బిజినెస్

విద్యుత్ ఆదాలో ఈపీడీసీఎల్ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: నష్టాలు వస్తున్నా.. మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఈపీడీసీఎల్).. ఇపుడు ఇంధన పొదుపుపై మరింతగా ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. విద్యుత్‌ని ఆదా చేయడంలో దేశంలో ఉన్న 44 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో ఈపీడీసీఎల్ ప్రథమ స్థానంలో నిలబడగలిగింది. ఇదే విధానాన్ని మున్ముందు కొనసాగించాలనే సంకల్పంతో అనేక రకాలైన సంస్కరణలు, ప్రమాణాలను పాటిస్తోంది. అత్యంత కాంతి వంతమైన, కాలుష్య రహితమైన, అన్నింటికంటే ప్రధానంగా విద్యుత్‌ను ఆదా చేయగలిగే ఎల్‌ఇడి బల్బుల వాడకం ద్వారా ఆశించిన దానికంటే కూడా ఈ సంస్థ ఫలితాలను సాధించగలిగింది. సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు 80 లక్షల ఎల్‌ఇడి బల్బులు 39.60 లక్షల మంది వినియోగదారులకు పంపిణీ చేయగా, వీటి ద్వారా గత నెలాఖరికి 644.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయగలిగింది. అలాగే దీని కంటే ప్రధానమైన సోలార్ వ్యవసాయ పంపు సెట్లను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఐదు జిల్లాల్లో 2,978 పంపు సెట్లను ఏర్పాటు చేయడంతో వీటి ద్వారా మరో 5,926 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయగలిగింది. సాంకేతికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా మరో 913 వ్యవసాయ పంపు సెట్లను మార్పు చేసింది. వీటి స్థానంలో సమర్థవంతమైన పంపు సెట్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఐదు జిల్లాల్లో వీధి దీపాలుగా దాదాపు రెండు లక్షల ఎల్‌ఇడి బల్బులను వాడకంలోకి తీసుకురావడం ద్వారా ఈపీడీసీఎల్ ఏకంగా 25.35 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆదా చేయగలిగింది. ఈ విధమైన విద్యుత్ ఆదాతో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 5.48 శాతానికి తగ్గించగలిగింది. వాస్తవానికి సంస్థ ఏర్పడిన 14 ఏళ్ళ కిందట 12 శాతం మేర ఉండే నష్టాలను క్రమేపీ తగ్గించుకుంటూ ప్రస్తుతం ఈ స్థాయిని నిర్వహించగలుగుతోంది. రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ కార్యక్రమం ద్వారా ఒక నెలలోనే ఈ సంస్థ 7,78,320 యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. అందువలనే ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్) జాతీయస్థాయి అవార్డు అందుకుంది. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియాష్ గోయెల్ చేతులమీదుగా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ అందుకున్నారు. న్యూఢిల్లీలో ఇంధన పొదుపుపై జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ఈపీడీసీఎల్ ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో దీనిని అందజేశారు. సంస్కరణల ఫలితంగా దీనిని సాధించగలిగామని సంస్థ సిఎండి నాయక్ తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 16,718 మిలియన్ యూనిట్లు వాడకం జరగగా ఇందులో ఏకంగా 626.18 మిలియన్ యూనిట్ల వరకు ఇంధన పొదుపు సాధ్యపడిందన్నారు. అలాగే 2016-17 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 12,006 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం జరిగిందన్నారు. ఆంధ్రరాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఫైవ్ స్టార్ రేటేడ్ ఫ్యాన్ల పంపిణీ 38,730 వరకు జరిగిందన్నారు. ఈ విధమైన రెండు ప్రధాన అంశాల ద్వారా ఆశించిన స్థాయిలో ఇంధన పొదుపు ఫలితాలు వచ్చాయన్నారు. దీంతో మిగిలిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను అర్హులైన విద్యుత్ వినియోగదారులకు అందివ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.