బిజినెస్

విశాఖలో జిసిసి ప్రధాన కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 7: గిరిజన సహకార సంస్థ(జిసిసి) ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.12 కోట్ల నిధులు కేటాయించింది. 4+1 పద్ధతిలో భవనాన్ని నిర్మించాలని జిసిసి యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి రూ.16 కోట్లతో కూడిన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించింది. అన్నింటినీ పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్ల మాత్రమే కేటాయించింది. పూర్తిస్థాయిలో అన్ని విభాగాలతో కూడిన కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. గత కొంతకాలంగా విశాఖ వుడాపార్కు సమీపాన ఉన్న పాత భవనాల్లోనే సంస్థ కార్యాలయం నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపధ్యంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన కార్యాలయాన్ని విశాఖలోనే నిర్మించాలని తొలి నుంచి ప్రభుత్వంతో పాటు, సంస్థ యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగానే అటవీ ఉత్పత్తులు అధికంగా దిగుబడి అయ్యే విశాఖను కేంద్రంగా చేసుకుని ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా మార్కెటింగ్, ఫైనాన్స్, పరిపాలనా తదితర విభాగాలన్నింటితో పూర్తిస్థాయిలో వౌలిక వసతులతో కూడిన ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే రాజధాని అమరావతికి సమీపంలో జిసిసి ప్రాంతీయ కార్యాలయం, లేదంటే గిరిజన సంక్షేమశాఖ పరిధిలోకి వచ్చే జిసిసి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అటవీ ఉత్పత్తుల దిగుబడి ఏమాత్రం లేకపోవడంతో ఇవి షెడ్యూల్ ఏరియాలోకి రావడం లేదు. రాష్ట్రంలో మిగిలిన 11 జిల్లాల్లో పలు రకాల అటవీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అటవీ ఉత్పత్తుల ద్వారా వ్యాపార లక్ష్యాలను అధిగమించాలంటే ప్రధాన కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేస్తూ అమరావతికి సమీపంలో సెక్రటేరియట్ తరహాలో ప్రత్యేక కార్యాలయాన్ని నిర్మించే ఆలోచన కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేకుండా సొంతంగానే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్న జిసిసి నిర్దేశిత ఆర్ధిక లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఏడాది రూ.250 కోట్ల మేర వ్యాపారం జరగ్గా, విడిపోయిన తరువాత కూడా ఇదే స్థాయి కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం అరకు కాఫీని పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ విధంగా గత ఏడాది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జిసిసి రూ.180 కోట్ల మేర వ్యాపారం సాధించగా, దీన్ని రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు తీసుకువెళ్ళాలని నిర్ణయించింది. పరిస్థితులు అనుకూలిస్తే రూ.280 కోట్ల మేర వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.