బిజినెస్

గోప్యంగా అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట (రాజస్థాన్), ఏప్రిల్ 9: గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్డర్లన్నింటినీ గోప్యంగా ఉంచుతున్నారు. ఎవరికీ తెలియని చోట పని కానిచ్చేస్తున్నారు. ఇదీ.. నగల వ్యాపారుల దుస్థితి ఇప్పుడు. బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జ్యుయెల్లర్లు నిరవధిక బంద్‌ను పాటిస్తున్నది తెలిసిందే. నెల రోజులకుపైగా దుకాణాలు మూతబడి ఉండగా, కోట్లాది రూపాయల వ్యాపారం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పెళ్ళిళ్ల సీజన్ డిమాండ్‌ను వదులుకోని ఆభరణాల వర్తకులు.. రహస్యంగా స్వర్ణకారులచే నగలు తయారు చేయిస్తున్నారు. బయటకు షాపులు మూసేసినా.. లోపల మాత్రం వినియోగదారులకు కావాల్సిన డిజైన్లను చేసి అందిస్తున్నారు. రాజస్థాన్‌లో ఇప్పుడు ఎక్కడా చూసినా నగల వ్యాపారులు చేస్తున్నది ఇదే. తప్పదు మరి.. ఈ నెలలోనే వివాహ ముహూర్తం సవాస్ ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్లకు సవాస్ అత్యంత శ్రేష్టమైన సమయం. అందుకే ఏటా ఈ రోజు వేల జంటలు ఏకమవుతాయి. దీంతో సహజంగానే బంగారు ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు బంద్‌కు ఇక్కడి నగల వ్యాపారులు మనస్ఫూర్తిగా సహకరించలేని పరిస్థితి. ‘స్వర్ణకారులకు పని లేదన్న మాటే లేదు. ముఖ్యంగా సవాస్ ముహుర్తానికి ముందు వారికి తీరికే ఉండదు. భారీగా పెళ్ళిళ్లు జరుగుతాయి కాబట్టి నగల కొనుగోళ్లు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఆభరణాల డిమాండ్, ధరలు మార్కెట్‌లో బాగా ఉంటాయి.’ అని సవాస్ ప్రాముఖ్యతను ఓ నగల వ్యాపారి చెప్పారు.
రోజుల తరబడి వ్యాపారం మూతబడితే తాము బ్రతికేదెలా? అని ప్రశ్నిస్తున్నవారూ లేకపోలేదు. ఈ క్రమంలో బయటకు షాపులు మూసేసి తమ డిమాండ్లకు మద్దతుగా ఆందోళనను కొనసాగిస్తున్నామని, లోపల పెళ్ళిళ్ల సీజన్ డిమాండ్‌కు తగ్గట్లుగా పనిచేసుకుంటున్నామని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ నగల వ్యాపారి అన్నారు. మరోవైపు ఈ చాటుమాటు వ్యాపారం ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘నగల వ్యాపారులు అమ్మకాలను గోప్యంగా చేసుకుంటుండటంతో మార్కెట్‌లో కస్టమ్స్ సుంకం లేకుండానే బంగారం అమ్ముడవుతోంది. షాపులు మూసే ఉన్నాయి. కానీ పెళ్ళిళ్ల సీజన్ దృష్ట్యా రాత్రీ, పగలు లోపల నగల తయారీ, విక్రయాలు జరిగిపోతున్నాయి.’ అని మనిష్ అగర్వాల్ అనే ఓ స్థానిక నిపుణుడు అన్నారు. కాగా, కోట జిల్లాలో 95 శాతం వరకు నగల వ్యాపారం ఇప్పుడు రహస్యంగానే జరుగుతోందని తెలుస్తోంది. ‘బంగారు ఆభరణాల వ్యాపారం, డిజైనింగ్ పని బంద్ కారణంగా నిలిచిపోయింది. కానీ చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లోనే. మిగతా చోట్ల రహస్యంగా జరుగుతూనే ఉంది.’ అని బూండీ సర్రఫ్ అసోసియేషన్ అధికార ప్రతినిధి మూజీ నువాల్ చెప్పారు. అయితే ఇప్పటికే ఉన్న బంగారంతో చిన్న చిన్న ఆర్డర్లను చేస్తున్నారే తప్ప, మొత్తం మార్కెట్ లావాదేవీలు నిలిచిపోయాయని బూండీ సర్రఫ్ బజార్ అధ్యక్షుడు నోరత్మల్ అగర్వాల్ అన్నారు. కాగా, ప్రస్తుతం 10 గ్రాముల బంగారు నగను 28,500 రూపాయల వద్ద వినియోగదారులకు అందిస్తున్నట్లు ఓ వ్యాపారి చెప్పారు.
మరోవైపు రాజస్థాన్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎక్సైజ్ సుంకం పెంపు నిర్ణయానికి నిరసనగా కోటాలో 1,100 మంది తమ బిజెపి సభ్యత్వాన్ని వదులుకోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత ప్రభావం చూపవచ్చని విశే్లషకులు చెబుతున్నారు. నిరసన గళం మరింతగా పెరిగితే అది ఎక్సైజ్ పన్ను నిర్ణయంపైనా చూపవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

39వ రోజుకు సమ్మె
న్యూఢిల్లీ: ఆభరణాల వర్తకులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 39వ రోజుకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఫిబ్రవరి 29న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్‌లో వెండి ఆభరణాలు మినహా మిగతా ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రతిపాదించినది తెలిసిందే. దీంతో మార్చి 2 నుంచి దేశవ్యాప్తంగా నగల వ్యాపారులు బంద్‌ను మొదలుపెట్టగా, ఇంకా అది కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా తదితర ప్రధాన నగరాల్లో చాలా జ్యుయెల్లరీ షోరూమ్‌లు మూతబడే ఉన్నాయి. అయితే ఈ సమ్మె నుంచి పలు సంఘాలు తప్పుకున్న నేపథ్యంలో తమిళనాడులో చాలావరకు షోరూమ్‌లలో వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. నగల కొనుగోళ్లకు తప్పనిసరిగా పాన్ కార్డును వినియోగించాలన్నదాన్నీ వ్యాపారులు వ్యతిరేకిస్తుండగా, వ్యాపారుల డిమాండ్లన్నింటిపైనా సమగ్ర పరీశీలన జరిపి నివేదికను సమర్పించాలని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రీ అధ్యక్షతన ఓ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది కూడా. ఇక బంద్ కారణంగా ఇప్పటిదాకా 2,60,000 కోట్ల రూపాయల వ్యాపార నష్టం జరిగినట్లు నగల పరిశ్రమ అంచనా వేస్తోంది.