బిజినెస్

నిర్మాణ రంగానికి నోట్ల రద్దు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశీయ నిర్మాణ రంగంపై చూపింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినది తెలిసిందే. దీంతో రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. నిరుడు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రియల్టీ విక్రయాలు 44 శాతం పతనమైనట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ అయిన నైట్ ఫ్రాంక్ ఇండియా చేసిన అధ్యయనంలో తేలింది. 2010 నుంచి గమనిస్తే ఈ స్థాయిలో అమ్మకాలు క్షీణించడం ఇదే తొలిసారి. దీనివల్ల 22,600 కోట్ల రూపాయల ఆదాయాన్ని భారతీయ రియల్ ఎస్టేట్ వర్గాలు కోల్పోయాయి. ప్రభుత్వ ఖజానాకు సైతం 1,200 కోట్ల రూపాయల గండి పడింది. స్టాంప్ డ్యూటీ ఆదాయం తగ్గిపోయింది. నిరుడు అక్టోబర్-డిసెంబర్‌లో 8 ముఖ్య నగరాల్లో జరిగిన రెసిడెన్షియల్ హౌసింగ్ అమ్మకాలు 40,936 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే అంతకుముందు ఏడాది అక్టోబర్-డిసెంబర్‌లో ఇవి 72,933 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు జూలై-సెప్టెంబర్‌లోనూ 68,734 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో పాత పెద్ద నోట్ల రద్దు కారణంగానే అక్టోబర్-డిసెంబర్‌లో గృహ అమ్మకాలు దిగజారాయని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. నూతన గృహావిష్కరణలు కూడా 61 శాతం పడిపోయి 24,316 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక అమ్మకాలు అత్యధికంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో దిగజారాయని, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్‌ల్లోనూ విక్రయాలు తగ్గిపోయాయని నైట్ ఫ్రాంక్ సర్వే చెబుతోంది.
వాడిన కార్లపైనా..
పాత పెద్ద నోట్ల రద్దు.. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలనూ దెబ్బతీసింది. నవంబర్‌లో 42 శాతం విక్రయాలు పడిపోయినట్లు ఇండియన్‌బ్లూబుక్ (ఐబిబి) తెలిపింది. వాడిన కార్ల కొనుగోళ్లు 85 శాతం నగదు రూపేణా లేదా రుణాలపైనే జరుగుతున్నాయి. దీంతో నగదు కొరత ఈ రంగాన్ని తీవ్రంగానే దెబ్బతీసింది.
త్రైమాసిక ఫలితాలపైనా..
ముంబయి: వరుసగా మూడేళ్లపాటు 6.3 శాతం వృద్ధితో దూసుకెళ్తున్న కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు.. పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా అక్టోబర్-డిసెంబర్‌లో 4 శాతం పడిపోవచ్చని క్రిసిల్ నివేదిక తెలిపింది. నోట్ల రద్దుతో వ్యాపార లావాదేవీల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని, ఆదాయం గణనీయంగా పడిపోయిందని క్రిసిల్ పేర్కొంది.