బిజినెస్

వీడ్కోలు-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ మాల్యా వ్యవహారం
ఈ సంవత్సరం దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం కుదిపేసింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 6,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకోగా, ఏళ్లు గడిచిపోవడంతో దానిపై వడ్డీలు, జరిమానాలతో ప్రస్తుతం ఆ మొత్తం విలువ 9,000 కోట్ల రూపాయలను దాటిపోయంది. ఈ నేపథ్యంలో బకాయలను చెల్లించాలని మాల్యాపై బ్యాంకర్లు ఒత్తిడి తీసుకురాగా, మార్చి 3న మాల్యా దేశం విడిచి పారిపోయాడు. ఈ క్రమంలో ఆయన్ను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా పలు బ్యాంకులు ప్రకటించాయి. ఈ వ్యవహారం కోర్టుల్లోకీ చేరగా, బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా స్థిర, చరాస్తుల అమ్మకానికి బ్యాంకులు దిగుతున్నాయి. అయతే మాల్యా ఇండ్లు, కార్లు, వ్యక్తిగత విమానం ఇలా అన్నింటినీ బ్యాంకులు, ఆదాయ, వాణిజ్య, సేవా పన్ను శాఖలు వేలం వేస్తున్నప్పటికీ కొనేవారే కరువయ్యారు. మాల్యా కేసును సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్లూ దర్యాప్తు చేస్తుండగా, స్వదేశానికి తీసుకురావాలనే ప్రయత్నాలు ఫలించడం లేదు. మాల్యా వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగానే పరిగణించింది. బ్యాంకుల మొండి బకాయల సమస్యనూ పరిష్కరించేందుకు నడుం బిగించింది. మొత్తానికి ఈ ఏడాది మాల్యా వ్యవహారం వ్యాపార, పారిశ్రామిక రంగాలనూ ప్రభావితం చేసింది.
రిలయన్స్ జియో సంచలనం
దేశీయ టెలికామ్ రంగంలో ఈ ఏడాది రిలయన్స్ జియో రాకతో పెను సంచలనాలే చోటుచేసుకున్నాయి. జియో ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌తో ఇతర సంస్థలన్నీ కూడా ఓ కుదుపునకు గురయ్యాయ. తమ కాల్స్, డేటా చార్జీలను భారీగా తగ్గించాయి. స్వల్ప ధరలకే ఉచిత ప్యాకేజీలనూ ప్రకటించాయి. అయినప్పటికీ పూర్తిగా ఉచితమైన జియోకే మొబైల్ వినియోగదారులు మారిపోవడంతో ఎయిర్‌టెల్‌సహా అన్ని ప్రధాన టెలికామ్ సంస్థల కస్టమర్ల సంఖ్య తగ్గిపోయింది. ఆదాయం కూడా గణనీయంగా క్షీణించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 4న రిలయన్స్ జియో 4జి సేవలు మొదలైయ్యాయి. తొలుత సంస్థ సిబ్బందికి ఉచితంగా, ఆ తర్వాత మూడు నెలలపాటు వినియోగదారులందరికీ సేవలు ఉచితమని ప్రకటించింది. తర్వాత డిసెంబర్ 31 వరకు, మళ్లీ మార్చి 31 వరకు పొడిగించింది. దీంతో టెలికామ్ మంత్రిత్వ శాఖకు, ట్రాయ్‌కి ఎయిర్‌టెల్ ఫిర్యాదులు చేయగా, చివరకు న్యాయపోరాటానికే సిద్ధమైంది. అటు 3జి కస్టమర్లకూ జియో సేవలు అందుబాటులోకి రానున్నాయన్న వార్తలు ప్రత్యర్థి టెలికామ్ సంస్థల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయ. 5 కోట్లకుపైగా వినియోగదారులతో దూసుకెళ్తున్న జియో.. 3జి స్మార్ట్ఫోన్లకూ సేవలను అందిస్తే వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహమే లేదు. ఇదిలావుంటే కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 నుంచి 3జి కస్టమర్లకు జియో సేవలు అందుబాటులోకి వస్తాయని సమాచారం. దీని కోసం ఓ యాప్‌ను కూడా రూపొందిస్తోంది జియో.
టాటా-మిస్ర్తిల వివాదం
ఈ ఏడాది దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలనేగాక, స్టాక్ మార్కెట్లనూ షేక్ చేసింది టాటా-మిస్ర్తిల వివాదం. అక్టోబర్ 24న టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి ఉద్వాసనకు గురయ్యారు. దీంతో 103 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌లో వివాదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయ. మిస్ర్తి స్థానంలో రతన్ టాటా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త చైర్మన్ కోసం అనే్వషణ కూడా జరుగుతోంది. టాటా సన్స్‌కు నాలుగేళ్ల క్రితం 2012, డిసెంబర్ 29న రతన్ టాటా స్థానంలో మిస్ర్తి ఎన్నికై ఆశ్చర్యం కలిగించారు. అయితే ఆయన ఎన్నిక ఎంతైతే ఆశ్చర్యానికి గురిచేసిందో.. అంతే ఆశ్యర్యాన్ని ఆయన ఉద్వాసన రేకెత్తించింది. లాభాలు లేని సంస్థల గురించి పట్టించుకోకపోవడం, లాభాలున్న సంస్థలపైనే దృష్టి సారించడం మిస్ర్తి తొలగింపునకు కారణంగా టాటా సన్స్ పేర్కొంటోంది. ముఖ్యంగా ఐరోపా ఉక్కు పరిశ్రమల్లో టాటా సన్స్‌కున్న చరిత్రే వేరు. అలాంటి చారిత్రక సంస్థ నేడు నిర్వీర్యం కావడం టాటా సన్స్ జీర్ణించుకోలేకపోయింది. నిజానికి అన్ని రంగాల్లోనూ తమ వ్యాపారం ఉండాలన్నది, అదీ అగ్ర స్థానంలో వెలుగొందాలన్నది టాటా సన్స్ ప్రాథమిక సూత్రం. అలాంటిది మిస్ర్తి వచ్చాక పలు రంగాల్లో టాటా సన్స్ వైభవం తగ్గిపోవడం, కొన్నింటి నుంచైతే నిష్క్రమించే పరిస్థితులు రావడం కూడా మిస్ర్తి ఉద్వాసనకు కారణమేనని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, టాటా గ్రూప్‌లోని ఒక్కో సంస్థ నుంచి మిస్ర్తి సభ్యత్వాన్ని టాటాలు తొలగిస్తుండగా, ఆయన అనుచరులనూ తీసేస్తున్నారు. చివరకు స్టాక్ మార్కెట్లలో లిస్టయన 6 సంస్థల నుంచి ఒకేసారి వైదొలగిన మిస్ర్తి.. న్యాయపోరాటానికి సిద్ధమ య్యారు. టాటా సన్స్‌లో మిస్ర్తి కుటుంబానికి దాదాపు 19 శాతం వాటా ఉంది. టాటా-మిస్ర్తిల వివాదాన్ని ప్రభుత్వం కూడా నిశితంగా పరిశీలిస్తోంది.
పాత పెద్ద నోట్ల రద్దు
నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఈ ఏడాది అందరినీ షాక్ గురిచేసింది. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి ప్రకటించిన ఈ నిర్ణయం వ్యాపార, పారిశ్రామిక రంగాలకు శరాఘాతమైంది. రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, వాటికి బదులుగా అంతే విలువైన కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తీసుకోవచ్చని ప్రధాని మోదీ సూచించారు. ఈ క్రమంలో అక్రమార్కులు తమ అవినీతి సంపదను మార్చుకోవడానికి అనేకానేక అడ్డదార్లు తొక్కగా, వాటిపై దృష్టి సారించిన కేంద్రం పెద్ద ఎత్తున దాడులు జరిపి ఆ సొమ్మును పట్టుకుంది. మరోవైపు 2వేల నోట్లు మాత్రమే చలామణిలోకి రావడంతో చిల్లర కష్టాలు మొదలయ్యాయి. దీంతో వ్యాపారాలు పడిపోగా, డిజిటలైజేషన్ దిశగా అడుగులేయాలంటూ సర్కారు ప్రోత్సహిస్తోంది.
తరలిపోయన విదేశీ పెట్టుబడులు
ఈ ఏడాది భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను లాగేసుకున్నారు. నిరుడు దాదాపు 70 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను పెట్టిన విదేశీ పోర్ట్ఫోలియో, సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ-ఎఫ్‌ఐఐ).. ప్రస్తుత సంవత్సరం మాత్రం సుమారు 20 వేల కోట్ల రూపాయల వరకు పట్టుకుపోయారు. ఈ ఏడాది జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. అయతే జూలై- సెప్టెంబర్ వ్యవధిలో భారతీయ మార్కెట్ల లోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన విదేశీ మదుపరులు.. అక్టోబర్-డిసెంబర్‌లో మాత్రం 72,000 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 25,000 కోట్ల రూపాయలుగా ఉంటే, రుణ మార్కెట్ల నుంచి పోయన పెట్టుబడుల విలువ 43,000 కోట్ల రూపాయలుగా నమోదైంది. దీంతో భారతీయ మార్కెట్ల నుంచి 18,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయనట్లైంది. 2014లో దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలైతే, 2015లో 67,000 కోట్ల రూపాయలకు పడిపోయంది. ఇక 2016లో 18,000 కోట్ల రూపాయలు భారతీయ మార్కెట్ల నుంచే విదేశీ మదుపరులు తీసుకెళ్లడం గమనార్హం. ఫలితంగా విదేశీ మదుపరుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా రానురాను తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది పాత పెద్ద నోట్ల రద్దు, బ్రెగ్జిట్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటివి ప్రధానంగా విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేశాయ.
తారుమారైన వృద్ధిరేటు అంచనాలు
ప్రపంచంలోనే పరుగులు పెడుతున్న జిడిపి భారత్ సొంతం. వృద్ధిరేటులో భారత్‌కు సాటిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి భారత్.. నిరుడు దేశ ఆర్థిక వ్యవస్థపై వినిపించిన అభిప్రాయాలివి. భారత్ జిడిపి తగ్గుముఖం పడుతుంది. పారిశ్రామిక వ్యవస్థలో మందగమనం కనిపిస్తోంది. వృద్ధిరేటు నెమ్మదించింది.. ఇవి ఈ ఏడాది వ్యక్తమైన అభిప్రాయాలు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు కావు. అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థల సంక్షోభం అంతకన్నా కాదు. కేవలం గత నెల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం. అవును.. నవంబర్ 8న తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం 2016-17 జిడిపి వృద్ధిరేటు అంచనాలనే తారుమారు చేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆశయం ఏమాత్రం నెరవేరుతుందో తెలియదుకానీ, దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలైంది. ప్రపంచంలో పెరెన్నికగల ఆర్థికవేత్తల అభిప్రాయమిదే. బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా, మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్, క్రిసిల్ తదితర అగ్రశ్రేణి రేటింగ్ ఏజెన్సీలు భారత జిడిపి వృద్ధి అంచనాలను నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా తగ్గించాయి మరి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలే కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ వర్గాలూ ఇదే చెబుతున్నాయి. నోట్ల రద్దు కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయ. ఆ వ్యాపారం, ఈ వ్యాపారం.. ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని వ్యాపారాల్లో లావాదేవీలు పడిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా దిగజారాయి. కేవలం పాత నోట్ల డిపాజిట్లు, కొత్త నోట్ల సరఫరాకే పరిమితం కావడంతో పారిశ్రామిక రంగాలకు ఆర్థిక చేయూత కరువైంది. ఉత్పాదక సామర్థ్యం క్షీణించగా, మార్కెట్‌లో కొనుగోళ్లూ తగ్గిపోయాయి. నోట్ల రద్దు జరిగి 2 నెలలు కావస్తున్నా దాని ప్రభావం తగ్గలేదు. వచ్చే మార్చి వరకూ పరిస్థితులు ఇలానే ఉండొచ్చన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తుండటం దేశ జిడిపి వృద్ధిరేటుకు అవరోధంగా మారింది.
పడుతూ.. లేస్తూ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గతంతో పోల్చితే తక్కువ లాభాలతో సరిపెట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 508.92 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239.45 పాయింట్లు అందిపుచ్చుకుంది. ఈ ఏడాది సెనె్సక్స్ ప్రయాణం 26,117.54 వద్ద మొదలవగా, 26,626.46 వద్ద ముగిసింది. శుక్రవారం జరిగిన ఈ ఏడాది చివరి ట్రేడింగ్‌లో 260.31 పాయింట్లు ఎగబాకింది. అలాగే నిఫ్టీ 7,946.35 వద్ద తన ప్రయాణాన్ని ఆరంభించగా, 8,185.80 వద్ద నిలిచింది. ఇక శుక్రవారం ట్రేడింగ్‌లో 82.20 పాయింట్లు ఎగిసింది. కాగా, పడుతూ.. లేస్తూ సాగిన ఈ ఏడాది పయనంలో భారతీయ స్టాక్ మార్కెట్లను అధికంగా ప్రభావితం చేసిన అంశాల విషయానికొస్తే విదేశీ మదుపరుల పెట్టుబడులు (ఎఫ్‌పిఐ లేదా ఎఫ్‌ఐఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలు, ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు, ఎగుమతి-దిగుమతుల గణాంకాలు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర సంస్కరణలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు, అమెరికా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు, అగ్రరాజ్య అధ్యక్షుడి ఎన్నికలు, యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ నిష్క్రమణ, ఈయులో సభ్యత్వంపై గ్రీస్ రెఫరెండమ్, సంస్కరణలపై ఇటలీ ప్రజాభిప్రాయ సేకరణ, పాత పెద్ద నోట్ల రద్దు, ఆర్‌బిఐ కొత్త గవర్నర్ నిర్ణయం, టాటా-మిస్ర్తిల వివాదం వంటివి ఉన్నాయి. ఇక ఈ ఏడాదిలో సెప్టెంబర్ 8న సెనె్సక్స్ గరిష్ఠ స్థాయి 29,077.28 పాయింట్లు, ఫిబ్రవరి 29న కనిష్ట స్థాయి 22,494.61 పాయింట్లు నమోదైంది. అలాగే సెప్టెంబర్ 7న నిఫ్టీ గరిష్ఠ స్థాయి 8,968.70 పాయింట్లు, ఫిబ్రవరి 29న కనిష్ట స్థాయి 6,825.80 పాయింట్లు నమోదైంది. ఇదిలావుంటే ఈ ఏడాది భారతీయ మార్కెట్లలోకి 83 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపిఒ) వచ్చాయి. ఈ సంస్థలు 3.8 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 34,800 కోట్ల రూపాయలు వచ్చాయ.
పసిడి, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఈ ఏడాది పడుతూ.. లేస్తూ.. పయనించాయి. ఆరంభంలో 10 గ్రాములు 25,390 రూపాయలుగా ఉన్న 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి.. ఇప్పుడు 28,500 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర 33,300 రూపాయల నుంచి 39,900 రూపాయలకు చేరింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర 3,110 రూపాయలు పెరిగితే, కిలో వెండి ధర 6,600 రూపాయలు పుంజుకున్నట్లైంది. రెండు లక్షల రూపాయలకు మించిన కొనుగోళ్లకు పాన్ కార్డు వినియోగం తప్పనిసరి చేయడం, జ్యుయెలర్ల సమ్మె, పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వంటివి ఈ ఏడాది బంగారం, వెండి అమ్మకాలను ప్రభావితం చేశాయి.
బక్కచిక్కిన రూపాయి
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాది క్షీణించింది. దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్లకు డిమాండ్ ఏర్పడటంతో భారతీయ కరెన్సీ కుదేలైంది. విదేశీ మదుపరులు సైతం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రాకపోవడం, ఇప్పటికే పెట్టిన పెట్టుబడులను లాగేసుకోవడం వంటివి రూపాయి విలువను దెబ్బతీశాయి. ఫలితంగా ఈ ఏడాది రూపాయి విలువ 177 పైసలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 66.15 వద్ద ఉంది. ఇప్పుడు అది 67.92 వద్ద స్థిరపడింది. శుక్రవారం జరిగిన ఈ ఏడాది చివరి ఫారెక్స్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 18 పైసలు కోలుకుంది. దీంతో నష్ట తీవ్రత కాస్త తగ్గింది. నిజానికి ఈ ఏడాది డాలర్‌తో చూస్తే రూపాయితోపాటు అన్ని ప్రధాన దేశాల కరెన్సీలు విలువను కోల్పోయాయి. ఇకపోతే ఈ ఏడాది రూపాయి కనిష్ట పతనం 68.86. ఇంతకుముందెప్పుడూ ఈ స్థాయికి రూపాయి విలువ దిగజారలేదు. నవంబర్ 24న ఈ చారిత్రక పతనం నమోదైంది. మరోవైపు పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పడిపోయిన వ్యాపారం, క్షీణించిన పారిశ్రామికోత్పత్తి మధ్య ఈసారి జిడిపి వృద్ధిరేటు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రూపాయి మారకం విలువ మరింతగా పతనం కావచ్చని, మునుపెన్నడూ లేనివిధంగా 70 రూపాయల దిగువకు దిగజారినా ఆశ్చర్యం లేదని నిపుణులు అంటున్నారు.
కీలక సంస్కరణలు
మరోవైపు ఈ ఏడాది మోదీ సర్కారు కీలక సంస్కరణలనే తెచ్చింది. ఇందులో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) కూడా ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తేవాలని చూస్తున్న కేంద్రం.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదింపజేసుకుంది. రాష్ట్రాల ఆమోదం కూడా పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ముమ్మర చర్చలు సాగుతున్నాయి. జిఎస్‌టితో దేశం మొత్తం మీద ఒకే రకమైన పన్ను అమల్లోకి రానుంది. ఇకపోతే ఈ ఏడాది రియల్టీ, దివాళా బిల్లులనూ తీసుకురాగా, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందాలని పేదవారికి పెద్ద ఎత్తున జన్‌ధన్ ఖాతాలనూ ఇచ్చింది. తక్కువ ధరకే ప్రమాద, జీవిత బీమా సౌకర్యాలనూ కల్పించింది. ఇక మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సైతం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
కోలుకున్న ఎగుమతులు
భారతీయ ఎగుమతులు గతంతో పోల్చితే ఈ ఏడాది కోలుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఇప్పటిదాకా ఆ సంకేతాలనే ఇచ్చాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే తొలి ఐదు నెలలు క్షీణిస్తూ వచ్చిన ఎగుమతులు.. ఆ తర్వాత జూన్ నుంచి నెమ్మదిగా పుంజుకున్నాయి. నిజానికి 2014 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే వరకు ఎగుమతులు క్రమేణా క్షీణిస్తూ పోయాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో విదేశాలకు దేశీయ ఎగుమతుల విలువ 261.13 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. అయితే ఈ ఏడాది జరిగిన ఎగుమతులను చూస్తే వీటి విలువ ఈ ఆర్థిక సంవత్సరం 280 బిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువగా నమోదు కావచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, ముఖ్యంగా భారతీయ ఎగుమతుల్లో ప్రధాన పాత్ర పోషించే యూరో దేశాల్లో చోటుచేసుకున్న సంక్షోభం దేశ ఎగుమతుల వృద్ధికి అవరోధంగా మారింది. యూరోజోన్ నుంచి బ్రిటన్ వైదొలగడం దేశ ఎగుమతులకు ప్రతికూలమైందని నిపుణులు పేర్కొన్నారు.
ఆర్‌బిఐకి కొత్త సారథి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)కు కొత్త గవర్నర్ ఈ ఏడాదే వచ్చారు. పలు నాటకీయ పరిణామాల మధ్య ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ స్థానంలో ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజన్‌కు ముందున్నవారంతా ఆర్‌బిఐ గవర్నర్‌గా ఐదేళ్లు పనిచేస్తే, రాజన్ మాత్రం మూడేళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖతో నెలకొన్న విధానపరమైన విబేధాలే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న పటేల్ ఆర్‌బిఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. పటేల్ గవర్నర్ కావడంతో ఖాళీ అయిన డిప్యూటీ గవర్నర్ పోస్టును ఈమధ్యే విరల్ ఆచార్యతో కేంద్రం భర్తీ చేసింది కూడా. కాగా, ఇన్నాళ్లూ రెపో, రివర్స్ రెపో తదితర కీలక వడ్డీరేట్లను నిర్ణయించే అధికారం ఆర్‌బిఐకే ఉండగా, ఆ అధికారంలో ఈ ఏడాది నుంచే కేంద్రం భాగస్వామి అయ్యింది. ద్రవ్యసమీక్షలకు ముందు పటేల్ నేతృత్వంలో కేంద్రం నియమించిన సభ్యులతో ఏర్పాటైన ఓ కమిటీ వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటోంది. ఇకపోతే ఈ ఏడాది రివర్స్ రెపో 5.75 శాతంగానే ఉంటే, రెపో రేటు మాత్రం 6.75 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్) 4 శాతం వద్దే యథాతథంగా ఉంది. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ ఏడాది ఆర్‌బిఐకి తీరిక లేకుండా చేసింది. రద్దయిన పాత 500, 1,000 రూపాయల నోట్ల స్థానంలో తెచ్చిన కొత్త 500, 2,000 రూపాయల నోట్లను ముద్రించడంలో తలమునకలైంది. బ్యాంకులకు కావాల్సినంత నగదును అందించడమే లక్ష్యంగా గత రెండు నెలల నుంచి పనిచేస్తోంది. చిల్లర సమస్య నేపథ్యంలో కొత్త 100, 50 రూపాయల నోట్లనూ ముద్రిస్తోంది.
మరికొన్ని
యూరోజోన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, యూరోజోన్ సభ్యత్వంపై గ్రీస్ ప్రజాభిప్రాయ సేకరణ, ఇటలీ సంస్కరణలపై రెఫరెండం.. అన్నిటికీ మించి అగ్రరాజ్య అధ్యక్షుడిగా వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం ఈ ఏడాది అంతర్జాతీయంగా చెప్పుకోదగ్గ అంశాలు. ఇవి భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపాయి. ముఖ్యంగా బ్రిటన్ నిష్క్రమణ, ట్రంప్ ఎన్నిక అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థను భారీగానే ప్రభావితం చేశాయి.

చిత్రాలు..ఫైట్ ఆఫ్ ది ఇయర్
*చెత్త కాగితాలు కాదు.. రద్దయన పాత పెద్ద నోట్లు. మురికి కాలువలో పడేసిన ఈ కరెన్సీని ఇలా ఎండకి ఆరబెట్టుకుంటున్నాడీ కుర్రాడు
*షాక్ ఆఫ్ ది ఇయర్