణా నెలకు 15 లక్షల రూపాయల వరకు చెల్లిస్తుంటారు. వీరందరికీ జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని నర్సరీ యజమానులు వాపోతున్నారు. జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉద్యోగాలను కుదించే పరిస్థితికొచ్చారంటే అతిశయోక్తి కాదు. పాతనోట్లు తీసుకోకపోవడం, కొత్తనోట్లు ఇవ్వలేని స్థితిలో ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయని యజమానులు చెబుతున్నారు. కూలీలకు లారీల్లో ఎగుమతి చేసేందుకు కూడా చిల్లర నోట్లు ఇవ్వలేక ఎగుమతులు నిలిచిపో యాయి. ఆన్‌లైన్ లావాదేవీలకు కూడా పరిమితులు పెట్టడంతో ఎగుమతులు పూర్తిగా క్షీణించాయి. కాగా, స్వచ్ఛ్భారత్ కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా నర్సరీ ఎగుమతులు వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నాయి. కానీ ప్రస్తుతం కోట్లాది మొక్కల ఎగుమతులు నిలిచిపోయాయి. కనీసం స్వచ్ఛ్భారత్ సంకల్పానికైనా నర్సరీలకు ప్రత్యామ్నాయ ప్రోత్సాహకాలు అందిస్తే కాస్తయినా ఎగుమతులు జరుగుతాయని నర్సరీ యజమానులు కోరుతున్నారు. దేశానికి ఆక్సిజన్‌ను అందించే ఫ్యాక్టరీలుగా ఉన్న కడియం నర్సరీలు నోట్ల రద్దు కారణంగా కుదేలయ్యాయ.

చిత్రం..కడియపులంక పూల మార్కెట్‌లో పూల గుట్టలు, ధరలేక రోడ్డు ప్రక్కన పారబోసిన పూలు