బిజినెస్

జల విద్యుదుత్పత్తికి దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: వివిధ దేశాల్లో బహుళ విద్యుత్ ఉత్పాదన రంగంలో దిగ్గజమైన స్విట్జర్లాండ్‌కు చెందిన ‘బికెడబ్ల్యు ఎనర్జీ ఎజి’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో జలవిద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ముందుకొచ్చింది. అణు విద్యుత్ నుంచి పునరుత్పాదక విద్యుదుత్పత్తి దాకా అనేక రంగాల్లో ఈ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటిగా పేరుపొందింది. అనేక రకాల విద్యుత్ ఉత్పాదనల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించటానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. సోమవారం జ్యూరిచ్‌లో కంపెనీ ప్రతినిధి, ఇంజనీరింగ్ అండ్ హైడ్రో ఇన్‌ఫ్రా విభాగం అధిపతి పాల్‌కాజ్ ఎస్‌ఐసిసి ప్రెసిడెంట్ చైర్మన్ ఫ్రాన్సిస్కో ఘెరిలతో ఏర్పాటైన ద్వైపాక్షిక చర్చల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జలవిద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని తాము 3 శాతం నుంచి 10 శాతానికి పెంచుతామని వారు ముఖ్యమంత్రికి తెలిపారు.
పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టులో భాగంగా తాము 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నామని, దీనికి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిని కోరారు. జలవిద్యుత్, అణు విద్యుత్, సౌర విద్యుదుత్పత్తి రంగాల్లో కంపెనీకి సొంత ఉత్పాదక కేంద్రాలున్నాయి. ప్రణాళికా రచన, నిర్వహణ, విద్యుదుత్పత్తి, పంపిణీ రంగాల్లో విఖ్యాత సంస్థ బికెడబ్ల్యు ఎనర్జీకి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లో 5 వేల మంది ఉద్యోగులున్నారు. స్విట్జర్లాండ్ పవర్ గ్రిడ్ ద్వారా ఈ కంపెనీ 10 లక్షల ఇళ్లకు నిరంతర విద్యుత్‌ను పంపిణీ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ అన్ని రకాల విద్యుదుత్పత్తి రంగంలోకి తాము త్వరలో ప్రవేశించనున్నామని తెలిపారు. సౌర, పవన విద్యుదుత్పత్తి రంగాల్లోకి ప్రవేశించామన్నారు. విద్యుత్ సంస్కరణలతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేశామని, పంపిణీ నష్టాలు లేని రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించిందని ముఖ్యమంత్రి వివరించారు. బికెడబ్ల్యు కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి స్విస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌ఐసిసిఐ) సంధానకర్తగా వ్యవహరిస్తోంది. భారత్‌లో మరిన్ని ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు, వౌలిక సదుపాయాల కల్పనకు ఎస్‌ఐసిసిఐ సహకరిస్తోంది.
‘యూరోపియన్ ఎడ్యుకేషన్’
ప్రతినిధులతో సమావేశం
చంద్రబాబు నాయుడు యూరోపియన్ ఎడ్యుకేషనల్ అండ్ రిసెర్చ్ కౌన్సిల్ ప్రతినిధులతో ఏర్పాటైన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. విద్యాసంస్థల్లో పరిశోధనలకు, కర్మాగారాల్లో ఉత్పత్తికి మధ్య అనుసంధానం ఉండాలన్నదే ఈ సంస్థ ఉద్దేశం. యూరోపియన్ సాంకేతిక ఛత్రంలో ఇదో భాగం. యూరప్‌కు చెందిన ఈ సంస్థ సాంకేతికతకు ఒక ఛత్రంగా పేరొందింది. భారత విశ్వవిద్యాలయాలతో కలిసి పరిశోధన, తయారీ పరిశ్రమల ఏర్పాటుకు యోచిస్తోంది. జర్మనీలో ఇఇఎఆర్‌సి వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్ వంగపండు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వైమానిక, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో రాజ్ పరిశోధనలు చేశారు. ఆటోమొబైల్ క్లస్టర్ల ఏర్పాటులో సహకరించటానికి సంసిద్ధతను రాజ్ వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ జర్మన్ టెక్నాలజీపై, ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగంలో ఆ దేశానికున్న సాంకేతిక ఆధిపత్యంపై తమకు ఆసక్తి ఉందని తెలిపారు. దేశంలో అత్యధిక యువత తమకు కలిసొచ్చే అంశమని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సాంకేతిక పరిజ్ఞానం తమ బలాలని వివరించారు.
స్విట్జర్లాండ్‌లో ఏరోస్పేస్
సదస్సుకు ఆహ్వానం
స్విట్జర్లాండ్‌లోని భారత ప్రభుత్వ రాయబారి స్మిత పురుషోత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. మార్చిలో నిర్వహించే ఏరోస్పేస్ సదస్సులో పాల్గొనాలని ఆయనను ఆహ్వానించారు. ఈ సదస్సులో ప్రపంచంలో అతిపెద్ద ఏరోస్పేస్ సంస్థలన్నీ పాల్గొంటున్నాయని ఆమె వివరించారు. దీనిపై పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు బదులిచ్చారు.

చిత్రం..జ్యూరిచ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు