బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లకు హెచ్-1బి వీసా దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, జనవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లకు హెచ్-1బి వీసాల ఆందోళన పట్టుకుంది. ఐటి రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో శుక్రవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. హెచ్-1బి వీసాల జారీకి సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదిస్తున్న బిల్లు అమెరికా కాంగ్రెస్‌లోకి మళ్లీ రావడం.. భారతీయ మార్కెట్లను కుదిపేసింది. భారత ఐటి రంగ సంస్థల ఆదాయంలో అగ్ర భాగం విదేశాల నుంచే వస్తుంది. అందులో అగ్రరాజ్యం అమెరికా వాటా ఎక్కువే. టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలా అన్ని ఐటి సంస్థల అమెరికా వ్యాపారం ఆధారపడింది హెచ్-1బి వీసాలపైనే. ఈ వీసాల ద్వారానే భారత్ నుంచి అమెరికాకు తమ ఉద్యోగులను పంపిస్తున్నాయి ఐటి సంస్థలు. అయితే హెచ్-1బి వీసాల వినియోగంపై ఆంక్షలు పెట్టడానికి సిద్ధమవుతోంది ఇప్పుడు అమెరికా. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి భారతీయ మార్కెట్లు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 119.01 పాయింట్లు కోల్పోయి 26,759.23 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 30 పాయింట్లు దిగజారి 8,243.80 వద్ద నిలిచింది. ఐటి రంగ షేర్లతోపాటు రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోగా, కేవలం ఐటి షేర్ల మార్కెట్ విలువే 22,000 కోట్ల రూపాయలకుపైగా ఆవిరైపోయింది. టెక్ మహీంద్ర షేర్ల విలువ 3.18 శాతం, హెక్సావేర్ టెక్నాలజీస్ 3.73 శాతం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 3.55 శాతం, ఇన్ఫోసిస్ 2.50 శాతం, ఎంఫసిస్ 2.20 శాతం, టిసిఎస్ 2.18 శాతం, విప్రో షేర్ల విలువ 2.18 శాతం మేర పతనమైంది. మొత్తంగా ఐటి రంగ సూచీ ఈ ఒక్కరోజే 2.54 శాతం క్షీణించింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు నష్టపోగా, హాంకాంగ్ సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు పడిపోయాయి.